Skip to content
Post Views: 566
- తాను వ్యాపారవేత్తగా విఫలమయ్యానని లేఖ
- గతకొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న సిద్ధార్థ
- ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానాలు
- గాలింపు చర్యలు ముమ్మరం చేసిన పోలీస్ యంత్రాంగం
- బెంగళూరు, జులై30 : కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి అల్లుడు, కేఫ్ కాఫీ డే అధినేత వీజీ సిద్దార్థ మిస్సింగ్ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. సోమవారం సాయంత్రం మంగళూరులోని నేత్రావతి నది వంతెనపై తన వాహనం దిగి నడుచుకుంటూ వెళ్లిన సిద్దార్థ ఆ తర్వాత కన్పించకుండా పోయారు. దీంతో ఆయన ఎక్కడున్నారు, ఎమయ్యారనేది చిక్కుముడిగా మారింది. డ్రైవర్ చెప్పిన వివరాల ప్రకారం.. సిద్దార్థ కారు డ్రైవర్‌గా బసవరాజ్ పాటిల్ గత మూడేళ్లుగా పనిచేస్తున్నాడు. సోమవారం టయోటా ఇన్నోవాలో బెంగళూరు నుంచి సఖిలేష్‌పూర్‌కు వెళ్లమని డ్రైవర్‌కు చెప్పి సిద్దార్థ కారు ఎక్కారు. బెంగళూరు నుంచి సఖిలేష్‌పూర్‌కు 220 కిలోవిూటర్ల దూరం. అయితే.. కొంత దూరం వెళ్లాక ఎందుకో
తెలియదు గానీ సిద్దార్థ మనసు మార్చుకున్నారు. మంగళూరుకు వెళ్లమని డ్రైవర్‌కు చెప్పాడు. మంగళూరుకు సవిూపంలో నేత్రావతి నదిపై ఉన్న బ్రిడ్జి సవిూపించగానే వీజీ సిద్దార్థ ఉన్నట్టుండి కారును ఆపమని డ్రైవర్‌కు చెప్పాడు. డ్రైవర్ కారు ఆపగానే అందులో నుంచి దిగిన సిద్దార్థ కారును బ్రిడ్జి చివరకు తీసుకెళ్లి ఆపి.. అక్కడే వేచి ఉండాలని డ్రైవర్‌తో చెప్పి.. అక్కడ నుంచి కొద్ది దూరం నడుచుకుంటూ వెళ్లారు. అప్పుడు సమయం రాత్రి 7 గంటలు. డ్రైవర్ వేచి చూశాడు. సమయ రాత్రి 8 గంటలయింది. గంట దాటినా సిద్దార్థ ఎంతకీ రాకపోవడంతో డ్రైవర్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. డ్రైవర్ చెప్పిన వివరాల ఆధారంగా.. సిద్దార్థ బ్రిడ్జి పైనుంచి నదిలోకి దూకి ఉండొచ్చనే ప్రాథమిక అంచనాకు పోలీసులు వచ్చారు. డాగ్‌స్క్వాడ్‌తో బ్రిడ్జి వద్దకు మంగళూరు పోలీసులు వెళ్లారు. డాగ్‌స్క్వాడ్ సెర్చ్ డాగ్ బ్రిడ్జి మధ్యలోకి వెళ్లి ఆగడంతో అక్కడ నుంచి సిద్దార్థ దూకి ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.
విూ నమ్మకాన్ని వమ్ము చేసినందుకు నన్ను క్షమించండి..
ఇది జరగడానికి ముందు సిద్దార్థ తన సంస్థ ఉద్యోగులు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లకు ఓ లేఖ రాశారు. సిద్దార్థ రాసిన ఈ లేఖ విూడియాలో ప్రచారమవుతోంది. వ్యాపారంలో నష్టాలు, ఆర్థిక ఇబ్బందుల కారణంగా సిద్దార్థ అదృశ్యమైనట్టు లేఖ ద్వారా స్పష్టమవుతోంది. నాపై నమ్మకం పెట్టుకున్న ప్రతి ఒక్కరికీ క్షమాపణ చెప్పుకుంటున్నాను.. నేను వ్యాపారవేత్తగా విఫలమయ్యాను అని పేర్కొన్నారు. 37ఏళ్ల నా కృషితో ప్రత్యక్షంగా 30వేల మందికి, పరోక్షంగా 20వేల మందికి ఉపాధి కల్పించానని, ప్రస్తుతం మంచి ప్రయత్నాలు చేస్తున్నా, వ్యాపారాన్ని లాభసాటిగా సృష్టించడంలో విఫలమవుతున్నానని ఆ లేఖలో పేర్కొన్నారు. దీనిపై సుదీర్ఘకాలం నుంచి పోరాటం చేస్తున్నా ఇక నాకు పోరాడే ఓపిక లేదు.. అందుకే అన్ని వదిలేస్తున్నా అంటూ లేఖలో పేర్కొన్నారు. ఆరు మాసాల కిందట ఓ స్నేహితుడి నుంచి పెద్ద మొత్తంలో రుణం తీసుకున్నాను, ఓ ప్రయివేటు ఈక్విటీలోని భాగస్వాములు షేర్లను బైబ్యాక్ చేయమని నన్ను బలవంతపెడుతున్నారన్నారు. ఆదాయపు పన్ను గత డీజీ నుంచి ఎన్నో వేధింపులకు ఎదుర్కొన్నానని,
