గోవును సాకితే రోజుకు రూ.30
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సరికొత్త స్కీమ్
లక్నో: గోసంరక్షణ ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సరికొత్త స్కీమ్‌తో ముందుకువచ్చారు. ఈ పథకం కింద తొలి దశలో ప్రస్తుతం ప్రభుత్వం నడుపుతున్న గోసంరక్షణశాలల్లోని లక్ష గోవులను రైతులు, ఆసక్తి కలిగిన వారికి అందజేస్తారు. అయితే ఇందుకు ఎంపిక ప్రక్రియ అనేది ఉంటుంది. ఆ ప్రక్రియ పూర్తిచేసిన తర్వాతే గోవుల సంక్షరణ బాధ్యత వారికి అప్పగిస్తారు. గోవుల పోషణకు ఎంపిక చేసిన వారికి ఒక్కో గోవుకు రోజుకు రూ.30 చొప్పున ప్రభుత్వం చెల్లిస్తుంది. ఆ ప్రకారం నెలకు రూ.900 వేతనాన్ని నేరుగా లబ్ధి దారుల ఖాతాల్లో జమచేస్తారు. తొలి దశలో ఈ కొత్త స్కీమ్ కింద రూ.109 కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
యూపీలోని ప్రభుత్వ గోశాలల్లో వాటిని పరిరక్షించడం అనేది ఒక ప్రధాన సమస్యగా పరిణమిస్తున్న నేపథ్యంలో యోగి సర్కార్ తాజా నిర్ణయం తీసుకుంది. యూపీలో 523 గోశాలలు రిజిస్టర్ అయ్యాయి. మరిన్ని గోశాలల నిర్మాణం జరుగుతోంది.