తప్పుడు ప్రకటనలపై తాట తీసే చట్టం

వినియోగదారుల రక్షణ చట్టానికి లోక్‌సభలో ఆమోదం..త్వరలోనే చట్టరూపం

  • -ప్రచారరూపంలో కోట్లు గుమ్మరిస్తున్న కంపెనీలు
  • ఆకట్టుకునే రీతిలో సెలబ్రిటీలతో కమర్షియల్‌ యాడ్స్‌
  • తీరా నాణ్యత లేకపోవడంతో లబోదిబో మంటున్న వినియోగదారులు
  • అలాంటి తప్పుడు ప్రకటనలపై కొరడా ఝుళిపించిన కేంద్రం
  • పటిష్టవంతంగా వినియోగదారుల రక్షణ చట్టం
  • రాష్ట్రపతి సంతకంతో త్వరలోనే చట్టంగా రూపకల్పన
  • తప్పుడు యాడ్స్‌లో నటించే బ్రాండ్‌ అంబాసిడర్లకూ ఫైన్‌
  • ఆదాయం కోసం యాడ్స్‌కి ఒప్పుకుంటున్న క్రికెటర్లు, సినిమా తారలు

హైదరాబాద్‌:
బ్రాండ్‌ ప్రమోషన్‌ కోసం కంపెనీలు అడ్వర్టైజ్‌మెంట్లపై ఆధారపడతాయి. అందుకోసం కోట్ల రూపాయలు ఖర్చుపెడతాయి. సెలబ్రిటీలతో యాడ్స్‌ రూపొందించి కస్టమర్లను ఆకట్టుకుంటాయి. అయితే వీటిలో చాలామటుకు వినియోగదారులను మోసగించేవే ఉంటాయి. చేసిన ప్రచారానికి వస్తువు చేసే పనికి పొంతనే ఉండదు. ఇకపై ఇలాంటివి చెల్లవంటోంది కేంద్ర ప్రభుత్వం. ఇక మ్యానుఫ్యాక్చరర్లతో పాటు సర్వీస్‌ ప్రొవైడర్లు, చివరకు యాడ్స్‌లో నటించే సెలబ్రిటీలు సైతం ఆయా ప్రకటనలకు బాధ్యతవహించాలని స్పష్టం చేస్తోంది. దీనికి సంబంధించి ది కన్జ్యూమర్‌ ప్రొటెక్షన్‌ బిల్‌ 2019కు లోక్‌సభ ఆమోదం తెలిపింది. రాజ్యసభలో బిల్లు గట్టెక్కి రాష్ట్రపతి సంతకం చేస్తే త్వరలోనే చట్టరూపం దాల్చనుంది.
తప్పుడు యాడ్స్‌ నియంత్రణ కోసం
ది కన్జ్యూమర్‌ ప్రొటెక్షన్‌ బిల్‌ 2019 ప్రకారం టెలివిజన్‌, రేడియో, ప్రింట్‌, ఔట్‌ డోర్‌ యాడ్స్‌, ఈ కామర్స్‌, టెలిమార్కెటింగ్‌ ఇలా ఏ మాధ్యమంలో తప్పుడు ప్రకటనలు ఇచ్చినా అది శిక్షార్హమవుతుంది. సెలబ్రిటీలను చూసి ప్రొడక్ట్‌ కొనే కస్టమర్లు చాలా మందే ఉంటారు. ఈ నేపథ్యంలో కంపెనీల మోసాలకు కస్టమర్లు బలవకుండా ఉండేందుకు తప్పుడు ప్రకటనల్లో నటించే సెలబ్రిటీలను బాధ్యులను చేయాలని ఈ బిల్లు చెబుతోంది. ఇలాంటి వాటిని నియంత్రించేందుకు అడ్వర్టైజింగ్‌ స్టాండర్డ్స్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ఏర్పాటు చేయనున్నారు. ప్రొడక్ట్‌ క్వాలిటీ, క్వాంటిటీ, సర్వీస్‌ తదితర విషయాలు యాడ్స్‌లో చూపినట్లుగా ఉన్నాయా లేదా అన్న విషయాన్ని ఈ సంస్థ చూసుకుంటుంది. ఫలితంగా కస్టమర్లు మోసపోయే అవకాశాలు తగ్గుతాయని కేంద్రం భావిస్తోంది.
బ్రాండ్‌ అంబాసిడర్లకు రూ.10లక్షల పెనాల్టీ
తప్పుడు యాడ్స్‌ నియంత్రణ కోసం ఢిల్లీ హెడ్‌ క్వార్టర్స్‌గా చీఫ్‌ కమిషనర్‌ ఆధ్వర్యంలో సెంట్రల్‌ కన్జ్యూమర్‌ ప్రొటెక్షన్‌ అథారిటీ ఏర్పాటు చేయనున్నారు. వినియోగదారుల హక్కులు, తప్పుడు వ్యాపార విధాననాలు, మోసపూరిత అడ్వర్టైజ్మెంట్లను ఈ సంస్థ పర్యవేక్షించనుంది. కన్జ్యూమర్‌ ప్రొటెక్షన్‌ బిల్‌ 2019 ప్రకారం తప్పుడు ప్రకటనలు ఇచ్చిన ఉత్పత్తిదారులు, సర్వీస్‌ ప్రొవైడర్లకు రెండేళ్ల శిక్షతో పాటు రూ.10 లక్షల జరిమానా విధించనున్నారు. ఇలాంటి యాడ్స్‌ను ఎండార్స్‌ చేసే సెలబ్రీటీలకు కూడా రూ.10 లక్షల వరకు పెనాల్టీ విధించనున్నారు. ఇదే తప్పు మళ్లీ చేస్తే జరిమానా మొత్తాన్ని రూ.50లక్షలకు జైలు శిక్షను ఐదేళ్లకు పెంచనున్నారు. అంతేకాదు.. సదరు సెలబ్రిటీ ఏడాది వరకు వేరే ఏ అడ్వర్టైజ్‌మెంట్లు ఎండార్స్‌ చేయకుండా నిషేధం విధించనున్నారు. కేసు తీవ్రతను బట్టి నిషేధాన్ని మూడేళ్లకు పొడగించే అవకాశం కూడా ఉంది.