జీవనదిని తలపిస్తోంది

నీటిపారుదల అధికారులకు అభినందనలు తెలిపిన సీఎం కేసీఆర్‌ 
  • -100 టీఎంసీల నీరు 250 కిలోమీటర్ల మేర నిలిచింది 
  • -ఎవరూ ఊహించని ఘనత ఇది 
  • -తెలంగాణ భవిష్యత్‌ కోసం శాశ్వత సాగునీటి వనరులు 
  • -కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 45 లక్షల ఎకరాలకు నీళ్లు 
  • -రామగుండం నుంచి అదనంగా 4 వేల మెగావాట్ల కరెంట్‌ 
  • – మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు రోజుకు 3 టీఎంసీల నీళ్లు 
  • -మిషన్‌ భగీరథ అద్భుతమైన ఫలితాన్నిచ్చింది 
  • -అన్ని రంగాలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ 
  • -తక్కువ సమయంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి 
  • -ధర్మపురి విలేకరుల సమావేశంలో కేసీఆర్‌ 

ధర్మపురి: 
మేడిగడ్డ నుంచి ధర్మపురి వరకు గోదావరి నది సజీవంగా ఉందని, గోదావరి అద్భుత జీవనదిని సాక్షాత్కరింపజేస్తోందని సీఎం కేసీఆర్‌ అన్నారు. సజీవ గోదావరిని అందించిన నీటిపారుదల శాఖ అధికారులకు సీఎం కేసీఆర్‌ అభినందనలు తెలియజేశారు. మంగళవారం ధర్మపురిలో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ..గోదావరి నదిలో దాదాపు 100 టీఎంసీల నీరు 250 కిలోమీటర్ల మేర నిలిచింది. ఎవరూ ఊహించని ఘనత ఇది. అనుకున్న దాని కంటే బ్రహ్మాండంగా ప్రాజెక్టులు తయారైనయి. తెలంగాణ భవిష్యత్‌ కోసం శాశ్వత సాగునీటి వనరులు సమకూరుస్తున్నామని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. 
44 ఏళ్ల సీడబ్ల్యూసీ రికార్డులను పరిశీలించి ప్రాజెక్టులు రీడిజైనింగ్‌ చేశామని సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కొత్తగా లభించే నీళ్లు 400 టీఎంసీలు. కాళేశ్వరం ప్రాజెక్టుతో 45 లక్షల ఎకరాలకు నీళ్లందుతాయి. నెలకు 60 టీఎంసీల చొప్పున 6 నెలలపాటు నీటిని ఎత్తిపోస్తం. రామగుండం నుంచి అదనంగా 4వేల మెగావాట్ల కరెంట్‌ వస్తుంది. మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు ప్రతీ రోజు 3 టీఎంసీల నీళ్లు వస్తయన్నారు. ఎల్లంపల్లి నుంచి మల్లన్నసాగర్‌ వరకు ప్రతీరోజు 2 టీఎంసీల నీళ్లు వస్తయని సీఎం వివరించారు. ధర్మపురి దగ్గర ఏడాది పొడవునా గోదావరి నిండుగా ఉంటది. క ష్ణాలో నీటి లభ్యత తక్కువగా ఉంది. గోదావరి తప్ప మనకు మరో మార్గం లేదని సీఎం కేసీఆర్‌ తెలిపారు. నాలుగైదు రోజులుగా మేడిగడ్డ నుంచి ప్రతీరోజు నాలుగైదు టీఎంసీల నీళ్లు కిందికిపోతున్నయన్నారు. 
మేడిగడ్డ దగ్గర గోదావరి బెడ్‌ లెవల్‌ 88 మీటర్లు. 119 మీటర్ల ఎత్తులో అన్నారం బ్యారేజీ కట్టుకున్నాం. 130 మీటర్ల ఎత్తులో సుందిళ్ల బ్యారేజీ నిర్మించినం. 148 మీటర్ల ఎత్తులో ఎల్లంపల్లి ప్రాజెక్టు ఉందని సీఎం తెలిపారు. గోదావరికి వరద ఎక్కువగా వస్తే మేడిగడ్డ నుంచి ఎత్తిపోయాల్సిన అవసరం లేదు. డైరెక్టుగా ఎల్లంపల్లి నుంచే నీటిని తీసుకుంటమన్నారు. 
మిషన్‌ భగీరథ అద్భుతమైన ఫలితాన్నిచ్చిందని సీఎం కేసీఆర్‌ తెలిపారు. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌లో ఉన్నవారికి అందిస్తున్న నీటినే..పేదల బస్తీల్లో కూడా అందిస్తున్నామని చెప్పారు. జఠిలంగా ఉన్న విద్యుత్‌ సమస్య లేకుండాపోయింది. అన్ని రంగాలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ అందిస్తున్నాం. సంక్షేమం అమలులో దేశంలో అగ్రస్థానంలో ఉన్నాం. దివ్యాంగులకు రూ.3116 పింఛన్‌ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. కేసీఆర్‌ కిట్‌, కల్యాణలక్ష్మి వంటి ఎన్నో పథకాలు అమలు చేస్తున్నామని సీఎం కేసీఆర్‌ వెల్లడించారు 
తక్కువ సమయంలో ప్రాజెక్టు పూర్తయినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంతోషం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో మంగళవారం సీఎం పర్యటించారు. మేడిగడ్డ బ్యారేజీ ఎగువన 150 కిలోమీటర్ల మేర నీరు నిలువ ఉండటాన్ని ఎరియల్‌ వ్యూ ద్వారా సీఎం చూశారు. అన్నారం, మేడిగడ్డ బ్యారేజీలపై కాలినడకన తిరిగి పరిశీలించారు. ప్రాణహిత నుంచి కొన్ని లక్షల క్యూసెక్కుల్లో భారీ వస్తున్న నేపథ్యంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఇరిగేషన్‌ అధికారులకు సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. గేట్ల నిర్వహణ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. 45 లక్షల ఎకరాలకు సాగునీటిని, పారిశ్రామిక అవసరాలు సహా 80శాతం తెలంగాణకు తాగునీటిని అందించే కాళేశ్వరం ప్రాజెక్టు తక్కువ సమయంలో పూర్తయినందుకు సంతోషంగా ఉందన్నారు. 
