మధ్యవర్తిత్వం అవసరం లేదు

ఇరు దేశాలు అన్ని సమస్యలను ద్వైపాక్షికంగా పరిష్కరించుకోగలవు: మోదీ 

‘భారత్‌, పాకిస్తాన్‌ మధ్య చాలా ద్వైపాక్షిక సమస్యలు ఉన్నాయి. కాబట్టి మూడో దేశాన్ని దేన్నీ మేము ఇబ్బంది పెట్టదల్చుకోవడం లేదు. ఈ అంశాలన్నిటినీ ద్వైపాక్షికంగా చర్చించి పరిష్కరించుకోగలం. 1947కు ముందు భారత్‌, పాకిస్తాన్‌ కలిసే ఉన్నాయి. ఇరు దేశాలు చర్చించుకుని తమ సమస్యలను పరిష్కరించుకోగలవని నేను గట్టిగా నమ్ముతున్నాను” 
-నరేంద్ర మోదీ 
  • వాణిజ్యం, రక్షణ సహకారంపై ఫలవంతమైన చర్చలు 
  • 1947కు ముందు భారత్‌, పాకిస్తాన్‌ కలిసే ఉన్నాయి 
  • ద్వైపాక్షిక వాణిజ్యం మరింతగా మెరుగుపరుస్తాం 
  • ఇరు దేశాలు పరస్పర సహకారం అందించుకుంటాం 
  • ప్రపంచ సంక్షేమానికి భారత్‌-అమెరికా కలిసి పనిచేస్తాయి 
  • జీ7 సమ్మిట్‌ సందర్భంగా భేటీ అయిన ట్రంప్‌-మోదీ

బియరిట్స్‌: 

