‘తెలుగు’శకం ముగిసిందా?!

బీజేపీలో తెలుగు తమ్ముళ్ల చేరిక…తెలంగాణలో పార్టీ దాదాపు ఖాళీ 
  • -కమలం జోరు..టీ.టీడీపీ బేజారు 
  • -ఆపరేషన్‌ కమలంతో తెలుగుదేశం విలవిల 
  • -తెలంగాణలో టీడీపీకి ఆగష్టు సంక్షోభం 
  • -గత పార్లమెంటు ఎన్నికలకు దూరంగా ఉన్న పార్టీ 
  • -బీజేపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జేపీ నడ్డా సమక్షంలో భారీగా చేరికలు 
  • -తెలంగాణలో టీడీపీకి నాయకత్వ లోపం
  •  -బీజేపీకి క్యూకట్టిన టీడీపీ తమ్ముళ్లు 
  • -అంతర్మథనంలో అధినేత చంద్రబాబునాయుడు 

హైదరాబాద్‌: 
తెలంగాణలో టీడీపీకి చెందిన ద్వితీయశ్రేణి నేతలు ఆదివారం నాడు బీజేపీలో చేరడంతో ఇక ఆ పార్టీ కనుమరుగయ్యే అవకాశం ఉందా అనే చర్చ సాగుతోంది. విడతల వారీగా టీడీపీ నుండి పలువురు నేతలు ఇతర పార్టీల్లో చేరుతున్నారు. టీడీపీ చీఫ్‌ చంద్రబాబునాయుడు విజయవాడకు వెళ్లిన కాలం నుండి టీడీపీ నుండి తెలంగాణ రాష్ట్రంలో వలసలు మరింత పెరిగిపోయాయి. ఏపీ సీఎంగా ఉన్న చంద్రబాబునాయుడు హైద్రాబాద్‌ నుండి కాకుండా విజయవాడ నుండి పాలన సాగించాలనే ఉద్దేశ్యంతో విజయవాడకు మకాం మార్చాడు. ఈ పరిణామం టీడీపీని దెబ్బతీసింది. ఏపీ, తెలంగాణలో పార్టీ పరిస్థితిపై చంద్రబాబు ఎక్కువ సమయాన్ని కేటాయించలేకపోయాడు. ఇక తెలంగాణలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. అప్పుడప్పుడు హైద్రాబాద్‌ కు వచ్చిన సమయంలో టీడీపీ నేతలు చంద్రబాబునాయుడును కలిసేవారు. 
2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ 15 అసెంబ్లీ, ఒక్క ఎంపీ స్థానాన్ని గెలిచింది. 2018 ఎన్నికల నాటికి తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారిపోయాయి. ఒక్క ఎమ్మెల్యే మినహా ఎమ్మెల్యేలంతా ఇతర పార్టీల్లో చేరారు. 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌ లో చేరారు. ఇద్దరు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఒక్కరు మాత్రమే టీడీపీలో ఉన్నారు. 2018 ఎన్నికల్లో మూడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీడీపీ రెండు అసెంబ్లీ స్థానాలను గెలుచుకొంది. 
ఈ ఏడాది ఏప్రిల్‌ మాసంలో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయలేదు. పార్టీ ఆవిర్భావం తర్వాత పార్లమెంట్‌ ఎన్నికలకు దూరంగా ఉన్న చరిత్ర ఇదే తొలిసారి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ కు టీడీపీ మద్దతు ఇచ్చింది. 2018 ఎన్నికల్లో టీడీపీ నుండి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేల్లో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య టీఆర్‌ఎస్‌ లో చేరారు. మరో ఎమ్మెల్యే మాత్రమే టీడీపీలో కొనసాగుతున్నారు. 
మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, టీడీపీ ఎంపీ గరికపాటి మోహన్‌ రావులతో పాటు పలువురు టీడీపీ నేతలు ఆదివారం నాడు బీజేపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరారు. మాజీ మంత్రి టి.దేవేందర్‌ గౌడ్‌, అతని తనయుడు వీరేందర్‌ గౌడ్‌ కూడ త్వరలోనే బీజేపీలో చేరే అవకాశం ఉందని సమాచారం. రాష్ట్రంలోని పలు జిల్లాల నుండి జిల్లాస్థాయి నుండి రాష్ట్ర స్థాయి నేతల వరకు బీజేపీ తీర్థం పుచ్చుకొన్నారు. తెలంగాణలో ఇక టీడీపీ శకం ముగిసిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ టీడీపీ పరిస్థితిపై చర్చ సాగుతోంది. ముఖ్యంగా తెలంగాణలో అయితే ఆదివారం ఒక్కరోజులోనే క్యూ కట్టుకుని మరీ నాయకులు బీజేపీలోకి చేరిన పరిస్థితి కనిపించింది. అది కూడా పార్టీ అధినేత చంద్రబాబు తెలంగాణలో ఉన్న సమయంలోనే కావడం గమనార్హం. అలాంటి పార్టీ నుంచి జంప్‌ చేస్తున్న నాయకులు ఇక చాలు సేఫ్‌ సైడ్కు వచ్చామని గుండెలు పీల్చుకోవడం సహజం. నిజంగానే నాయకులు ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి చేరేది కూడా సేఫ్‌ కోసమే. అయితే ఈ సందర్భంగా పార్టీ మారేవారు. అప్పటి వరకు ఉన్న పార్టీని తిట్టిపోయడం నాయకులపై విమర్శలు గుప్పించడం కామన్‌. 
కానీ తెలంగాణలో టీడీపీ నుంచి బీజేపీ తీర్థం పుచ్చుకున్న గరికపాటి మోహన్‌ రావు.. చాలా వినూత్నంగా స్పందించారు. ఆయన బీజేపీలోకి వెళ్తున్నాననే ఆనందం కన్నా కూడా.. టీడీపీలో ఉండలేక పోతున్నాననే బాధ స్పష్టంగా కనిపించింది. అంతేకాదు పార్టీని వీడుతున్న క్రమంలోనే ఆయన ఏకంగా కన్నీటి పర్యంతం కావడం అందరినీకలచి వేసింది! నిజంగా ఓ పార్టీతో ఇంతటి బంధం పెనవేసు కుంటారా? అని కూడా అనిపించింది. మనసు చంపుకుని భాజపాలో చేరుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తాను చంద్రబాబు నాయుడు తీరుని ఎప్పుడూ తప్పుబట్టడం లేదనీ పార్టీని సమూలంగా నాశనం చేయాలనుకునేవారు కొంతమంది ఉన్నారని ఆరోపించారు. 
టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు తనకు ఏ పదవీ రాలేదనీ పార్టీ కోసం చాలా పోరాటాలు చేశాననీ కష్టకాలం లో పార్టీ వెంట ఉన్నానని గరికపాటి చెప్పుకొచ్చారు. టీటీడీపీలో నాయకులంటే ఇద్దరే కనిపిస్తున్న పరిస్థితి. నిజానికి తెలంగాణపై పార్టీ నాయకత్వం మరింత శ్రద్ధ పెట్టి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే పార్టీని ఇంతగా ప్రేమించే నాయకులున్నప్పుడు%ౌౌ% ఇలాంటి సమయంలోనైనా వారికి ప్రాధాన్యత ఇచ్చి కీలక బాధ్యతలు ఇచ్చి ప్రోత్సహించి ఉంటే పార్టీ ఉనికి నిలబడేది. కానీ ఏపీలో ఓటమి తరువాత తెలంగాణలో పార్టీ శాఖ మీద పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు ద ష్టి పెట్టలేని పరిస్థితి ఉంది. 
నిజానికి హైదరాబాద్లో డిసెంబరులో ఎన్నికల సమయంలో చంద్రబాబు నిర్వహించిన సభలకు రోడ్‌ షోలకు ప్రజలు పోటెత్తారు. దీనిని బట్టి అభిమానులు ఉన్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ వారిని పార్టీవైపు నడిపించడంలోను తగిన నాయకత్వాన్ని అందించడంలోనే లోపాలు జరిగాయనేది స్పష్టంగా తెలుస్తున్న మాట. ఏదేమైనా గరికపాటి వ్యాఖ్యల్లోని అంతరార్థం అర్ధమైతే.. నాయకులు ఇప్పటికైనా తప్పుదిద్దుకుంటారని అంటున్నారు పరిశీలకులు 
ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా తెలంగాణ తెలుగుదేశం (టీటీడీపీ) దుకాణం మూతపడనుంది. ఆ పార్టీకి చెందిన సీనియర్‌ నాయకులు, నియోజకవర్గ ఇన్‌చార్జులంతా మూకుమ్మడిగా రాజీనామా చేశారు. త్వరలోనే బీజేపీలో చేరనున్నట్లు ప్రకటించారు. దీంతో ఇక ఆ పార్టీకి సాధారణ కార్యకర్త కూడా కరువయ్యే దుస్థితి నెలకొంది. 2014 ఎన్నికల నాటినుంచి ఆ పార్టీ రోజు రోజుకూ దిగజారుతూ వస్తోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని పన్నెండు నియోజకవర్గాలకు గాను ఒక్క చోట కూడా పోటీ చేయలేక పోయింది. 2019 పార్లమెంటు ఎన్నికల్లో సరే సరి. ఇక, పంచాయతీ రాజ్‌ స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో, పార్టీ రహితంగా జరిగిన గ్రామ పంచాయతీల ఎన్నికల్లో .. ఇలా ఏ ఎన్నికల్లో ఆ పార్టీ కనీసం ఉనికిని కాపాడుకోలేకపోయింది. 
