హరితహారం నిత్యపాఠం కావాలి

విద్యార్థులకు కడియం శ్రీహరి సందేశం 
పాఠశాల విద్యకు ప్రభుత్వ ప్రాధాన్యాన్ని గుర్తించాలని సూచన 
నల్లగొండ,ఆగస్ట్‌2-: హరితహారంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం పాఠశాలల్లో నిత్య పాఠ్యాంశం కావాలని విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి అభిలషించారు. పాఠశాల స్థాయి నుంచే మొక్కల పెంపకం జీవితంలో భాగం కావాలన్నారు. ఇది విద్యార్థి,ఉపాధ్యాయులకు తప్పనిసరి కావాలని అన్నారు. 
అమెరికా పర్యటనలో ఉన్న ఆయన స్కూలు విద్యార్థులకు సందేశం ఇచ్చారు. మొక్కలు పెంచడంలో ప్రైవేట్‌,ప్రభుత్వ పాఠశాలలు అన్న తేడా లేకుండా అందరూ భాగస్వాములు కావాలన్నారు. నాటిన మొక్కలు పెరిగి పెద్దవైతే మానవాళి మనుగడకు దోహదపడతాయని,భవిష్యత్‌కు నీడనిస్తాయని అన్నారు. ఈ సూత్రం ఆధారంగా టీచర్లు పిల్లను తర్ఫీదు చేయాలన్నారు. మొక్కల పెంపకం ఆవశ్యకతలను ప్రతి పాఠశాలలో వివరించాలని అన్నారు. మొక్కలు ఏ విధంగా నాటాలి, వాటికి నీరు ఏ విధంగా పోస్తే చక్కగా పెరుగుతాయో వారికి విశదీకరించాలని అన్నారు. ప్రతి విద్యార్థి మొక్కలు నాటడాన్ని దైనందిన కార్యక్రమంగా అలవర్చుకోవాలని సూచించారు. నాటిన ప్రతీ మొక్క బ్రతికే విధంగా ప్రతిఒక్కరూ బాధ్యత తీసుకోవాలన్నారు. పిల్లలతో మొక్కలు నాటించడంతో పాటు వాటిని రక్షించే విధంగా కృషి చేయాలన్నారు. పాఠశాలల్లో, దేవాలయాల ప్రాంగణంలో మొక్కలను నాటించాలన్నారు. నాటిన ప్రతీ మొక్క జీవించే విధంగా పర్యవేక్షణ చేయాలని పిలుపునిచ్చారు. హరితహారంతో పాటు సిఎం కెసిఆర్‌ విద్యారంగానికి పెద్దపిట వేస్తున్నారని అన్నారు. బంగారు తెలంగాణ సాధనలో హరితహారం, ఉచిత విద్య కూడా భాగమేనని అన్నారు. ఇందుకోసం కేసీఆర్‌ వెంట నడిచి అనుకున్న లక్ష్యాన్ని చేరాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు ఉన్న అన్నిరంగాల్లో రాణించాలని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ స్వప్నం కేజీ టు పీజీ విద్యాపథకం అమలుకు కార్యాచరణ మొదలైంది. ప్రభుత్వం గత రెండేండ్లుగా ఇందుకోసం బలమైన పునాదులు వేసింది. ఇకపై ఏటా పాఠశాలలు కళాశాలల సంఖ్యతోపాటు తరగతుల అప్‌గ్రెడేషన్‌ జరుపుతూ ముందుకు వెళ్ళాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల వచ్చే రెండేండ్లలో కేజీ టు పీజీ విద్య పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుందన్నారు. ఇంతకాలం సరైన విద్యకు నోచని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ విద్యార్థులకు ఉత్తమ విద్యకు మార్గం సుగమం అయ్యిందన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో మానవవనరుల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక ప్రాధాన్యమిచ్చారు. ఉద్యమ సమయంలో తాను కలలుగన్న కేజీ టు పీజీ పథకానికి రూపమిచ్చారు. రాష్ట్రంలో 80 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను నాణ్యమైన విద్యతో ఉద్యోగులుగా, పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దినప్పుడే ఆ వర్గాల అభ్యున్నతి సాధ్యమని కేసీఆర్‌ విశ్వసించారు. ఈ మేరకు భారీ సంఖ్యలో రెసిడెన్సియల్‌ స్కూళ్లను ప్రారంభించారని అన్నారు. పాఠశాలల ద్వారా మెరుగైన ఫలితాలు కూడా వస్తున్నాయి. నిరుపేద కుటుంబాలనుంచి వచ్చిన విద్యార్థులు డాక్టర్లు అయ్యే అవకాశం ఈ రెసిడెన్షియల్‌ స్కూళ్ల ద్వారా లభించిందని జగదీశ్వర్‌ రెడ్డి గుర్తు చేశారు.