పేర్ల మార్పుతో అవే పథకాలు

గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కొనసాగించిన పథకాల పేర్లను ప్రస్తుత వైసిపి ప్రభుత్వం శరవేగంగా మార్చేస్తోంది. అయితే టిడిపి ప్రభుత్వం కూడా అంతకు ముందటి కాంగ్రెస్‌ ప్రభుత్వంలో పెట్టిన పథకాల పేర్లన్నిటినీ మార్పు చేసింది. ఎవరు అధికారంలోకి వస్తే వారి నాయకుడి పేర్లు పథకాలకు పెట్టేసుకోవడం పరిపాటిగా మారడంపై ఇప్పుడు రాష్ట్రం అంతటా చర్చనీయాంశమవుతోంది. 
చంద్రబాబు నాయుడైనా, జగన్మోహనరెడ్డి అయినా పథకాల పేరుతో వారి సొంత సొత్తును పంచి పెట్టడం లేదు. ఎన్నికల్లో ఓట్ల కొనుగోళ్ల కోసమైతే వీరు తమ సొంత డబ్బును వెచ్చించారేమో గానీ, పథకాలకు ఖర్చు పెడుతున్నది మాత్రం కచ్చితంగా ప్రజల డబ్బే. ప్రజలు వివిధ రూపాల్లో ప్రభుత్వానికి చెల్లించిన డబ్బు అది. మరి ఆ ప్రజల డబ్బుతో ప్రభుత్వం ‘అత్త సొమ్ము అల్లుడు దానం చేసిన చందంగా’ వ్యవహరిస్తోంది. ఒక ముఖ్యమంత్రి తన తండ్రి పేరు తోనో, మరొక ముఖ్యమంత్రి తన మామ పేరు తోనో, లేదా తన పేరు తోనే పథకాలు ప్రకటించేసుకోవడం ఏమనుకోవాలి? కొన్నేళ్లు ముందుకు పోతే, 1983 నాటి రోజులను పరిశీలిస్తే.. అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు కొన్ని పథకాలకు పెట్టిన పేర్లు ఆసక్తిని కలిగిస్తాయి. కిలో బియ్యం రెండు రూపాయల పథకానికి ‘తెలుగు అన్నపూర్ణ సాక్షాత్కారం’ అని పేరు పెట్టారు. అలాగే ‘తెలుగు గ్రామీణ క్రాంతి పథం’, ‘తెలుగు మహిళా బహిర్‌ ప్రాంగణం’ ఇలా ప్రతి పథకానికి ముందు ‘తెలుగు’ పదం తప్పనిసరిగా ఉండేది. తెలుగుజాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా తమ పార్టీని స్థాపించానని ఆనాడు ఎన్టీఆర్‌ చెప్పారు కనుక తెలుగు పదంతో మొదలయ్యే పథకాలు ప్రవేశ పెట్టడం ఎవరికీ అభ్యంతరం కాలేదు. మనం తెలుగు ప్రజలం, మన భాష తెలుగు. ఆరోజుల్లో రాష్ట్రాలపై ఢిల్లీ (కాంగ్రెస్‌ కేంద్ర ప్రభుత్వ) పెత్తనం ఇంకానా? ఇకపై సాగదు అని ఎన్టీ రామారావు హూంకరించారు. కనుకనే తెలుగుజాతి ఆత్మ గౌరవాన్నీ, పౌరుషాన్నీ ద ష్టిలో పెట్టుకొని ఆ పథకాలకు అలా పేర్లు పెట్టారు. ఎన్టీ రామారావు తరువాత ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన చంద్రబాబు.. తన పేరు మీద, తన మామగారైన ఎన్టీఆర్‌ పేరు మీద పథకాలు ప్రకటించుకోవడం మొదలు పెట్టారు. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైఎస్‌ రాజశేఖరరెడ్డి కూడా తెలుగుదేశం పథకాల పేర్లన్నీ దాదాపు మార్చేశారు. ఏ పథకానికీ ఎన్టీఆర్‌, చంద్రబాబు పేర్లు లేకుండా చేశారు. శంషాబాద్‌ విమానాశ్రయానికి తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్‌ పేరు పెడితే వైఎస్‌ వచ్చి దాన్ని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంగా నామకరణం చేశారు. ఇలా అన్ని పథకాల పేర్లూ మార్చేశారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి పెట్టిన ‘రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పథకం’ పేరును ‘చంద్రబాబు ఎన్‌టిఆర్‌ ఆరోగ్య సేవ’గా మార్చారు. గత ఐదేళ్లలో ఎన్టీఆర్‌, చంద్రబాబు (చంద్రన్న) పేర్లతో ఉన్న పథకాలన్నింటి పేర్లనూ ప్రస్తుత వైసిపి ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఇప్పుడు మార్చేస్తున్నారు. పేర్లు మార్చవలసినవి ఇంకా ఒకటి రెండు పథకాలున్నా నేడో రేపో అవి కూడా పూర్తిగా మారిపోతాయి. పథకాలు అమలు జరిగే ప్రదేశాలకు రంగులు కూడా మారిపోతున్నాయి. తెలుగుదేశం పార్టీ పాలనలో ఏర్పాటు చేసిన ‘అన్న క్యాంటీన్‌’ ప్రాంగణాలకు పసుపు రంగు (టిటిపి పార్టీ పతాకం రంగు) వేసుకుంటే ఇప్పుడు వైఎస్‌ జగన్మోహనరెడ్డి ప్రభుత్వం అన్న క్యాంటీన్లను మూసేసింది. దీనికి ముందు క్యాంటీన్లకు వైసిపి పతాకం రంగును వేసేసింది. ఇలా పార్టీ పతాకాల రంగులూ పథకాల్లో చొచ్చుకొస్తున్నాయి. అంతేకాదు 2006లో రేషన్‌ కార్డులిచ్చారు. వీటి మీద ముఖ్యమంత్రి బొమ్మ గానీ పేరు గానీ లేదు. ఆ తరువాత అధికారం లోకి వచ్చాక కొత్త రేషన్‌ కార్డుల మీద చంద్రబాబు ఫొటో ఎక్కింది. మరోసారి కొత్త కార్డులిచ్చినప్పుడు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి బొమ్మ ఎక్కింది. దీంతో ప్రభుత్వం ఈ కొత్త కార్డుల వరకే చంద్రబాబు, కిరణ్‌ కుమార్‌రెడ్డి ఫొటోలున్న కార్డులను తీసేసి మళ్లీ కొత్తవి ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఇస్తానని చెపుతున్న కార్డులపై జగన్మోహనరెడ్డి ఫొటో ఎక్కుతుందన్న మాట. మళ్లీ ఐదేళ్ల తరువాత ప్రభుత్వం మారితే..పథకాల పేర్లు మళ్లీ మార్చేస్తారు. ఇక్కడే ఒక విషయం మనకు స్పష్టం కావాలి. పథకాలకు ముఖ్యమంత్రుల పేర్లు, లేదా మాజీ ముఖ్యమంత్రుల పేర్లు పెట్టడం ఎంతవరకు కరెక్టు? డబ్బు ప్రజలది. ఇచ్చేది ప్రజలకు. మధ్యలో మేం ఇస్తున్నాం అని ప్రభుత్వం తమ ఫొటోలనూ, పేర్లనూ మార్చేయడం ‘అత్త సొమ్మును అల్లుడు దానం చేయడం’ వంటిదే. 
సిపిఎం దాదాపు 34 సంవత్సరాలు పరిపాలించిన త్రిపురలో గానీ, పశ్చిమ బెంగాల్‌లో గానీ, ప్రస్తుతం అధికారంలో ఉన్న కేరళలో గానీ ఏ పథకమూ ముఖ్యమంత్రి పేరున గానీ, మాజీ ముఖ్యమంత్రి పేరున గానీ లేదు. ఆఖరికి ప్రభుత్వ ప్రకటన (పత్రికల్లో ప్రచురించబడేవి)ల్లో కూడా ముఖ్యమంత్రి ఫొటో ఉండదు. కేవలం ‘లెఫ్ట్‌ ఫ్రంట్‌’ అనో ‘లెఫ్ట్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌’ అనో ఉంటుంది. అన్నేళ్ల పరిపాలనలో ప్రకటనల్లో ముఖ్యమంత్రి ఫొటోను వేసుకున్న సందర్భం ఒక్కటీ కనిపించదు. కానీ మన రాష్ట్రంలో పూర్వం నుంచీ ముఖ్యమంత్రి ఫొటో లేని ప్రభుత్వ ప్రకటన ఒక్కటైనా ఉందా? ప్రజల డబ్బుతో ఈ సోకులేంటి? ఈ తిప్పలన్నీ ఎందుకు? ఈ పథకాలు మేం పెట్టాం అని చెప్పుకోవడానికేగా. మరి మీ పథకాలు చూసి, మీ పథకాలపై ముఖ్యమంత్రుల బొమ్మలు, వారి పేర్లు చూసి ఓట్లేశారా? ఓడిపోయి మరొక పార్టీ అధికారంలోకి రాబట్టే కదా.. ఆ ఘనత తమకే దక్కాలని పేర్లు మార్చుతున్నది. అందువల్ల పేర్లు మార్చితేనే ఓట్లు రాలవు. 1983 నుంచి వరుసగా జరుగుతుందదే. అందుకని ఇకనైనా ప్రజల డబ్బుతో సోకులు చేయడాన్ని ప్రభుత్వాలు మానుకోవాలి.