నేడు పాలమూరుకు కేసీఆర్
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులను పర్యవేక్షించనున్న సీఎం
హైదరాబాద్:
ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులను పర్యవేక్షించనున్నారు. అలాగే కరివేన, వట్టెం, ఏదుల రిజర్వాయర్లతో పాటు.. నార్లాపూర్ పంప్‌హౌజ్ పనుల పురోగతిపై కేసీఆర్ సమీక్ష చేయనున్నారు.
ఇటీవల జరిగిన సమీక్ష సమావేశంలో అధికారులు కాళేశ్వరం ప్రాజెక్టు మాదిరిగానే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కూడా శరవేగంగా పూర్తిచేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రాజెక్టు పనులపై ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించిన ఆయన..వచ్చే వర్షాకాలంనాటికి పంట పొలాలకు నీరు అందించాలన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టుల పనులన్నింటినీ సత్వరం పూర్తిచేస్తే, పాలమూరు జిల్లాలోని సగం వ్యవసాయ భూములకు నీరు అందుతుందన్నారు. మిగిలిన సగానికి పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారానే నీరివ్వాలని, రేయింబవళ్లు మూడు షిప్టులూ పనిచేసి పనులు ముగించాలని అన్నారు.పాలమూరు ప్రాజెక్టులో భాగంగా ప్రస్తుతం జరుగుతున్న పనులతో పాటు భవిష్యత్తులో చేయాల్సినవాటిపైనా అధికారులతో సీఎం చర్చించారు. ప్రాజెక్టు పరిధిలోని రిజర్వాయర్లు, పంపు హౌస్‌లు, కాలువల పనులను సమాంతరంగా చేపట్టాలని స్పష్టంచేశారు. సీనియర్ అధికారులు ఎప్పటికప్పుడు క్షేత్రపర్యటనలు జరిపి, పనుల్లో వేగం పెంచాలని కోరారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పరిధిలోని ఏదుల, వట్టెం పంప్‌హౌస్ పనులు సంత ప్తికరంగా సాగుతున్నాయి. అటవీ ప్రాంతంలో ఉన్నందున నార్లాపూర్ పంప్‌హౌస్ పనుల్లో కొంత ఆలస్యమవుతోంది. వట్టెం 55%, కర్వెన 45%, ఏదుల 98%, నార్లాపూర్ పనులు 60 శాతం పూర్తయ్యాయి. ముందుగా రోజుకు టీఎంసీ నీళ్లు ఎత్తిపోసే పనులు పూర్తిచేసి, వరదకాలంలో రోజుకు అదనంగా మరో టీఎంసీ ఎత్తిపోసుకుని 100 రోజుల్లో 100 టీఎంసీలు ఎత్తిపోసి పదిలక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలనేది సీఎం కేసీఆర్ లక్ష్యం. మొత్తంగా ఉమ్మడి పాలమూరులో 20 లక్షల ఎకరాలు సాగులోకి తేవాలనేది తమ ఉద్దేశమని కేసీఆర్ అక్కడి ప్రాజెక్టు అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు.