సాధ్వి నోట..చేతబడి మాటలు

బీజేపీ నేతల మరణాలకు కారణం ప్రతిపక్షాలే 

భోపాల్‌ : వివాదాస్పద వ్యాఖ్యలతో విమర్శలు మూటగట్టుకునే బీజేపీ ఎంపీ సాధ్వి ప్ఞ్రసింగ్‌ మరోసారి వార్తల్లోకెక్కారు. తమ పార్టీకి చెందిన సీనియర్‌ నేతల మరణాన్ని ఆకాంక్షిస్తూ ప్రతిపక్షం చేతబడి చేయిస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాజ్‌ చెప్పినట్లుగానే తాము ఇప్పుడు విపత్కర కాలం ఎదుర్కొంటున్నామని చెప్పుకొచ్చారు. కాగా దాదాపు ఇరవై రోజుల వ్యవధిలో బీజేపీ అగ్ర నేతలు, కేంద్ర మాజీ మంత్రులు సుష్మా స్వరాజ్‌, అరుణ్‌ జైట్లీ కన్నుమూసిన విషయం తెలిసిందే. దీంతో బీజేపీ శ్రేణులు విషాదంలో మునిగిపోయాయి. ఈ క్రమంలో సోమవారం విలేకరులతో మాట్లాడిన భోపాల్‌ ఎంపీ సాధ్వి ప్ఞ్ర…’ బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు క్షుద్ర పూజలు చేయిస్తున్నాయని మహారాజ్‌ గారు నాకు ఒకానొక సమయంలో చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే మాకు ఇప్పుడు చెడుకాలం జరుగుతోంది. అయితే అప్పుడు ఆయన చెప్పిన విషయాన్ని నేను మర్చిపోయాను. కానీ మా పార్టీకి చెందిన పలువురు అగ్రనేతలు ఒక్కక్కరుగా మమ్మల్ని విడిచి వెళ్తున్నారు. మహారాజ్‌ చెప్పింది నిజమేనేమోనని నాకు ఇప్పుడు అనినిపిస్తోంది’ అని పేర్కొన్నారు. 
తమ పార్టీ నేతలపై ప్రతిపక్షాలు చేతబడి చేస్తున్నాయంటూ ఆ పార్టీ పార్లమెంటు సభ్యురాలు ప్రగ్యాసింగ్‌ ఠాగూర్‌ చేసిన సంచలన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ పార్టీ కస్సుమంది. బీజేపీ మాత్రం ప్రగ్యా వ్యాఖ్యలపై స్పందించేందుకు నిరాకరించింది. బీజేపీ సీనియర్‌ నేతలు బాబూలాల్‌ గౌర్‌, అరుణ్‌ జైట్లీలకు నివాళులర్పించేందుకు ఏర్పాటు చేసిన సంతాప సభలో ప్రగ్యా తాజా వ్యాఖ్యలు చేశారు. తాను ఎన్నికల ప్రచారంలో ఉండగా ఓ సాధువు తనతో బీజేపీ నేతలపై ప్రతిపక్షం చేతబడి చేస్తుందని చెప్పారని, చెడుకాలం రాబోతున్నందున జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారని చెప్పారు. ఆ తర్వాత తాను ఆ విషయం మరిచిపోయానని, అయితే ఇప్పుడు ఒకరొక్కరుగా పార్టీ నేతలు మనలను విడిచివెళ్తుండటం చూస్తే ఆయన మాటలు గుర్తుకొస్తున్నాయని చెప్పారు. ‘మీరు నమ్మండి…నమ్మకపోండి…నేను చెప్పింది నిజం…జరిగిందదే’ అని ప్రగ్యా అన్నారు. 
కాగా, ప్రగ్యా వ్యాఖ్యలపై మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ విపక్ష నేత గోపాల్‌ భార్గవ మాట్లాడుతూ, ఇలాంటి వ్యాఖ్యలపై బాగా చెప్పగలిగింది కూడా ఆమేనని, ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయని, తాము మాత్రం ఇలాంటి (చేతబడులు) వాటిని నమ్మమని చెప్పారు. రాష్ట్ర మంత్రి జీతూ పట్వారి మాట్లాడుతూ, అరుణ్‌ జైట్లీ, బాబూలాల్‌ గౌర్‌లు బీజేపీ నేతలు మాత్రమే కాదని, దేశ నేతలని అన్నారు. వారిని తండ్రుల మాదిరి తాము భావిస్తామని, గౌరవిస్తామని చెప్పారు. ప్రగ్యా ఇంకెంతమాత్రం సాధ్వి కాదని, ఆమె ఒక ఎంపీ అని అన్నారు. ఒక పార్లమెంటేరియన్‌ స్థాయికి తగ్గట్టుగా ఆమె వ్యాఖ్యలు లేవని, ఇలాంటి మనస్తత్వం ఉంటే దేశాన్ని, భోపాల్‌ను ఎంతమాత్రం ఆమె ముందుకు తీసుకువెళ్లలేరని చురకలు వేశారు. కాంగ్రెస్‌ మరో నేత మనక్‌ అగర్వాల్‌ సైతం ప్రగ్యా వ్యాఖ్యలపై సూటిగా స్పందించారు. ‘ఎలాంటి చేతబడులను కాంగ్రెస్‌ నమ్మదు. ఇలాంటి వాటిల్లో ప్రగ్యాసింగ్‌ ఆరితేరారు. తన శాపం వల్లే హేమంత్‌ కర్కరే చనిపోయారని ఆమె వ్యాఖ్యానించిన విషయం మరిచిపోలేం’ అని అన్నారు.