కేబినెట్ విస్తరణ అప్పుడే!
తెలంగాణ కేబినెట్ విస్తరణకు శుక్రమాఢ్యమి ఆటంకం
- -ఆశావహులకు తప్పని నిరాశ
- మూడు నెలల దాకా మంచి ముహూర్తాలు లేవు
- -సెప్టెంబర్ నెలలోనే మంత్రివర్గ విస్తరణ
- -మున్సిపల్ ఎన్నికల తర్వాతే నిర్ణయం
- -కేటీఆర్, హరీష్‌రావు, తుమ్మలకు అవకాశం
- -ఇద్దరు మహిళలకు మంత్రివర్గంలో స్థానం
- -సంబంధిత శాఖ మంత్రులు లేక గందరగోళం
- -దసరానాటికి విస్తరణ ఖాయం అంటున్న ఆశావహులు
హైదరాబాద్:
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వీలైనంత త్వరగా మంత్రివర్గాన్ని విస్తరించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కొత్తగా మంత్రి పదవులు ఎవరికి దక్కుతాయనే విషయంలోనూ తాజాగా పలువురి పేర్లు టీఆర్‌ఎస్ ముఖ్యుల అంతర్గత సంభాషణల్లో ప్రస్తావనకు వస్తున్నాయి. టీఆర్‌ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చాక.. ఇప్పుడు మునిసిపల్ ఎన్నికల వంతు వచ్చింది. మరోవైపు సీఎం కేసీఆర్‌కు జాతకాలు, ముహూర్తాలపై నమ్మకం ఎక్కువ. ప్రస్తుతం ఆషాఢ మాసం నడుస్తోంది. ఇది శుభకార్యాలకు అనుకూలం కాదని భావిస్తారు. రేపటి నుంచి ఆషాఢ మాసం ముగిసి శ్రావణ మాసం వస్తుంది. దీనిని హిందువులు పవిత్ర మాసంగానే పరిగణిస్తారు. కానీ జూలై 9 నుంచి సెప్టెంబరు 20 దాకా శుక్రమౌఢ్యమి ఉంది.
సెప్టెంబరు 1 నుంచి భాద్రపద మాసం వస్తుంది. ఆ నెల 15 నుంచి మహాలయపక్షాలు మొదలవుతాయి. 28న మహాలయ అమావాస్య. మౌఢ్యమి కారణంగా శ్రావణ మాసంలోనూ మంచి ముహూర్తాలు లేవని పండితులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ సన్నిహిత శిబిరం నుంచి కేబినెట్ విస్తరణ సంకేతాలు వెలువడుతున్నాయి. కానీ పార్టీ కీలక నేతల నుంచి కూడా కచ్చితమైన ముహూర్త ధ్రువీకరణ సమాచారం బయటికి రావట్లేదు. అయితే మునిసిపల్ ఎన్నికలకు వెళ్తున్న క్రమంలో అంతకంటే ముందు కేబినెట్ విస్తరణకు మొగ్గు చూపకపోవచ్చని తెలుస్తోంది. మూఢం అయినా పర్వాలేదనుకుంటే.. మునిసిపల్ ఎన్నికలు ముగిశాక శ్రావణ మాసంలోనే కేబినెట్ విస్తరణ ఉండే అవకాశం ఉందని సమాచారం. మునిసిపల్ ఎన్నికలను ఆగస్టులోనే పూర్తి చేసుకొని, ఆ తర్వాత పూర్తిస్థాయిలో పాలనపై దష్టి పెట్టబోతున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించటం అందుకు ఊతం ఇస్తోంది. అప్పుడు కుదరకపోతే భాద్రపదమాసంలో (సెప్టెంబరు 1 నుంచి మొదలవుతుంది) మొదటి 14 రోజుల్లో ఉండొచ్చు. అప్పుడూ కుదరకపోతే మహాలయ అమావాస్య వెళ్లే దాకా ఆగాల్సిందే. పిత పక్షాలు ముగిసిన మర్నాడు ఆశ్వయుజ మాసం వచ్చేస్తుంది. అక్టోబర్ 8న విజయదశమి. మౌఢ్యమి పట్టింపు ఉంటే మాత్రం మహాలయ పక్షాలు ముగిసే దాకా ఆగి.. దసరా సమయానికి తప్పనిసరిగా కేబినెట్ విస్తరించే అవకాశం ఉంది.
రేసులోకి తుమ్మల
కేబినెట్‌లో ఆరు కొత్త బెర్త్‌లకు అవకాశం ఉండగా, రేసులో అందరికంటే ముందు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉన్నట్లు తెలుస్తోంది. ఖమ్మం జిల్లాకు, కమ్మ సామాజిక వర్గానికి కేబినెట్‌లో ప్రాతినిధ్యం లేదు. ఈ నేపథ్యంలో తుమ్మలకు మంత్రి అవకాశం ఇవ్వాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అదే సామాజిక వర్గం నుంచి ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. షెడ్యూల్ ప్రకారం 2021లో జరగాల్సిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలోనే కమ్మ సామాజిక వర్గానికి కేబినెట్‌లో చోటు ఇవ్వాలనే నిర్ణయానికి సీఎం కేసీఆర్ వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు.. మహిళా కోటాలో సబితా ఇంద్రారెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈమధ్యనే కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎసఎల్పీలో విలీనమైన 12 మంది ఎమ్మెల్యేల్లో ఆమె ఒకరు. సబితా ఇంద్రారెడ్డి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన వారు.
ప్రస్తుతం అక్కడి నుంచి కేబినెట్ మంత్రిగా మల్లారెడ్డి ఉన్నారు. టీఆర్‌ఎస్ తొలి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసి, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన పట్నం మహేందర్‌రెడ్డి ఇటీవల రంగారెడ్డి స్థానిక సంస్థల స్థానం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఇక మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి ఒకరికి కేబినెట్‌లో చోటు దక్కటం లాంఛనమే అని తెలుస్తోంది. ఆ చాన్స్ మాజీ మంత్రి జోగు రామన్న (ఆదిలాబాద్ ఎమ్మెల్యే), గంగుల కమలాకర్ (కరీంనగర్ ఎమ్మెల్యే)లో ఎవరో ఒకరికి దక్కవచ్చనే ప్రచారం జరుగుతోంది. ఇక మాజీ మంత్రులు కె.తారకరామారావు, టి.హరీశ్‌రావుకు జరగబోయే కేబినెట్ విస్తరణలో చోటు లభించటంపైనా స్పష్టత లేదు. వెలమ సామాజిక వర్గం నుంచి కేబినెట్‌లో సీఎం కేసీఆర్‌తోపాటు, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఉన్నారు. కేటీఆర్‌ను, హరీశ్‌రావును కూడా మంత్రివర్గంలోకి తీసుకుంటే, వెలమ సామాజిక వర్గం నుంచి కేబినెట్‌లో నలుగురికి చోటు దక్కినట్లు అవుతుంది. అంతేకాక కేటీఆర్, హరీశ్‌రావు విషయంలో సీఎం కేసీఆర్ మనోగతం ఇంకా వెల్లడికాలేదని తెలుస్తోంది. ఇక, మాదిగ సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలని భావిస్తే, ఎవరికి చోటు కల్పిస్తారో వేచిచూడాల్సి ఉందని అంటున్నారు. ప్రస్తుత కేబినెట్‌లో ఎస్టీలకు ప్రాతినిధ్యం లేకపోవడంతో, విస్తరణలో ఆ సామాజిక వర్గానికి తప్పక ప్రాతినిధ్యం లభిస్తుందని చెబుతున్నారు.
హరీష్‌కు ఈసారైనా..
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడెప్పుడు మంత్రివర్గ విస్తరణ చేపడతారా అనే అంశం రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపుతోంది. కేబినెట్‌లో మరో ఆరుగురిని తీసుకునే అవకాశం ఉండటంతో… కేటీఆర్, హరీశ్‌రావుకు ఈ సారి కేబినెట్‌లో చోటు ఖాయమనే ప్రచారం జోరుగా సాగుతోంది. వీరి సంగతి ఇలా ఉంటే… ఖమ్మం నుంచి ఈ సారి కేబినెట్‌లోకి ఎవరిని తీసుకుంటారనే అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఖమ్మం జిల్లాకు చెందిన మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ఉంటే… ఆయన కచ్చితంగా మంత్రి అయ్యేవారు. కానీ ఆయన ఎన్నికల్లో ఓటమి చవిచూడటంతో…కేబినెట్ బెర్త్ దక్కలేదు. అయితే మరికొద్ది రోజుల్లోనే మంత్రివర్గ విస్తరణ తుమ్మల నాగేశ్వరరావుకు మళ్లీ కేసీఆర్ మంత్రిగా అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.
