ఆర్థిక వ్యవస్థ దిగజారిపోతోంది

పత్రికాప్రకటనలే సాక్ష్యం: ప్రియాంకాగాంధీ 

న్యూఢిల్లీ: దిగజారుతున్న ఆర్థిక వ్యవస్థపై కేంద్రంపై విమర్శలు గుప్పిస్తున్న విపక్షాలు తమ స్వరాన్ని మరింత పెంచుతున్నాయి. ఆర్థిక వ్యవస్థ మందగమనం, కోల్పోతున్న ఉద్యోగాలు, అదుపుతప్పుతున్న ద్రవ్యోల్భణం, ఆర్బీఐ నిధులను వాడుకోవడంపై కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఘాటు విమర్శలు సంధిస్తుండగా, తాజాగా కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి (ఈస్ట్‌ యూపీ) ప్రియాంక గాంధీ వాద్రా సైతం కేంద్రంపై ధ్వజమెత్తారు. మన ఆర్థిక వ్యవస్థ దిగజారిపోతోందనడానికి పేపర్లలో వస్తున్న అడ్వర్‌టైజ్‌మెంట్‌లే నిదర్శనమని అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలిలో మంగళవారంనాడు జరిగిన కార్యక్రమంలో ప్రియాంక గాంధీ మాట్లాడుతూ, తాము మునిగిపోతున్నాం, కాపాడమంటూ టీఎస్టేట్‌ యూనియన్లు, మిల్‌ అసోసియేషన్లు ఇచ్చిన అడ్వర్‌టైజ్‌మెంట్లను వార్తాపత్రికల్లో తాను చూశానని చెప్పారు. దేశ ఆర్థిక పరిస్థితి దిగజారిపోతున్న పరిస్థితికి ఈ ప్రకటనలు అద్దంపడుతున్నాయని అన్నారు. అంతకుముందు రాహుల్‌ సైతం ఓ ట్వీట్‌లో దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభంపై కేంద్రంపై విరుచుకుపడ్డారు. ఈ సంక్షోభానికి కారణమైన ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు దాన్ని ఎదుర్కోవాలో తెలియడం లేదని, రిజర్వ్‌ బ్యాంకును కొల్లగొట్టి, పెద్ద మొత్తంలో నిధులు తీసుకున్నంత మాత్రాన ఆర్థిక సంక్షోభాన్ని నివారించలేరని ఎద్దేవా చేశారు. ‘ఆర్బీఐ లూటెడ్‌’ అంటూ తన ట్వీట్‌కు హ్యాష్‌ట్యాగ్‌ ఇచ్చారు.