బోర్డు తిప్పేయడమేనా..? 
జిల్లాలో టీడీపీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతూ వస్తోంది. ఇన్నాళ్లూ ఆ పార్టీ జిల్లా నాయకులు ఊగిసలాటలో ఉన్నారు. గడిచిన ఐదేళ్లుగా ఆ పార్టీ నుంచి ఇతర పార్టీలకు ప్రధానంగా టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లోకి వలసలు కొనసాగాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం, ఆ వెంటనే 2014లో జరిగిన ఎన్నికల తర్వాత ఆ పార్టీ మరింత అయోమయంగా తయారైంది. ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న టీడీపీ ఉమ్మడి జిల్లాలోని పన్నెండు స్థానాల్లో ఒక్క చోట కూడా పోటీ చేయలేక పోయింది. 
కోదాడ నుంచి టికెట్‌ ఆశించి భంగపడిన బొల్లం మల్లయ్య యాదవ్‌ చివరి నిమిషంలో టీఆర్‌ఎస్‌లో చేరి విజయం సాధించి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ నాయకురాలు పాల్వాయి రజినీకుమారి టికెట్‌ ఆశించి భంగపడ్డారు. నల్లగొండ నుంచి మాదగోని శ్రీనివాస్‌గౌడ్‌ సైతం టికెట్‌పై ఆశలు పెట్టుకున్నా పొత్తులు దెబ్బకొట్టాయి. జిల్లా వ్యాప్తంగా ఏ ఒక్క నాయకుడికి ఎన్నికల్లో పోటీచేసే అవకాశం దక్కలేదు. ఈ పరిణామంతో పార్టీ శ్రేణులు పూర్తిగా నిరాశలో కూరుకుపోయాయి. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే నల్లగొండ టీడీపీ అధ్యక్షుడు సీఎం కేసీఆర్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. 
ఇలా గడిచిన ఐదేళ్లుగా ఆ పార్టీనుంచి ఒక్కొక్కరు జారిపోయారు. ప్రస్తుతం మిగిలి ఉన్న నాయకులంతా మూకుమ్మడిగా బీజేపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఆలేరు నియోజకవర్గానికి చెందిన తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేసిన బండ్రు శోభారాణి, నాగార్జున సాగర్‌ నియోజకవర్గం నుంచి కడారి అంజయ్యతోపాటు, పాల్వాయి రజినీ కుమారి, శ్రీనివాస్‌ గౌడ్‌ తదితరులు బీజేపీలో చేరే నాయకుల జాబితాలో ఉన్నారు. బీజేపీ జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జేపీ నడ్డా నేత త్వంలో హైదరాబాద్‌ నాంపల్లి గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వీరు ఆ పార్టీలో చేరారు. 
పాలేరు నియోజకవర్గానికే చెందిన మాజీ మంత్రి, సీనియర్‌ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు బీజేపీలో చేరడం ఖాయమై పోయింది. అయితే, ఉమ్మడి జిల్లా నేతలతో కాకుండా ఆయన ఢిల్లీలో జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా సమక్షంలో కమలం కండువా కప్పుకుంటారని పేర్కొంటున్నారు. మొత్తంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన పలువురు నాయకులు బీజేపీలో చేరడమే మిగిలి ఉందని అంటున్నారు. ఇదే జరిగితే.. జిల్లాలో ఇక టీడీపీ దుకాణానికి తాళం పడినట్టేనని, ఆ పార్టీ బోర్డు తిప్పేసినట్టేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.