30 వరకూ కస్టడీలోనే
సీబీఐకు అనుమతి ఇచ్చిన ప్రత్యేక న్యాయస్థానం
న్యూఢిల్లీ, ఆగస్టు 26: మాజీ ఆర్థిక మంత్రి చిదంబరాన్ని ఐఎస్‌ఎక్స్ మీడియా కుంభకోణంలో మరో నాలుగు రోజుల పాటు(ఆగస్టు 30 వరకు) తన కస్టడీలో ఉంచుకొనేందుకు ప్రత్యేక న్యాయస్థానం సీబీఐకు అనుమతి ఇచ్చింది. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు పూర్తి కాలేదన్న సీబీఐ వాదనతో కోర్టు అంగీకరించింది. చిదంబరానికి వ్యతిరేకంగా ఒక్క సాక్ష్యాన్ని కూడా సీబీఐ చూపించలేక పోయిందని, కనీసం ఆయన్ను కుంభకోణానికి సంబంధించిన ప్రశ్నలు అడగటం లేదని కపిల్ సిబల్ వాదించగా, న్యాయస్థానం ఆ వాదనలను పట్టించుకోలేదు.
సుప్రీంలో చుక్కెదురు
ఐఎస్‌ఎక్స్ మీడియా కేసులో చిదంబరం ముందస్తు బెయిలు పిటిషన్‌ను తోసిపుచ్చుతూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఆయన వేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ కేసులో ఇప్పటికే సీబీఐ ఆయన్ను అరెస్టు చేసినందున పిటిషన్ అర్థరహితమని జస్టిస్ భానుమతి, జస్టిస్ బోపన్నలతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. చట్టప్రకారం చిదంబరం తన విడుదల కోసం ప్రయత్నాలు చేసుకోవచ్చని చెప్పింది. మరోపక్క ఇదే అంశానికి సంబంధించి ఈడీ కేసులో చిదంబరానికి అరెస్టు నుంచి ఉపశమనాన్ని మంగళవారం వరకు పొడిగించింది.
అరెస్టు చేస్తే ప్రజలు దోషి అనుకుంటారని, ప్రభుత్వ చర్య వ్యక్తి ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఉందని కపిల్ సిబల్ వాదించారు. సీబీఐ దర్యాప్తులో భాగంగా చిదంబరాన్ని నీతి ఆయోగ్ మాజీ సీఈవో సింధుశ్రీ ఖుల్లార్‌ను ఎదురెదురుగా కూర్చోబెట్టి ప్రశ్నించారు. కాగా, బ్యాంకు రుణాల కుంభకోణంలో అరెస్టయిన మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్ మేనల్లుడు రతుల్ పూరీని మరో 4 రోజులు కస్టడీలో ఉంచుకొనేందుకు ఢిల్లీ కోర్టు ఈడీని అనుమతించింది.