అంతా..చిదంబర రహస్యం

యూపీఏ హయాంలో హోం, ఆర్థిక మంత్రిత్వ శాఖలను నిర్వహించిన చిదంబరం తనకు అడ్డులేదన్న అహంభావంతో విశంఖలంగా వ్యవహరించడం, ప్రత్యర్థులను బూటకపు కేసుల్లో ఇరికించడం, చివరకు ముఖ్యమంత్రుల మార్పిడిలో కూడా లావాదేవీలకు పూనుకోవడం చరిత్రలో రికార్డు అయ్యాయి. హిందూ ఉగ్రవాదం అనే పదాన్ని సష్టించి దేశభక్తులను వెంటాడి, వేధించిన వ్యక్తి చిదంబరం. ఆ పాపాలే ఇవాళ ఆయనను చుట్టుముట్టాయి. 
రాజకీయాల్లో నేతల ప్రవర్తన వ్యవహార శైలి ప్రజలకోసం, పార్టీ కోసం వారు పనిచేసిన తీరు.. వీటిని బట్టి వారికి గౌరవం లభిస్తుంది. గత శనివారం నాడు కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ మరణించిన తర్వాత ఎల్లెడలా కనిపించిన స్పందన చూసి ఆయన తన జీవిత కాలంలో ఎంతటి గౌరవాన్ని సంపాదించారో అర్థమవుతుంది. అధికార పార్టీ నేతలే కాదు, ప్రతిపక్ష నేతలు, ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, ఆర్థిక నిపుణులు, మేధావులు, జర్నలిస్టులు జైట్లీ మరణం పట్ల తీవ్ర సంతాపం ప్రకటించారు. పత్రికల్లో నివాళి వ్యాసాలు రచించారు. సుదీర్ఘకాలం న్యాయవాదిగా ఉండి, తర్వాత రాజకీయాల్లో ప్రవేశించి అధికార ప్రతినిధి నుంచి కేంద్రమంత్రిగా అంచెలంచెలుగా ఎదిగిన జైట్లీ ఇంతమంది అభిమానుల్ని ఎలా సంపాదించుకోగలిగారు? భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటూనే, పార్టీ ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరిస్తూనే ఇతర పార్టీల్లో కూడా అభిమానాన్ని ఎలా చూరగొనగలిగారు? దాదాపు నాలుగుదశాబ్దాల రాజకీయ జీవనంలో ఆయనపై ఏ వివాదమూ లేదు, ఏ ఒక్క అవినీతి ఆరోపణా లేదు. మీడియాలో ప్రత్యర్థులను ధాటీగా ఎదుర్కొన్నా, ఏ ప్రతిపక్ష నేతా ఆయనపై వ్యక్తిగతంగా పల్లెత్తు దాడి చేయలేదు. దేశ ప్రయోజనాలకు అవసరమైన జీఎస్టీ వంటి నిర్ణయాల్ని తీసుకునేటప్పుడు నిక్కచ్చిగా వ్యవహరిస్తూనే సాధ్యమైనంత వరకూ అందర్నీ కలుపుకుపోవడం తన తత్వంగా ఆయన నిరూపించుకున్నారు. సమస్యల్ని పరిష్కరించడమే తప్ప సమస్యల్ని సష్టించడం ఆయన వ్యక్తిత్వం కాదని తేటతెల్లం చేసుకున్నారు. అదే జైట్లీ విజయ రహస్యం. 
అరుణ్‌ జైట్లీ మరణానికి కొద్ది రోజుల ముందే మరో మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం అరెస్టు అయ్యారు. చిదంబరం తక్కువ రాజకీయ అనుభవం గల నాయకుడేమీ కాదు. ఆర్థిక వ్యవహారాల్లో అందెవేసిన చేయిగా నిరూపించుకున్నారు. మేధావిగా కూడా గుర్తింపు పొందారు. కాని అలాంటి వ్యక్తి అరెస్టు అయినప్పుడు కాంగ్రెస్‌లో కొద్దిమంది తప్ప బాధను వ్యక్తం చేసిన వారు చాలా తక్కువ మంది. ఆయనతో అనుభవం ఉన్న చాలా మంది కాంగ్రెస్‌ నేతలు లోలోపల కొంత సంతోషం కూడా వ్యక్తం చేసినట్లు కూడా వినికిడి. ఎందుకంటే హోంమంత్రిగా, ఆర్థిక మంత్రిగా ఉన్న కాలంలో చిదంబరం తాను చేపట్టిన కొన్ని కక్ష సాధింపు చర్యల వల్ల ఎంతోమంది శత్రువులను సంపాదించుకున్నారు. ఉదాహరణకు ఇటీవల మరణించిన మరో దిగ్గజ నేత సుష్మా స్వరాజ్‌ అరుణ్‌ జైట్లీతో కలిసి 2011లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విడుదల చేసిన ప్రకటన చూస్తే చిదంబరం ఎంత దుర్మార్గంగా వ్యవహరించారో అర్థమవుతుంది. ఆనాడు హోం మంత్రిగా ఉన్న చిదంబరం తన స్వంత పార్టీకి చెందిన ఆర్థిక మంత్రి, ఇవాళ భారత రత్న పురస్కారాన్ని పొందిన ప్రణబ్‌ ముఖర్జీ కార్యాలయంలో కొన్ని ఏజెన్సీల ద్వారా అక్కడి సంభాషణల్ని రికార్డు చేసేందుకు బగ్గింగ్‌ చేయించారు. వాటిని తొలగించడానికి ప్రణబ్‌ ముఖర్జీ మరో ప్రైవేట్‌ ఏజెన్సీని నియమించాల్సి వచ్చింది. ఆనాడు ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రధానమంత్రి కార్యాలయానికి పంపిన నోట్‌ ప్రకారం చిదంబరం ఈ బగ్గింగ్‌కు కారణమని తేలింది. 
తన మంత్రివర్గంలో ఎలాంటి లుకలుకలు లేవని నాటి ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ స్వయంగా ప్రకటించగా, అప్పటి కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ స్వయంగా కల్పించుకుని ఇద్దరు మంత్రులకూ సర్ది చెప్పాల్సి వచ్చింది. అంతేకాదు, 2జీ కుంభకోణంలో కోట్లాది రూపాయల కుంభకోణం జరిగినప్పుడు పాత ధరలకు స్పెక్ట్రం అమ్మకానికి చిదంబరం అనుమతినిచ్చినట్లు రికార్డుల్లో నమోదైంది. అప్పటి జీఓఎంలో ఉన్న ప్రణబ్‌ ముఖర్జీ, భరద్వాజ వంటి హేమాహేమీల సూచనలకు భిన్నంగా ఆయన వ్యవహరించారు. ఎయిర్‌ సెల్‌ -మాక్సిస్‌ వ్యవహారంలోనూ, ఐఎన్‌ఎక్స్‌ మీడియా వ్యవహారంలోనూ కోట్లాది రూపాయల విదేశీ పెట్టుబడులను అక్రమంగా అనుమతించి మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు జరుగుతోంది. చిదంబరం కుమారుడు కార్తీ కూడా కోట్లాది రూపాయల మనీలాండరింగ్‌ కేసులో చిక్కుకుని బెయిల్‌పై ఉన్నారు. చిదంబరం సతీమణి నళినిపై కూడా, కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దోచిన శారదా చిట్‌ఫండ్‌ నుంచి భారీ మొత్తాన్ని స్వీకరించారనే ఆరోపణపై కేసు నడుస్తోంది. చిదంబరం కుటుంబానికి దేశంలోనూ, విదేశాల్లోనూ వేల కోట్ల మేరకు ఆస్తులున్నాయన్న విషయం సోషల్‌ మీడియాలో గుప్పుమంటోంది. చిదంబరానికి 12 దేశాల్లో 17 బ్యాంకు ఖాతాలున్నాయని తెలుస్తోంది. సంపన్న చెట్టియార్‌ కుటుంబం నుంచి వచ్చిన చిదంబరం యుపిఏ హయాంలో తనకు అడ్డులేదన్న అహంభావంతో విచ్చలవిడిగా విశంఖలంగా వ్యవహరించడం, ప్రత్యర్థులను బూటకపు కేసుల్లో ఇరికించడం, చివరకు ముఖ్యమంత్రుల మార్పిడిలో కూడా లావాదేవీలకు పూనుకోవడం చరిత్ర గమనంలో రికార్డు అయ్యాయి. ఆ పాపాలే ఇవాళ ఆయనను చుట్టుముట్టాయనడంలో సందేహం లేదు. తాను సచ్ఛీలుడు కానందువల్లే తనను తాను కాపాడుకునేందుకు చిదంబరం తన ప్రత్యర్థుల్ని ఉచ్చులోకి ఇరికించేందుకు కుట్రపూరితంగా వ్యవహరించారు. సాక్షాత్తూ ప్రణబ్‌ ముఖర్జీ వంటి సీనియర్‌ సహచరుని కార్యాలయంలోనే బగ్గింగ్‌ పరికరాలు అమర్చిన చిదంబరం తన హయాంలో జీవితంలో ఎలాంటి మచ్చపడని అరుణ్‌ శౌరి, జస్వంత్‌ సింగ్‌ వంటి సీనియర్‌ నేతలను ప్రశ్నించేందుకు కూడా సిబిఐని ప్రయోగించారు. 
నిజాలు మాట్లాడుతున్నందుకే చిదంబరం వంటి గౌరవనీయమైన వ్యక్తిని మోదీ సర్కార్‌ వేటాడుతున్నదని, అధికారాన్ని దుర్వినియోగపరుస్తున్నారని కాంగ్రెస్‌ కుటుంబ వారసులు రాహుల్‌ గాంధీ, ప్రియాంకా వాద్రాలు విమర్శిస్తున్నారు. ఇదే గాంధీ కుటుంబం ప్రేరణతో చిదంబరం పెట్రేగిపోయి ఒకప్పుడు నరేంద్ర మోదీ, అమిత్‌ షాలను వెంటాడి, వేటాడిన ఉదంతాల్ని వారు మరిచిపోతున్నారు. గుజరాత్‌లో అల్లర్లు జరిగిన 8 సంవత్సరాల తర్వాత 2010లో సిబిఐ ప్రత్యేక దర్యాప్తు బందం (సిట్‌) అయిదు గంటల చొప్పున వరుసగా రెండు సార్లు గాంధీనగర్‌లో నాటి ముఖ్యమంత్రి నరేంద్రమోదీని ప్రశ్నించింది. అయినా మోదీ చెక్కు చెదరలేదు. ‘ఎవరూ చట్టానికి అతీతులు కారు’ అని ఆయన ప్రకటించారు. మోదీ తన రాజ్యాంగ విధిని నిర్వర్తించడంలో విఫలమయ్యారన్న విషయంలో ఎలాంటి సాక్ష్యాధారాలు లభించలేదని సిట్‌ అదే సంవత్సరం క్లీన్‌ చిట్‌ ఇచ్చింది. 
అదే సంవత్సరం నాడు హోంమంత్రిగా ఉన్న అమిత్‌ షాకు సోహ్రబుద్దీన్‌ అనే ఉగ్రవాది ఎన్‌కౌంటర్‌ కేసులో సిబిఐ నోటీసులు పంపింది. 2010లోనే ఆయన తన పదవికి రాజీనామా చేసి సిబిఐ కోర్టుకు లొంగిపోయారు. చేయని నేరానికి జైలు శిక్షను అనుభవించారు. ఆ తర్వాత ఆయనకు బెయిల్‌ లభించినా గుజరాత్‌లో ప్రవేశించకుండా రెండేళ్లపాటు నిషేధించారు. తర్వాత సుప్రీంకోర్టు ఆయనను రాష్ట్రంలో అనుమతించిన తర్వాత కూడా కేసును ముంబైకు బదిలీ చేశారు. చివరకు ఎలాంటి సాక్ష్యాధారాలు లేవని తేల్చిన న్యాయస్థానం అమిత్‌ షాతో పాటు 22 మందిని విడుదల చేసింది. ఎవరికోసం చిదంబరం అమిత్‌ షాను వెంటాడారు. సోహ్రబుద్దీన్‌ నిషేధిత లష్కర్‌ ఏ తాయిబాతోనూ, పాకిస్థాన్‌ గూఢచారి సంస్థ ఐఎస్‌ఐ తోనూ సంబంధం ఉన్న వ్యక్తి కాదా? ముఖ్యమైన నేతలను హత్య చేసి మత కల్లోలాలను స ష్టించాలనుకున్న నేరచరితుడు కాదా? గుజరాత్‌, రాజస్థాన్‌లలో ముగ్గురాళ్ల వ్యాపారులను బెదిరించి డబ్బులు వసూలు చేసే మాఫియా డాన్‌ కాదా? అలాంటి వ్యక్తి ఎన్‌కౌంటర్‌ను వివాదాస్పదం చేసి, ఐబి క్లీన్‌ చిట్‌ ఇచ్చిన తర్వాత కూడా సిబిఐని ప్రయోగించి అమిత్‌ షాను వేటాడిన వ్యక్తి చిదంబరం. దేశంలో హిందూ ఉగ్రవాదం అనే పదాన్ని స ష్టించి దేశభక్తులను వెంటాడి, చిత్రహింసలకు గురి చేయించిన వ్యక్తి చిదంబరం. ఇవాళ ఆయనే తన ఆర్థిక నేరాలు, అవినీతి కారణంగా అరెస్టయితే ఎవరికి జాలి ఉంటుంది? తనకు తిరుగులేదని విర్రవీగిన నేతలంతా ఏదో ఒకప్పుడు తాము చేసిన కర్మలకు తామే బలి అవుతారన్నదానికి చిదంబరం ఉదంతమే నిదర్శనం.