రుణాలు తీసుకున్నవారి నుంచి ఒత్తిడి కూడా ఎక్కువైందని, నాపై విూరంతా ఎంతో నమ్మకం ఉంచారని, దాన్ని వమ్ము చేస్తున్నందుకు క్షమించండి అంటూ లేఖలో పేర్కొన్నారు. కొత్త యాజమాన్యంతో విూరంతా మద్దతుగా ఈ వ్యాపారాని ఇలాగే కొనసాగించాలని కోరుతున్నానని, నా తప్పులన్నింటికీ నాదే బాధ్యత అని, నా లావాదేవీల గురించి మా మేనేజ్‌మెంట్‌కు, ఆడిటర్లకు తెలియదని, వాటికి నేనే జవాబుదారిని అని, నేను ఎవర్నీ మోసం చేయాలనుకోలేదని, నేను విఫల వ్యాపారవేత్తను.. నన్ను క్షమించండి అని సిద్దార్థ ఆ లేఖలో పేర్కొన్నారు. కాగా, సిద్దార్థ ఆచూకీ కోసం 200 మందికి పైగా పోలీసులు గాలిస్తున్నారు. నేత్రావతి నదిని గజ ఈతగాళ్ల సాయంతో జ్లలెడ పడుతున్నారు. ఇక, మాజీ ముఖ్యమంత్రి ఎస్.ఎం. కృష్ణ గత ఎన్నికల ముందే బీజేపీలో చేరారు. ఆయన అల్లుడు సిద్దార్థ మిస్సింగ్ వార్త తెలియగానే ముఖ్యమంత్రి యడియూరప్ప, పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు కృష్ణ నివాసానికి చేరుకున్నారు.
సిద్దార్థ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదు – శివకుమార్
కాఫీ డే అధినేత వీజీ సిద్దార్థ అదృశ్యంపై కర్నాటక కాంగ్రెస్ కీలక నేత డీకే శివకుమార్ ట్వీట్ చేశారు. సిద్దార్థ పేరుతో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న లేఖపై ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. ఆ లేఖ జులై 27న రాసినట్టుగా ఉందని, కానీ 28వ తేదీ తనకు సిద్దార్థ నుంచి ఫోన్ కాల్ వచ్చిందని డీకే పేర్కొన్నారు. కలిసి మాట్లాడాలని సిద్దార్థ చెప్పినట్లు ఆయన తెలిపారు. సిద్దార్థ ఎంతో ధైర్యవంతుడని,
ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడంటే తాను నమ్మలేకపోతున్నానని.. సిద్దార్థ అదృశ్యంపై తనకు అనుమానాలున్నాయని చెప్పారు. సిద్దార్థ కుటుంబానికి, తమ కుటుంబానికి కొన్నేళ్లుగా సాన్నిహిత్యం ఉందని.. ఈ ఘటనపై పోలీసులు సమగ్రంగా విచారణ జరిపి నిజానిజాలను నిగ్గు తేల్చాలని డీకే శివకుమార్ డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే.. సిద్దార్థ అదృశ్యమైన విషయం తెలియగానే ఎస్‌ఎం కృష్ణ నివాసానికి డీకే వెళ్లారు. ఏం జరగదని, ధైర్యంగా ఉండాలని సిద్దార్థ కుటుంబ సభ్యుల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు.
కోస్టల్ గార్డులు,హెలికాప్టర్లను రంగంలో దించండి..
కాఫీ డే యజమాని వీజీ సిద్దార్థ ఆచూకీ కోసం కేంద్ర ¬ంశాఖ చర్యలు తీసుకోవాలని కర్ణాటక రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీ శోభా కేంద్ర ¬ంశాఖ మంత్రి అమిత్ షాకు విన్నవించారు. సిద్దార్థ ఆచూకీ కనుగొనడానికి కోస్టల్ గార్డులు, కేంద్ర బలగాలు, హెలికాప్టర్లను రంగంలోకి దించాలని శోభా అమిత్ షాను కోరారు. కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలోని నేత్రావతి బ్రిడ్జి వద్ద అదృశ్యం అయిన సిద్దార్థది తన ఉడుపి చిక్కామంగళూరు నియోజకవర్గమని, అతని ఆచూకీ కనుగొనటానికి సత్వరం చర్యలు తీసుకోవాలని ఎంపీ శోభా కోరారు. 58 ఏళ్ల సిద్దార్థ మాజీ ముఖ్యమంత్రి ఎస్‌ఎం కృష్ణ అల్లుడని, అతని కోసం కేంద్ర బలగాలతో గాలించాలని కోరుతూ ఎంపీ శోభా కేంద్ర¬ంశాఖ మంత్రికి వినతిపత్రాన్ని సమర్పించారు.