‘యురేనియం’పై యుద్ధం

రేవంత్‌ రెడ్డి ఉనికి కోసమా? కాంగ్రెస్‌ పార్టీ ఊపిరి కోసమా? 
  • -తెలంగాణలో సరికొత్త ఉద్యమానికి తెరతీస్తున్న కాంగ్రెస్‌ 
  • -కేసీఆర్‌ సర్కారును ఇరుకున పెట్టే ప్రయత్నం 
  • -యురేనియం నిక్షేపాల తవ్వకాలపై ఆక్షేపణ 
  • -ప్రజా ఉద్యమానికి సిద్ధమవుతున్న రేవంత్‌రెడ్డి 
  • -ఇప్పటికే అధిష్టానం నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ 
  • -యురేనియం తవ్వకాలతో చెంచుల పరిస్థితి దయనీయం 
  • -స్థానిక ప్రజలకు అండగా నిలిచేందుకు రేవంత్‌ నిర్ణయం 
  • -పార్టీ పగ్గాలు చేపట్టేందుకు రేవంత్‌కు ఇదొక అవకాశం 
  • -టీఆర్‌ఎస్‌, బీజేపీలకు ఈ ఉద్యమంతో చెక్‌ పెట్టాలనే యోచన 
  • -ప్రజాసంఘాల మద్దతు కూడగడుతున్న రేవంత్‌రెడ్డి 

హైదరాబాద్‌: 
తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్‌ ఓల్డ్‌ పార్టీ కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారిపోతోంది. తెలుగు నేల విభజనతో ఏపీలో ఆ పార్టీ ఇప్పటికే తుడిచిపెట్టుకుపోగా… తెలంగాణలో అంతకంతకూ క్షీణిస్తోంది. అయితే గతేడాది తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డి ఆ పార్టీకి బిగ్‌ బూస్టిచ్చే క్రమంలోనే సాగుతున్నారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఓ మోస్తరులో సత్తా చాటింది. ఈ సత్తా చాటడంలో మల్కాజిగిరీ నుంచి ఎంపీగా బరిలోకి దిగిన రేవంత్‌ రెడ్డి… తాను గెలవడంతో పాటుగా పార్టీ శ్రేణులను కదిలించారనే చెప్పాలి. పార్టీ స్టామినా క్రమేణా కనుమరుగు అవుతున్న నేపథ్యంలో రేవంత్‌ రెడ్డి ఇప్పుడు ఓ కొత్త పోరాటానికి తెర తీసి… తనతో పాటు పార్టీకి కూడా జీవం పోసే దిశగా కదులుతున్నారనే చెప్పాలి. ఆ పోరేమిటి? దాని ద్వారా రేవంత్‌ కు కాంగ్రెస్‌ పార్టీకి లాభించే అంశాలేమిటన్న విషయాలపై ఇప్పుడు తెలుగు నాట ఆసక్తికర చర్చకే తెర లేసింది. 
తెలంగాణలోని నాగర్‌ కర్నూలు నల్లగొండ జిల్లాల పరిధిలో దట్టమైన నల్లమల అటవీ ప్రాంతం ఉన్న సంగతి తెలిసిందే కదా. టైగర్‌ రిజర్వ్‌గా పరిగణిస్తున్న ఈ అడవుల్లో పెద్ద సంఖ్యలో పులులు కూడా ఉన్నాయి. ఈ పులులతో పాటు ఈ అడవుల్లో విలువైన యురేనియం నిక్షేపాలు ఉన్నాయన్న విషయం చాలా కాలం క్రితమే బయటపడింది. చాలా కాలంగా ఈ నిక్షేపాల కోసం తవ్వకాలు జరపాలన్న పలు సంస్థల యత్నాలు ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తుండగా… తాజాగా కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు సూత్రప్రాయంగా అనుమతి ఇచ్చింది. కేంద్రం అనుమతి నేపథ్యంలో తెలంగాణలోని కేసీఆర్‌ సర్కారు కూడా తవ్వకాలకు నో అబ్జెక్షన్‌ చెప్పేసింది. ఇక తవ్వకాలే తరువాయి అన్న చందంగా పరిస్థితి మారింది. అయితే ఈ ప్రాంతంలో అరుదైన పులులతో పాటు గిరిజన జాతి చెంచులు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. 