ఈ సీజన్‌లో మేడిగడ్డ నుంచి కిందకు ఎంత వరద వెళ్లిందని సీఎం ఆరా తీశారు. 300 టీఎంసీల నీరు కిందికి వెళ్లిందని అధికారులు వివరించారు. పై నుంచి వచ్చిన వరదకు అనుగూణంగా గేట్లు ఎత్తాలని వీలైనంత వరకు నదిలో నీటిమట్టం ఉంచాలని అధికారులుకు సీఎం ఆదేశించారు. గోదావరిలో మొత్తం వరద తగ్గిన తరువాతనే గేట్లు మూసివేయాలి. మేడిగడ్డ బ్యారేజీని సకాలంలో నిర్మించి ఈ సీజన్‌కు అందించిన ఎల్‌ అండ్‌ టీ సంస్థను, ఇరిగేషన్‌ అధికారులను ముఖ్యమంత్రి అభినందించారు. 
కాళేశ్వరం ప్రాజెక్టుతో జీవనదిని తలపిస్తున్న గోదావరిని చూసేందుకు పర్యటన చేపట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముందుగా మేడిగడ్డ జలాశయం వద్దకు చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో అధికారులు, ఇంజినీర్లతో కలిసి ప్రాజెక్టు సందర్శనకు వచ్చారు. మేడిగడ్డ ఆనకట్టపైకి చేరుకున్న ముఖ్యమంత్రికి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌ వెంకటేశ్వరులు, ఎస్పీ భాస్కరన్‌, ఇతర అధికారులు స్వాగతం పలికారు. అనంతరం 70,71 గేట్ల వద్ద గోదావరి మాతకు పూలు, పట్టు వస్త్రాలు సమర్పించి సీఎం కేసీఆర్‌ పూజలు నిర్వహించారు. చిరుజల్లులు కురుస్తున్నప్పటికీ.. బ్యారేజీపై కాలినడకన వెళ్తూ నీటి నిల్వను పరిశీలించారు. వ్యూపాయింట్‌ వద్దకు చేరుకొని అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు తాజా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏరియల్‌ సర్వే నిర్వహించారు. అధికారులు, ఇంజినీర్లతో కలిసి విహంగ వీక్షణం ద్వారా గోదావరి పరవళ్లను వీక్షించారు. గోదావరి ప్రవాహానికి సంబంధించిన వివరాలను ఇంజినీర్లు ఆయనకు వివరించారు. అక్కడి నుంచి గోలివాడ పంపుహౌస్‌ చేరుకొని పరిశీలిస్తారు. అక్కడి అధికారులతో సమావేశమై నీటి ఎత్తిపోతకు సంబంధించి వివరాలపై ఆరాతీయనున్నారు. అక్కడి నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టు పర్యటన తర్వాత ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుంటారు. సాయంత్రం తిరిగి హైదరాబాద్‌కు పయనమయ్యారు. 
ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటనలో భాగంగా ధర్మపురి చేరుకున్నారు. ధర్మపురి లక్ష్మినరసింహాస్వామి ఆలయానికి వచ్చిన సీఎం కేసీఆర్‌కు ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం సీఎం కేసీఆర్‌ లక్ష్మీనరసింహస్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. సీఎం కేసీఆర్‌ వెంట మంత్రులు ఈటల రాజేందర్‌, కొప్పుల ఈశ్వర్‌, ఎమ్మెల్యేలు సంజయ్‌ కుమార్‌, విద్యాసాగర్‌ రావు, సుంకె రవికుమార్‌, ఎంపీలు సంతోష్‌ కుమార్‌, బోర్లకుంట వెంకటేశ్‌ నేతకాని, పలువురు నేతలు ఉన్నారు. 
కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ మేడిగడ్డకు చేరుకున్నారు. సీఎం వెంట మంత్రి ఈటెల రాజేందర్‌, ఎంపీ సంతోష్‌కుమార్‌, సీఎంవో, ఇరిగేషన్‌ అధికారులు ఉన్నారు. ముఖ్యమంత్రికి మేడిగడ్డ వద్ద మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యే గండ్రవెంకటరమణారెడ్డి, జెడ్పీ చైర్మన్లు, పుట్టమధు, శ్రీహర్షిణి, గండ్ర జ్యోతి, కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, ఎస్పీ భాస్కరన్‌ స్వాగతం పలికారు. ఎరియల్‌ వ్యూ ద్వారా, మేడిగడ్డ వద్ద గోదావరి ప్రవాహాన్ని సీఎం పరిశీలించారు. అనంతరం గోదావరి మాతకు ప్రత్యేక పూజలు చేసి అమ్మవారికి వాయినం సమర్పించారు.