పీఎఫ్‌పై 8.65శాతం వడ్డీ!

త్వరలో ప్రకటన విడుదల చేయనున్న కార్మికశాఖ 

న్యూఢిల్లీ: 2018-19 ఆర్థిక సంవత్సరానికిగానూ ఉద్యోగ భవిష్యనిధి డిపాజిట్లపై వడ్డీని 8.65 శాతంగా నిర్ణయిస్తూ కార్మిక మంత్రిత్వశాఖ ప్రకటన వెలువరిస్తుందని ఆ శాఖా మంత్రి సంతోష్‌ గాంగ్వర్‌ అన్నారు. శుక్రవారం దిల్లీలో జరిగిన ప్రైవేటు సెక్యూరిటీ గార్డుల సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పీఎఫ్‌పై 8.65శాతం వడ్డీ ఇచ్చేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ఏమాత్రం విభేదించటం లేదన్నారు. త్వరలోనే దీనిపై నోటిఫికేషన్‌ విడుదలవుతుందని పేర్కొన్నారు. దీంతో ఆరుకోట్ల మంది పీఎఫ్‌ చందాదారులకు లబ్ధి చేకూరనుందని తెలిపారు. 
ఫిబ్రవరిలో సంతోష్‌ గాంగ్వర్‌ నేతత్వంలోని ఈపీఎఫ్‌వో కేంద్ర ధర్మకర్తల మండలి, ఈ మేరకు వడ్డీ పెంచేందుకు సభ్యుల ఆమోదం తీసుకుంది. ఈ ప్రతిపాదనను ఆర్థిక మంత్రిత్వశాఖకు బదిలీ చేసింది. ఆర్థిక సేవల విభాగం(డీఎఫ్‌ఎస్‌) ఏప్రిల్‌లో 2018-19 సంవత్సరానికి పీఎఫ్‌పై 8.65శాతం వడ్డీ ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసింది. ఇప్పుడు ఆదాయ పన్ను విభాగం, కార్మిక శాఖ సంయుక్తంగా నోటిఫై చేయడమే మిగిలి ఉంది. ప్రకటన విడుదల తర్వాతే ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ చందాదారుల ఖాతాలో వడ్డీని జమ చేయనుంది. ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ లెక్కల ప్రకారం.. 8.65 శాతం వడ్డీ ఇస్తే, రూ.151.67 కోట్ల మిగులు ధనం. 8.70 శాతం ఇస్తే, 158 కోట్ల ద్రవ్యలోటు సంస్థ భరించాల్సి ఉంటుంది. అందుకే 2018-19కి గాను 8.65 శాతం వడ్డీని నిర్ణయించినట్లు సమాచారం. 2017-18 సంవత్సరానికి పీఎఫ్‌ వడ్డీరేటును ఐదేళ్ల కనిష్ఠానికి తగ్గించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం 8.55శాతం వడ్డీనే ఇస్తున్నారు.