ఉమ్మడి ఖమ్మం జిల్లా కోటాలో తుమ్మల నాగేశ్వరరావుకు కేసీఆర్ ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వొచ్చని… ఆయన కాకపోతే ఆ ఛాన్స్ ఖమ్మం ఎమ్మెల్యే అయిన పువ్వాడ అజయ్ కుమార్‌కు దక్కొచ్చని ప్రచారం సాగుతోంది. కేటీఆర్‌కు సన్నిహితుడైన పువ్వాడ అజయ్… కేబినెట్ బెర్త్ కోసం చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారనే టాక్ ఉంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కమ్మ సామాజికవర్గం ఓటర్లను ఆకర్షించేందుకు కచ్చితంగా ఆ వర్గానికి చెందిన నేతను కేబినెట్‌లోకి తీసుకునే అవకాశం ఉందని టీఆర్‌ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే తుమ్మల లేదా పువ్వాడ అజయ్‌లలో ఎవరో ఒకరికి మంత్రిగా అవకాశం రావడం ఖాయంగా కనిపిస్తోంది.
అధికార టీఆర్‌ఎస్ ఎన్నికల కోలాహలం పూర్తి చేసుకొని పూర్తిగా పాలనపై ద ష్టి పెట్టింది. అదే సమయంలో మంత్రివర్గ విస్తరణపైనా కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. ఆగష్టు మొదటివారంలోనే మంత్రివర్గ విస్తరణ చేయబోతున్నట్టు, పార్టీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది..కానీ మూఢం కావడంతో అవకాశం లేదని తెలుస్తోంది. కేబినెట్ విస్తరణలో హరీష్ రావుకు మంత్రి పదవిపై స్పష్టత వచ్చినట్టు సమాచారం. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు విస్తరణలో ఛాన్స్ లభించడం ఖాయమన్న ప్రచారం జరుగుతోంది.
మంత్రివర్గ విస్తరణలో ఈసారి నలుగురికి స్థానం కల్పించనున్నారని, ఆ నలుగురు సీనియర్ నేతలేనని తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణకు ఆగస్టు 6న ముహూర్తం ఖరారు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. టీఆర్‌ఎస్ వర్గాల నుంచి వస్తున్న విశ్వసనీయ సమాచారం మేరకు కేటీఆర్, హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, తుమ్మలకు కేబినెట్‌లో చోటు దక్కనుందట. సబిత మినహా మిగతా ముగ్గురు గత కేబినెట్‌లో పనిచేసిన వారే.
సీఎం కేసీఆర్ సహా మొత్తం 18మందిని కేబినెట్‌లోకి తీసుకోవచ్చు. ప్రస్తుతం 12మంది మంత్రులున్నారు. ఇంకా 6 బెర్తులు ఖాళీ ఉన్నాయి. ఇప్పుడు నలుగురిని కొత్తగా తీసుకుంటారని చెబుతున్నారు. వీరితో పాటు మరో ఇద్దరికి మినిస్ట్రీ ఇచ్చే విషయమై సీఎం పలువురి పేర్లు పరిశీలిస్తున్నారట. అయితే, మిగిలిన రెండు స్థానాలు మున్సిపల్ ఎన్నికల తర్వాత భర్తీ చేయబోతున్నట్టు సమాచారం. ఆ సమయంలో ఎస్టీ కోటాలో ఓ మహిళతో పాటు ఓసీ సామాజికవర్గం నుంచి మరొకరిని మంత్రివర్గంలోకి తీసుకుంటారని తెలుస్తోంది.
ఆగస్టు 15 తరువాత పాలన అంటే ఏంటో చూపిస్తానంటూ ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. అంతకంటే ముందే ఓ మహిళతో పాటు ముగ్గురికి కేబినెట్‌లో చోటు కల్పించి, మున్సిపల్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ లక్ష్యంగా కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే సొంతూరులో పర్యటించిన సీఎం చింతమడక ప్రజలపై వరాల జల్లు కురిపించారు. గ్రామ అభివ ద్ధి కోసం అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు.