ధోనీపై మాకు ఆ నమ్మకం ఉంది: రావత్
న్యూఢిల్లీ: టీమిండియా వికెట్ కీపర్, గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ మహేంద్రసింగ్ ధోనీ ప్రస్తుతం భారత పారామిలటరీ విభాగంలో పనిచేస్తున్న విషయం తెలిసిందే. క్రికెట్‌కు రెండు నెలలపాటు విశ్రాంతినిచ్చిన మహీ శుక్రవారం దక్షిణ కశ్మీర్‌లోని పారా రెజిమెంట్ యూనిట్‌తో కలిసిపోయాడు. ఆగస్టు 15 వరకు అక్కడే సైనిక విధుల్లో పాల్గొంటాడని తెలుస్తోంది. అయితే విరామ సమయంలో ధోనీ అక్కడి సిబ్బందితో కాసేపు వాలీబాల్ ఆడిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. 2011లో గౌరవ లెఫ్టినెంట్ హోదా పొందిన మాజీ కెప్టెన్ 2015లో పారాచూట్ డైవింగ్‌లో శిక్షణ పొందాడు. మరోవైపు కశ్మీర్‌లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల కారణంగా ధోనీ భద్రతపై అభిమానులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ధోనీ మాత్రం సాధారణ సైనికుడిలా అక్కడ పనిచేస్తున్నాడు. ఈ విషయంపై భారత ఆర్మీ చీఫ్ బిపిన్‌రావత్ మాట్లాడుతూ ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. భారత పౌరుడు ఆర్మీ దుస్తులు ధరించడానికి సిద్ధపడితే.. ఆ దుస్తులకు తగిన బాధ్యతలు నిర్వర్తించడానికి కూడా సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. ధోనీ ఇప్పటికే తన కార్యకలపాలను ప్రారంభించాడని, తనకిచ్చిన బాధ్యతలను దిగ్విజయంగా పూర్తిచేస్తాడనే నమ్మకం ఉందని రావత్ చెప్పుకొచ్చారు.
ప్రపంచకప్‌లో తన ఆటపై వచ్చిన విమర్శల నేపథ్యంలో ధోనీ క్రికెట్ నుంచి రిటైరవుతాడని అనేక ఊహాగానాలు వినిపించాయి. అయితే రెండు నెలలు పాటు క్రికెట్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న అతడు ప్రస్తుత విండీస్ టూర్‌కు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో యువ కీపర్, బ్యాట్స్‌మన్ రిషబ్‌పంత్ అతడి స్థానాన్ని భర్తీ చేశాడు.