పర్యావరణానికి ప్రమాదం 
యురేనియం తవ్వకాలు జరిగితే… పులులు అంతరించడంతో పాటుగా చెంచులు కూడా చెల్లాచెదురు కాక తప్పదు. అంతేకాకుండా పర్యావరణం కూడా దెబ్బ తింటుంది. పెద్ద ఎత్తున కాలుష్యం వెలువడుతుంది. మొత్తంగా ఎలా చూసినా… యురేనియం తవ్వకాలు ప్రజావ్యతిరేక నిర్ణయమే. ఇప్పుడు ఇదే విషయంపై అదే ప్రాంతానికి కూతవేటు దూరంలోని ఒకప్పుడు నాగర్‌ కర్నూల్‌ ప్రాంతం ఉన్న మహబూబ్‌ నగర్‌ జిల్లాకు చెందిన రేవంత్‌ రెడ్డి అందరి కంటే చాలా ముందే మేల్కొన్నారు. ఎలాగూ ప్రజా సమస్యలపై అలుపెరగని పోరు సాగించే విషయంలో రేవంత్‌ రెడ్డికి మంచి పేరే ఉంది. పార్టీ ప్రాభవం కొడిగడుతున్న ప్రస్తుత తరుణంలో యురేనియంపై తనదైన శైలి పోరు మొదలెడితే ఎలా ఉంటుంది అన్న దిశగా ఆలోచించిన రేవంత్‌… ఎంతమాత్రం ఆలస్యం చేయకుండా పోరును ఇప్పటికే ప్రారంభించేశారు. 
ప్రజాసంఘాల మద్దతు 
యురేనియం తవ్వకాలపై ఇటు టీఆర్‌ఎస్‌ గానీ అటు బీజేపీ గానీ పోరాటం చేసే అవకాశమే లేదు. దీంతో కాంగ్రెస్‌ పార్టీ తరఫున రేవంత్‌ రంగంలోకి దిగితే… కాంగ్రెస్‌ పార్టీకి ప్రజా సంఘాలు ప్రజలు గిరిజన సంఘాల మద్దతు గ్యారెంటీ. ఈ లెక్కలనే బేరీజు వేసుకున్న రేవంత్‌ ఇప్పటికే యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాటం మొదలెట్టేశారు. త్వరలోనే ఈ ఉద్యమాన్ని ఆయన మరింతగా ఉధతం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ పోరును తనదైన శైలిలో సాగిస్తే… తనతో పాటు రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి బిగ్‌ బూస్టేనన్నది రేవంత్‌ అంచనా. మరి ఈ దిశగా రేవంత్‌ సాగిస్తున్న యురేనియంపై పోరు.. ఆయనతో పాటు కాంగ్రెస్‌ పార్టీకి ఏ మేర ఉపకరిస్తుందో చూడాలి. 
కార్యాచరణ సిద్ధం 
మల్కాజిగిరి కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌ రెడ్డి ప్రభుత్వాలపై మరో పోరాటానికి పావులు కదుపుతున్నారు. అడవిపుత్రుల సహజ సిద్దమైన ఆస్తి యురేనియం రూపంలో నిక్షిప్తమై ఉంటే ప్రభుత్వ పెద్దలు దాన్ని కొల్లగొట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నారని, ఇది ముమ్మాటికి ఆక్షేపనీయమని, ప్రభుత్వం గిరిజనుల హక్కులను కాలరాసే కార్యక్రమానికి ఉపక్రమిస్తే సహించేది లేదని ఆయన హెచ్చరిస్తున్నారు. యురేనియం తవ్వకాల వల్ల పర్యవరణానికి పెద్ద ఎత్తున ఆటంకం కలుగుతుందని, వాతావరణం కాలూష్యానికి గురై అనేక వ్యాధులు ప్రభలుతాయని రేవంత్‌ రెడ్డి ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా గిరిజనులకు సంఘీభావంగా ఆయన ఉద్యమ బాట పట్టేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. తెలంగాణలో రేవంత్‌ రెడ్డి మరో పోరాటం..! యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాటం..!! యురేనియం తవ్వకాలపై మల్కాజిగిరి కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌ రెడ్డి ధ్వజమెత్తుతున్నారు. 
