ఆలయాల్లో శ్రావణశోభ

మహిళా భక్తులతో అమ్మవారి ఆలయాలు కిటకిట 
ప్రత్యేక పూజలతో సాగిన తొలిరోజు 
హైదరాబాద్‌,ఆగస్ట్‌2-: శ్రావణమాసం తొలి శుక్రవారం కావడంతో ఆలయాల్లో సందడి నెలకొంది. అమ్మవారి ఆలయాల్లో కుంకుమపూజలతో మహిళలు పూజలునిర్వహించారు. ఉదయమే అమ్మవారి ఆలయాలకు రద్దీ పెరిగింది. ప్రముఖ పుణ్యక్షేత్రాలు ధర్మపురి, వేములవాడ,కాళేశ్వరం,భద్రకాళి, విజయవాడ కనకదుర్గ, శ్రీశైలం భ్రమరాంబ ఆలయాలతో పాటు జంటనగరాల్లో అనేక ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రావణసందడితో పూల ధరలకు రెక్కలు వచ్చాయి. ముసురు పడుతున్నా ఆలయాలకు భక్తుల రాక తగ్గలేదు. దక్షిణకాశీగా ప్రసిద్ధి చెందిన కేతకీ సంగమేశ్వరస్వామి దర్శించు కునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. శ్రావణమాసం ప్రారంభం కావడంతో భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు పొటెత్తారు. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చి దర్శించుకున్నారు. భక్తుల రాకతో ఆలయ ప్రాంగణం శివ నామస్మరణతో మార్మోగింది. తెల్లవారుజాము నుంచే భక్తులు రాక ప్రారంభమైంది. అమృత గుండంలో పుణ్యస్నానాలు చేశారు. భక్తులకు ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బీదర్‌, కామారెడ్డి జిల్లావాసులు విజయ్‌కుమార్‌, భగవాన్‌, సంతోశ్‌ భక్తులకు అన్నదానం చేశారు. ఆలయ, చైర్మన్‌ నరసింహాగౌడ్‌, కార్యనిర్వహణాధికారి మోహన్‌రెడ్డి, ఎస్‌ఐ ఏడుకొండలు, పోలీస్‌ సిబ్బంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. 
శ్రావణ మాసం ప్రారంభం నుంచి చివరి వరకు అనునిత్యం భారీ సంఖ్యలో తరలిచ్చి పార్వతీ సమేత సంగమేశ్వరస్వామిని దర్శించుకుంటారు. ప్రత్యేక వాహనాలు, ఆటోలు, ఆర్టీసీ బస్సుల్లో ఆలయానికి భక్తులు చేరుకుంటారు. స్వామివారిని దర్శించుకునేందుకు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రాల నుంచి భారీగా భక్తులు తరలివస్తారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. 
స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన, పూర్వక ఏకిదశి రుద్రాభిషేకం, రుత్విక్కరణ, పల్లకీసేవ, రుద్రస్వాహకార, నవగ్రహ శాంతి ¬మం, భక్తులతో అమృత గుండలోని జలలింగానికి ప్రత్యేక పూజ లు, ప్రతినిత్యం భక్తులకు అన్నదానం, రాత్రికి సేవ భజనలు ఉంటాయి. ముగింపు రోజు స్వామివారికి కుంకుమార్చన రాత్రికి పల్లకీసేవ, భజనలు, చేసి భక్తులతోపాటు గ్రామస్తులకు అన్నదానం ఉంటుంది. యాదాద్రిలో కూడా శ్రావణ సందడి నెలకొంది. ఉదయం నుంచి బాలాలయానికి భక్తులు పోటెత్తారు.