మమ్మల్ని చంపేందుకు కేంద్రం కుట్ర
నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా
న్యూఢిల్లీ: తమను చంపేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా కుట్ర పన్నుతున్నారని జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఈరోజు పార్లమెంట్ సమావేశాలకు హాజరు కాకపోవడంపై ఎన్సీపీ నేత, ఎంపీ సుప్రియా సూలే లేవనెత్తిన ప్రశ్నకు అమిత్ షా సమాధానమిస్తూ అరెస్టు చేయడం కానీ, నిర్బంధించడం కానీ చేయలేదని, ఆయన తన ఇంట్లోనే, ఐచ్ఛికంగానే ఉన్నారని ప్రకటించారు. అయితే అమిత్ షా ఈ ప్రకటన కొద్ది నిమిషాలకే ఫారూక్ అబ్దుల్లా స్పందించారు. హోంమంత్రి అమిత్ షా అన్నీ అబద్దాలు చెబుతున్నారని, తనను తన ఇంట్లోనే నిర్బంధించారని ఆయన చెప్పారు. తన కుమారుడిని జైలుకు పంపించారని పేర్కొన్నారు. అయితే ఈ విషయమై తాను సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు ఫారూక్ తెలిపారు.
ఓ జాతీయ ఛానెల్‌తో ఫారూక్ మాట్లాడుతూ ”నా ఇంటికి పెద్ద తాళం వేశారు. నన్ను ఇంట్లో బంధించారు. నా కొడుకు ఒమర్ అబ్దుల్లాను జైలులోపెట్టారు. మెహబూబా ముఫ్తీని కూడా నిర్బంధించారు. నా ఇంటి చుట్టూ చూడండి. ఎంతమంది సెక్యూరిటీ ఉన్నారో. నన్ను కలవడానికి కూడా ఎవరినీ అనుమతించడం లేదు. మమ్మల్ని చంపించడానికే ఈ కుట్ర పన్నుతున్నారు” అని అన్నారు. అయితే లోక్‌సభలో అమిత్ షా చేసిన ప్రకటనను ఫారుక్ వద్ద ప్రస్తావించగా ”నా ఇంటి వద్ద నేను ఇంత మంది సెక్యూరిటీని పెట్టుకోలేదు. నేను గ హనిర్బంధంలోనే ఉన్నాను. అమిత్ షా నన్ను నిర్బంధించకుంటే మరెవరు నిర్బంధించారు? ఇది కచ్చితంగా మమ్మల్ని అంతం చేసే కుట్రలో భాగంగానే ఇదంతా జరుగుతోంది” అని ఫారూక్ మరోసారి ఉద్ఘాటించారు.
తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు