డెంగీపై హైకోర్టు సీరియస్‌

వారం రోజుల్లోగా పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశం 

హైదరాబాద్‌: రాష్ట్రంలో డెంగీ విజంభణపై హైకోర్టు ఆందోళన వ్యక్తంచేసింది. డెంగీ నియంత్రణకు సంబంధించి వారం రోజుల్లోగా పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించింది. వ్యాధి నియంత్రణకు, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందో వివరించాలని ఆదేశాలు చేసింది. కరుణ అనే వైద్యురాలు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై శుక్రవారం హైకోర్టు విచారణ చేపట్టింది. ముఖ్యంగా హైదరాబాద్‌లో డెంగీ తీవ్రత ఎక్కువగా ఉందని, కొన్ని వేల మంది విద్యార్థులు ఈ వ్యాధితో బాధపడుతున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదంటూ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై హైకోర్టు స్పందించింది. తాము కూడా ఈ విషయాన్ని రోజూ పత్రికల్లో చూస్తున్నామని, రాష్ట్రంలో అత్యవసర పరిస్థితులు తలపిస్తున్నాయని కోర్టు అభిప్రాయపడింది. నియంత్రణ చర్యలు చేపట్టాల్సిన అవసరముందని పేర్కొంది. ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో, ప్రజల్లో ఎలాంటి అవగాహన కల్పించారో సెప్టెంబర్‌ 7వ తేదీలోగా సమర్పించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.