పై బెర్తు నుంచి పడి మహిళకు గాయాలు చికిత్సకు తరలిస్తుండగా మృతి

బెంగళూరు,జూలై29: రైలులో పై బెర్తు నుంచి దిగుతుండగా జారిపడి ఓ మహిళ మృతి చెందిన 
ఘటన బెంగళూరులోని సంగోళీ రాయన్న రైల్వేస్టేషన్‌లో చోటుచేసుకుంది. కోల్‌కతా వాసి అయిన సరస్వతీ బనిసల్‌ బెంగళూరులోని ఓ బ్యూటీ పార్లర్‌లో పనిచేస్తూ, ముంబయి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. రైలు బెంగళూరు సవిూపానికి రాగానే పై బెర్తులో ఉన్న సరస్వతి కిందకి దిగుతుండగా..ప్రమాదవశాత్తూ జారిపడ్డారు. దీంతో ఆమె తలకి గాయమైంది. తోటి ప్రయాణికులు ఈ ఘటనకు సంబంధించి రైల్వే శాఖ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. అధికారులు వెంటనే రైల్వే పోలీసులు, వైద్య సిబ్బందిని అప్రమత్తం చేశారు. వారంతా రైలు చేరుకోబోయే తర్వాతి స్టేషన్‌లో సిద్ధంగా ఉన్నారు. రైలు రాగానే డాక్టర్‌ స్నేహలత లోపలికి వెళ్లి బాధితురాలిని పరీక్షించారు. అప్పటికీ సరస్వతి సాధారణంగానే ఉన్నారు. మెరుగైన చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. తీకుకెళ్తున్న క్రమంలోనూ తన లగేజీ జాగ్రత్త అంటూ పోలీసులకు సూచించారు. క్లినిక్‌కి వెళ్లిన తర్వాత ప్రాథమిక చికిత్స అందిస్తున్నప్పుడూ బాగానే స్పందించారు. కానీ, క్రమంగా సమయం గడుస్తున్న కొద్దీ సరస్వతి మాటలు తడబడడం మొదలయ్యింది. బెంగళూరులో ఎక్కడ ఉంటారు లాంటి చిన్న చిన్న ప్రశ్నలకు సైతం సరిగా సమాధానం ఇవ్వలేకపోయారు. దీంతో మెరుగైన చికిత్స కోసం కేసీ జనరల్‌ ఆసుపత్రికి తరలించాలని నిర్ణయించారు. 
వెంటనే వైద్య సిబ్బంది సాయంతో అంబులెన్సులో తీసుకెళ్లారు. మార్గం మధ్యలో ఆక్సిజన్‌ లెవల్స్‌ పడిపోసాగాయి. దీంతో వెంటనే ఆక్సిజన్‌ శాతాన్ని పెంచాలని సిబ్బందికి డాక్టర్‌ స్నేహలత ఫోన్‌ ద్వారా సూచించారు. ఆసుపత్రికి చేరుకోగానే కొన్ని ప్రాథమిక పరీక్షలు నిర్వహించిన వైద్యులు అప్పటికే సరస్వతి చనిపోయినట్లు ధ్రువీకరించారు. అయితే ఆమె మరణానికి కారణం ఏంటి అన్నది మాత్రం ఇంకా తెలియరాలేదు. వెన్నెముకలో లేదా మెదడులో బలమైన గాయం కావడం వల్లే ఆమె మరణించి ఉంటారని వైద్యులు అనుమానం వ్యక్తం చేశారు. శవపరీక్ష నివేదిక వచ్చిన తరవాతే ఆ విషయం తేలుతుందన్నారు. సరస్వతి పరిస్థితిపై ఆమె చెల్లిని పోలీసులు ఆరా తీశారు. రైలులో ప్రయాణించేవారు.. అనారోగ్య సమస్యలున్నట్లయితే, ముందు జాగ్రత్త చర్యగా మధ్య, పై బెర్తులను ఎంచుకోవద్దని వైద్యులు సూచిస్తున్నారు.