యురేనియాన్ని తవ్వాలని చూస్తే.. గుండెల్లో గునపం దింపుతామని, యురేనియం తవ్వకాలకు సహకరించే నేతలను అక్కడి వాసులు బహిష్కరించాలని రేవంత్‌ రెడ్డి గర్జిస్తున్నారు. కాగా కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాడటానికి కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌ రెడ్డికి యరేనియంపై పోరాటం ద్వారా ఓ గొప్ప అస్త్రం లభించింనట్లయింది. రేవంత్‌ రెడ్డి ఇప్పటికే తన పదునైన మాటలతో ఉద్యమాన్ని ప్రారంభించారు. గిరిజనుకు కాంగ్రెస్‌ అండ..! సహజ ప్రక తి సంపదను కాపాడుతామంటున్న రేవంత్‌..!! ప్రజాపోరాటాల్లో, ప్రజలను భాగస్వామ్యం చేసే దిశగా, ఇప్పటి వరకూ కాంగ్రెస్‌ పార్టీ ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. నేతలు వెళ్లిపోవడం. ఉన్న వారు ప్రజా సమస్యలపై పెద్దగా స్పందించకపోవడం వంటి కారణాల వల్ల, ఇప్పటి వరకూ పెద్దగా క్షేత్ర స్థాయిలోకి రాలేకపోయారు. కానీ ఇప్పుడు మాత్రం యురేనియం అంశం, ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత తెస్తుందని, దాన్ని అస్త్రంగా ఉపయోగించుకోవాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. ఇదే అంశంలో రేవంత్‌ రెడ్డి అటు టీఆర్‌ఎస్‌ను, ఇటు బీజేపీని టార్గెట్‌ చేయాలని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ప్రభుత్వాల లాభాపేక్ష..! వాతావరణ కాలూష్యం ఎవరి బాధ్యత అంటున్న కాంగ్రెస్‌..!! ఇక ఇదే విషయంలో బీజేపీ ఎలాంటి వ్యతిరేకత వ్యక్తం చేయలేక పోతోంది. కేంద్రమే దీనికి అనుమతులు జారీ చేసింది కాబట్టి యురేనియం తవ్వకాలపై నోరుమెదిపే ప్రసక్తి లేనట్టు తెలుస్తోంది. టీఆర్‌ఎస్‌ సర్కార్‌ కూడా అంతగా వ్యతిరేకించలేదు. ఎందుకంటే, ప్రభుత్వమే ఎన్‌వోసీ కూడా ఇచ్చింది. ఇవే అంశాలు రేవంత్‌ రెడ్డికి అనుకూలంగా మారాయి. ఈ అంశాలను రేవంత్‌ రెడ్డి అడ్వాంటేజ్‌ గా తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. యురేనియం తవ్వకాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి. దీని వల్ల అనేక నష్టాలున్నాయని రేవంత్‌ రెడ్డి ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. 
తవ్వకాల వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డుపాలు..! అడ్డుకుంటామంటున్న టీ కాంగ్రెస్‌..!! యురేనియం తవ్వకాల వల్ల రెండు మండలాల్లోని సుమారు అరవై వేలమంది రోడ్డున పడతారని రేవంత్‌ రెడ్డి ఉద్యమం ప్రారంభించారు. అరుదైన చెంచు జాతి అంతరించే ప్రమాదం ఉందని, అతిపెద్ద టైగర్‌ జోన్‌ ప్రాంతంగా నల్లమలలో తవ్వకాలు జరిపితే పులులు అంతరించే ప్రమాదం సైతం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇది పర్యావరణానికి ఎంతో ప్రమాదకరమని రేవంత్‌ గతంలో కూడా ఉద్యమాలు నిర్వహించారు. ఇన్ని నష్టాలున్న విషయాన్ని పరిగణలోకి తీసుకుని అక్కడ యురేనియం తవ్వకాల నిర్ణయాన్ని ఉపసహరించుకోవాలని రేవంత్‌ అంటున్నారు. రేవంత్‌ రెడ్డి పదునైన మాటలతో ఇప్పటికే ఉద్యమాన్ని ప్రారంభించగా, ఆయన ఎంత పెద్ద స్థాయిలో ఉద్యమాన్ని రేపుతారో, అదే స్థాయిలో పొలిటికల్‌ లక్ష్యాన్ని అందుకోనే అవకాశాలు లేక పోలేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 
కాగా ప్రభుత్వం తాజాగా యురేనియం తవ్వకాలకు అనుమతులు ఇచ్చిందన్న వార్తలతో నంబాపురం, పెద్దగట్టు ప్రాంతాల ప్రజలు బెంబేలెత్తుతున్నారు. గతంలోనే యురేనియం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పోరాడిన తాము.. ఊర్లను ఇప్పుడెలా వదిలిపోతామని ప్రశ్నిస్తున్నారు. మరోమారు పోరాటం చేస్తాం తప్ప ఇక్కడినుంచి కదిలేదని లేదని మూకుమ్మడిగా చెబుతున్నారు. యురేనియం పరిశోధనల కోసం అధికారులు వస్తే వారిని అడ్డుకుంటామని, ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోమని స్పష్టం చేస్తున్నారు. 
