ఆర్‌బీఐని దోచుకున్నారు
కేంద్రంపై రాహుల్ విమర్శలు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వానికి భారీ స్థాయిలో నిధులు బదిలీ చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) అంగీకరించిన నేపథ్యంలో మోదీ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ. ఈ చర్యను దోపిడీతో పోలుస్తూ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. ‘ప్రధాని, ఆర్థికమంత్రి స్వయంగా సష్టించుకున్న ఆర్థిక విపత్తు నుంచి ఎలా బయటపడాలో వారికి తెలియట్లేదు. ఆర్‌బీఐ నుంచి దోచుకున్నంత(నిధుల బదిలీని ఉద్దేశిస్తూ) మాత్రాన అది పనిచేయదు. ఇది ఎలా ఉందంటే.. మందుల దుకాణం నుంచి బ్యాండ్‌ఎయిడ్‌ను దోచుకుని తుపాకీ గాయానికి వేసుకున్నట్లే’ అని రాహుల్ ట్విటర్ వేదికగా ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు. దీనికి ఓ హాష్‌ట్యాగ్ కూడా ఇచ్చారు.
ప్రభుత్వానికి రూ.1.76 లక్షల కోట్ల మేర డివిడెండు, అదనపు నిధులను బదిలీ చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) బోర్డు ఆమోద ముద్ర వేసింది. ఓ వైపు ద్రవ్యలోటు పెరగకుండానే మరో వైపు మందగమనం పాలవుతున్న ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలు అందించాల్సిన తరుణంలో ప్రభుత్వానికి ఈ నిధులు అందుతున్నాయి. 2018-19 ఏడాదికి గాను మొత్తం రూ.1,76,051 కోట్లను బదిలీ చేయడానికి గవర్నర్ శక్తికాంత దాస్ నేత త్వంలోని ఆర్‌బీఐ కేంద్ర బోర్డు అనుమతి తెలిపింది. ఇందులో రూ.1,23,414 కోట్లు అదనపు నిధులు కాగా, రూ.52,637 కోట్లు అదనపు కేటాయింపులుగా గుర్తించినట్లు ఆర్‌బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటివరకు ఆర్‌బీఐ ప్రభుత్వానికి ఇచ్చిన నిధులలో ఇదే అత్యధికం.