కురులకు బలాన్నిచ్చే నూనెలు

కురులు బలంగా, దఢంగా పెరగడానికి నూనె పట్టిస్తాం. అంతేకాదు చర్మాన్ని తేమగా, యవ్వనంగా ఉంచడంలో కూడా నూనెలు చక్కగా పనిచేస్తాయి. చర్మాన్ని శుభ్రం చేయడం, ముడతలు పడకుండా చూడడంతో పాటు చర్మానికి సాగేగుణాన్ని అందిస్తాయి కూడా. ఇంతకీ ఈ నూనెల్లో ఏముందీ అంటే… 
నువ్వుల నూనె: ఇది చాలా తేలికగా ఉంటుంది. వాసన ఉండదు. చర్మం ఈ నూనెను తొందరగా పీల్చుకుంటుంది. అంతేకాదు బాడీ మసాజ్‌గా ఉపయోగపడుతుంది. చర్మాన్ని కోమలంగా ఉంచుతుంది. సన్‌స్క్రీన్‌ లోషన్‌గానూ పనిచేస్తుంది. ముఖాన్ని తేమగా, తాజాగా కనిపించేలా చేస్తుంది. 
ఆలివ్‌ నూనె: దీనిలోని మినరల్స్‌, విటమిన్లు జుట్టు, చర్మాన్ని సున్నితంగా ఉంచడమే కాదు పోషణనిస్తాయి కూడా. పసిపిల్లల చర్మాన్ని మరింత మ దువుగా మార్చుతుంది. పొడిచర్మానికి తేమనందించి ఆరోగ్యంగా ఉంచుతుంది. చుండ్రు, ఆయిలీ జుట్టు ఉన్నవారు ఆలివ్‌నూనె రాసుకుంటే ఫలితం ఉంటుంది. 
కొబ్బరి నూనె: ఈ నూనె శిరోజాలను పటిష్ఠంగా, మెరిసేలా చేస్తుంది. వేడిచేసిన కొబ్బరి నూనెను జుట్టుకు పట్టించి రాత్రంతా అలాగే ఉంచాలి. దీంతో దెబ్బతిన్న కురులను పునరుద్దరిస్తుంది. వెంట్రుకలు కొసల భాగంలో చిట్లిపోకుండా చూస్తుంది. అంతేకాదు ఎండకు కందిన చర్మానికి సాంత్వననిస్తుంది. మదువుగా, యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. 
బాదం నూనె: అన్ని రకాల చర్మం వారికి ఇది చక్కగా పనిచేస్తుంది. మసాజ్‌ ఆయిల్‌గా ఉపయోగపడుతుంది. అంతేకాదు ఈ నూనె రాసుకుంటే పొడిచర్మం, చర్మం దురద పుట్టడం, చర్మం వేడెక్కడం వంటి సమస్యల నుంచి ఉపశమనం 
లభిస్తుంది. 
మరికొన్ని చిట్కాలు 
-కొబ్బరినూనెలో కాసిన్ని వేపాకులు వేసి మరిగించాలి. ఆకులు బ్రౌన్‌ కలర్‌కి రాగానే ఆకులను వడగట్టి చల్లార్చాలి. ఈ నూనెను మాడుకు అంటేలాగే మసాజ్‌ చేయాలి. ఈ నూనె స్కాల్ఫ్‌ కండీషన్స్‌ను తగ్గించి జుట్టు రాలడాన్ని అరికడుతుంది. 
-నిమ్మరసం, ఆలివ్‌ ఆయిల్‌ కలిపి జుట్టుకు పట్టించాలి. రాత్రంతా అలాగే ఉంచి ఉదయం తలస్నానం చేయాలి. ఇది చుండ్రు, జుట్టు దుర్వాసన సమస్యలను తగ్గిస్తుంది. 