ఇదీ పరిస్థితి.. 
దేవరకొండ నియోజకవర్గం పెద్దఅడిశర్లపల్లి మండల పరిధిలోని పెద్దగట్టు ప్రాంతంలో భూగర్భంలో యురేనియం నిక్షేపాలు ఉన్నాయని గుర్తించారు. దానిని వెలికితీసేందుకు పరీక్షలు నిర్వహించిన యురేనియం కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (యూసీఐఎల్‌) గనుల కోసం తమకు ఈ ప్రాంతంలో 1300 పైచిలుకు ఎకరాల లీజు కావాలని 2002లోనే నాటి ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. 2003 నాటికి పూర్తిస్థాయి ప్రాజెక్టు నివేదికను కూడా రూపొందించింది. కానీ, ఈ ప్రాంతంలో ప్రజలనుంచి వచ్చిన వ్యతిరేకతతో వెనకడుగు వేసింది. కేవలం పెద్దగట్టు తండా మాత్రమే కాకుండా.. కొత్తగా ఏర్పాటైన పెద్దగట్టు పం చాయతీ ఆవాసమైన బూడిద గుట్ట తండా, నంబాపురం (యూసీఐఎల్‌ నివేదికల్లో లంబాపురం అని పేర్కొంటున్నారు), ఎల్లాపురం, పులిచర్ల తదితర గ్రామాలు సైతం యురేనియం ప్రాజెక్టు ప్రభావిత గ్రామాల జాబితాలో ఉన్నాయి. ‘ఒక సారి ఇప్పటికే ఇళ్లూ గొడ్డూగోదా పోగొట్టుకుని నందికొండ నుంచి లేచి వచ్చి పెద్దగట్టుపై పడ్డాం. ఎన్ని సమస్యలున్నా ఇక్కడే బతుకుతున్నాం. పదుల ఎకరాలను నందికొండ ముంపులో పోగొట్టుకున్నా.. కుటుంబానికి 5 ఎకరాలే ఇక్కడ మాకు పునరావాసం కింద ఇచ్చారు. మళ్లీ ఇక్కడి నుంచి తరిమితే మేం ఎక్కడికి పోవాలి….’ పెద్దగట్టు సర్పంచి నరేందర్‌ ఆవేదన ఇది. ఈ ఒక్క తండానుంచే.. ప్రస్తుతం ఉపాధ్యాయులు, బ్యాంకు ఉద్యోగులు, పోలీసు, పోస్టల్‌ తదితర ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నారు. ఈ గ్రామంలో ఐదో తరగతి వరకు ఆశ్రమ పాఠశాల పక్కా భవనంలో నడుస్తోంది. రెండు అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. రెండుమూడేళ్ల కిందటే పెద్దగట్టుకు రూ.7కోట్ల పైచిలుకు నిధులతో బీటీ రోడ్డు కూడా నిర్మించారు. మిషన్‌ భగీరథ పథకంలో భాగంగా 40వేల లీటర్ల తాగునీటిని అందించే ట్యాంకూ నిర్మించారు. ఇన్ని సౌకర్యాలు ఒనగూరాకా .. అన్నీ వదిలి మళ్లీ తట్టాబుట్టా ఎలా సర్దుకుపోవాలన్నది వీరి వాదన.