కశ్మీర్‌ విషయంలో భారత్‌, పాకిస్తాన్‌ మధ్య మూడో దేశం మధ్యవర్తిత్వానికి గల అవకాశాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్ద్వద్వంగా తోసిపుచ్చారు. ఇరు దేశాలు అన్ని సమస్యలను ద్వైపాక్షికంగా పరిష్కరించుకోగలవని ఆయన స్పష్టం చేశారు. ఫ్రాన్స్‌లో జరుగుతున్న జీ7 సమ్మిట్‌ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో కలిసి మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీ ఈ మేరకు వ్యాఖ్యానించారు. ప్రధానితో సమావేశానికి ముందు తాను కశ్మీర్‌ అంశంపై ఆయనతో చర్చిస్తానంటూ ట్రంప్‌ పేర్కొన్న నేపథ్యంలో… దీనిపై ప్రధాని స్పష్టమై వైఖరి వెల్లడించడం గమనార్హం. కశ్మీర్‌ విషయంలో తాను భారత్‌, పాకిస్తాన్‌ దేశాలకు మధ్యవర్తిత్వానికి సిద్ధమంటూ ట్రంప్‌ ఇటీవల పలుమార్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. 
ఈ నేపథ్యంలో సోమవారం ప్రధాని మాట్లాడుతూ.. ”భారత్‌, పాకిస్తాన్‌ మధ్య చాలా ద్వైపాక్షిక సమస్యలు ఉన్నాయి. కాబట్టి మూడో దేశాన్ని దేన్నీ మేము ఇబ్బంది పెట్టదల్చుకోవడం లేదు. ఈ అంశాలన్నిటినీ ద్వైపాక్షికంగా చర్చించి పరిష్కరించుకోగలం” అని ప్రధాని పేర్కొన్నారు. 1947కు ముందు భారత్‌, పాకిస్తాన్‌ కలిసే ఉన్నాయనీ.. ఇరు దేశాలు చర్చించుకుని తమ సమస్యలను పరిష్కరించుకో గలవని తాను గట్టిగా నమ్ముతున్నానని ప్రధాని వివరించారు. ఇటీవల పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌తో జరిగిన ఫోన్‌ సంభాషణ సందర్భంగా… పేదరికం సహా ఇరు దేశాలు ఎదుర్కొంటున్న ఇతర అనేక అంశాలపై కలిసి కట్టుగా పనిచేద్దామని తాను చెప్పినట్టు గుర్తుచేశారు. 
కాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పందిస్తూ… ఆదివారం రాత్రి మోదీకి, తనకు మధ్య కశ్మీర్‌ అంశంపై చర్చ జరిగిందని తెలిపారు. భారత్‌, పాకిస్తాన్‌ రెండూ కలిసి దీన్ని పరిష్కరించు కోగలవని మోదీ చెప్పారని ఆయన అన్నారు. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేయడంతో పాటు రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజిస్తూ ఈ నెల 5న భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలోనే ట్రంప్‌, మోదీ తాజా సమావేశం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్‌ 370ని రద్దు చేయడం, ఈ నిర్ణయాన్ని పాకిస్తాన్‌ తీవ్రంగా వ్యతిరేకించడంతో.. దాయాది దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్టికల్‌ 370 రద్దు తమ అంతర్గత వ్యవహారమంటూ అంతర్జాతీయ సమాజానికి ఇప్పటికే స్పష్టం చేసిన భారత్‌… ఈ వాస్తవాన్ని పాకిస్తాన్‌ కూడా అంగీకరించాలని సూచించింది. 
భారత్‌- అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం మరింతగా మెరుగుపరుస్తామని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. శాంతి సహా అనేక విషయాలపై జీ7 సదస్సులో చర్చ జరిగిందని ఆయన తెలిపారు. జీ7 సదస్సులో భాగంగా ఫ్రాన్స్‌లో పర్యటిస్తున్న ఆయన.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో భేటీ అయ్యారు. అనంతరం ఇరువురూ సంయుక్తంగా నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రపంచ సంక్షేమానికి భారత్‌-అమెరికా కలిసి పనిచేస్తాయని మోదీ చెప్పారు. వాణిజ్యం, రక్షణ సహకారంపై సదస్సులో ఫలవంతమైన చర్చలు జరిగాయన్నారు. భారత్‌-పాక్‌ ఎన్నో ద్వైపాక్షిక అంశాలపై పోరాటం చేయాల్సి ఉందని ప్రధాని అభిప్రాయపడ్డారు. ఉగ్రవాదం, పేదరికం లాంటి ఎన్నో అంశాలపై భారత్‌-పాక్‌ యుద్ధం చేయాల్సి ఉందన్నారు. 
పాక్‌ ప్రధానిగా ఇమ్రాన్‌ఖాన్‌ ఎన్నికయ్యాక ఫోన్‌ చేసి అభినందించానని మోదీ గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా తామిద్దరం పలు అంశాలపై చర్చించుకున్నట్లు చెప్పారు. ట్రంప్‌ మాట్లాడుతూ కశ్మీర్‌ అంశంపైనా సదస్సులో చర్చ జరిగిందన్నారు. కశ్మీర్‌లో పరిస్థితులు అదుపులోనే ఉన్నట్లు మోదీ చెప్పారని ట్రంప్‌ వివరించారు. భారత్‌-పాక్‌ రెండూ అమెరికాకు మిత్ర దేశాలని ఆయన స్పష్టం చేశారు. కశ్మీర్‌ విషయం భారత్‌-పాక్‌ ద్వైపాక్షిక అంశమని.. రెండు దేశాలు చర్చించుకుని సమస్యను పరిష్కరించుకుంటాయని ట్రంప్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. 
జీ7 సదస్సులో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. బ్రిటన్‌, ఆస్ట్రేలియా ప్రధానులు అంతర్జాతీయ వాణిజ్యం, రక్షణ, పర్యావరణ అంశాలను పక్కనపెట్టి మరీ క్రికెట్‌ గురించి మాట్లాడుకున్నారు. ఉత్కంఠకరంగా సాగిన యాషెస్‌ మూడో టెస్టులో ఆసీస్‌ను ఇంగ్లాండ్‌ ఓడించిన విషయం చర్చించుకున్నారు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మోరిసన్‌ చిరునవ్వుతో బ్రిటన్‌ కొత్త ప్రధాని బోరిస్‌ జాన్సన్‌కు అభినందనలు తెలియజేశారు. కరచాలనం చేశారు. ‘మేమేదీ అంత సులభంగా వదిలిపెట్టం’ అని బ్రిటన్‌ ప్రధాని జాన్సన్‌ పేర్కొనగా ‘ఇంకా రెండున్నాయి.. ఇంకా రెండున్నాయి’ అని మోరిసన్‌ చమత్కరించారు. దీంతో అక్కడ నవ్వులు విరిశాయి. 
ఇంతకీ ఈ సమావేశంలో ప్రత్యేకత ఏంటంటే.. ఇంగ్లాండ్‌ గెలిచిన విషయాన్ని మొదట భారత ప్రధాని నరేంద్రమోదీ బయటపెట్టడం. ఆ తర్వాత ఆయన ఖాళీ సమయంలో ఐప్యాడ్‌ తెప్పించుకొని మరీ ఇంగ్లాండ్‌, ఆసీస్‌ మూడో టెస్టు హైలైట్స్‌ను వీక్షించారు. ఐదు టెస్టుల యాషెస్‌ 1-1తో సమం కాగా మరో రెండు మ్యాచులు ఉన్నాయి. మూడో మ్యాచ్‌లో బెన్‌స్టోక్స్‌ అద్భుతం చేసిన సంగతి తెలిసిందే.