-క్యాస్టర్‌ ఆయిల్‌ చిక్కగా ఉంటుంది. డైల్యూట్‌ చేయకుండా వాడితే జుట్టు జిడ్డుగా మారే ప్రమాదం ఉంది. కాబట్టి దీంట్లో కొబ్బరి నూనె కలిపి జుట్టుకు రాయాలి. ఈ నూనె జుట్టు ఒత్తుగా పెరుగడానికి సహాయపడుతుంది. దీన్ని వారానికి ఒకసారి వాడితే మంచి ఫలితం ఉంటుంది. 
-టీ ట్రీ ఆయిల్‌లో యాంటీ బాక్టీరియల్‌, యాంటీ ఫంగల్‌ ప్రాపర్టీలు ఉంటాయి. యాక్నేకు దారి తీసే బాక్టీరియాను నశింపచేసేందుకు ఈ ఆయిల్‌ తోడ్పడుతుంది. స్కాల్ఫ్‌ యాక్నే పోగొట్టడానికి ఈ నూనెలో, కొబ్బరి నూనె మిక్స్‌ చేసి జుట్టుకు రాయాలి. చుండ్రుతో బాధపడేవారికి కూడా ఈ నూనె బాగా పనిచేస్తుంది. 
-ఆముదంతో జుట్టుకు మర్దన చేయటం వల్ల జుట్టు రాలటం ఆగి, నల్లని, ఒత్తైన జుట్టు సొంతమవుతుంది. ఆముదానికి ఆవనూనె కలిపి రాసుకొంటే చిట్లిన జుట్టు ఆరోగ్యకరంగా మారుతుంది. 
-సహజ నూనెల్లో అవకాడో నూనెది ప్రత్యేక స్థానం. జుట్టు ఎదుగుదలకు అవసరమయ్యే పోషకాలతో బాటు అమినో, ఫ్యాటీ యాసిడ్స్‌, విటమిన్‌ ఎ, బి, డి, ఇ కూడా ఇందులో లభిస్తాయి. ఇది డీప్‌ కండీషనర్‌లా పనిచేసి జుట్టు కుదుళ్లను బలపరచి, శిరోజాలు సహజ శోభను పొందేలా చేస్తుంది. 
-కుదుళ్ళ నుంచి చివరలవరకూ జుట్టు దఢంగా ఉండాలంటే ఉసిరినూనె వాడాలి. ఇందులోని విటమిన్‌ సి నేరుగా జుట్టుకు అందుతుంది. రాత్రి నిద్రకుముందు ఉసిరి నూనె తలకు పట్టించుకుని.. మర్దన చేసుకుంటే అలసట తొలగిపోతుంది. చుండ్రు, జుట్టురాలడం, తలనొప్పి వంటి ఇబ్బందులూ దరిజేరవు. 
-యాంటీ ఆక్సిడెంట్స్‌ పుష్కలంగా ఉండే ఆలివ్‌ ఆయిల్‌ చేసేంత మేలు జుట్టుకు మరే నూనె చేయదు. ఇది జుట్టు రాలకుండా, చుండ్రు చేరకుండా చూస్తుంది. అయితే ఆలివ్‌ ఆయిల్‌ వాడదలచుకుంటే.. ఎక్స్‌ట్రా వర్జిన్‌ ఆయిల్‌ వాడాలి. 
-కొందరికి జుట్టు చిక్కగా, పొడవుగా ఉన్నాపొడిబారి, కళావిహీనంగా మారుతుంది. వీరు రోజ్‌మేరీ ఆయిల్‌ వాడితే మంచిగుణం ఉంటుంది. పోషకాల లోపంతో జుట్టు ఎదుగుదల తక్కువగా ఉన్నవారికీ ఇది చక్కని ఫలితాన్నిస్తుంది. 
-జుట్టు పలుచగా ఉన్నవారు వారానికి 2 సార్లు స్వీట్‌ ఆల్మండ్‌ ఆయిల్‌ వాడితే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ముఖ్యంగా ఎండ, చలివాటి వాతావరణ మార్పులను జుట్టు మీద పడకుండా చేస్తుంది. సముద్రస్నానం చేసేవారు ముందుగా ఈ నూనె రాస్తే జుట్టుమీద ఉప్పునీటి ప్రభావం పడకుండా చేస్తుంది.