కన్నీరు పెట్టిన పాలమూరు ప్రజలు
ఆయన మరణంతో ప్రజల మనోవ్యధ
మహబూబ్‌నగర్,జూలై29: 1984లో మహబూబ్‌నగర్ ఎంపీగా జనతాపార్టీ నుంచి ఎంపికైనప్పటి నుంచి 2014 వరకు జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా మెరిసిన జైపాల్ రెడ్డి మృతి పాలమూరు వాసులను కన్నీరు పెట్టించింది. ఆయనను కడసారి చూసి నివాళి అర్పించేందుకు ఉమ్మడి జిల్లా నుంచి
అనేకులు హైదరాబాద్ వెళ్లారు. శాసనసభలో, పార్లమెంటులో ఆయన ఏ అంశంపైనైనా సాధికారతతో చేసే ప్రసంగం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునేది. అలాంటి తమ నేత ఇక లేడన్న వార్త వారిని కలచివేసింది. ఏ సమస్య పైనైనా మాట్లాడ గలిగే వాగ్దాటి కలిగిన సామర్థ్యమే ఆయనను విద్యార్థి రాజకీయాల నుంచి కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగేలా చేసింది.. దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసేలా చూసింది. చదువుకునే సమయంలోనే విద్యార్థి సంఘాల్లో కీలకపాత్ర పోషించిన సూదిని జైపాల్‌రెడ్డి 1969లో కల్వకుర్తి ఎమ్మెల్యేగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు.. 2019 ఎంపీ ఎన్నికల సమయంలో పోటీ చేయని ఆయన కొన్ని ప్రాంతాల్లో ప్రచారానికి పరిమితమయ్యారు.. అప్పటి నుంచి జిల్లాకు రాని ఆయన మరణవార్త వినడంతో పాలమూరు జనం శోకసంద్రంలో మునిగిపోయారు.. తమ గడ్డ ఖ్యాతిని దేశ స్థాయిలో చాటిన ప్రియతమ నేతను కడసారి చూసేందుకు నాయకులు, కార్యకర్తలు హైదరాబాద్‌కు తరలివెళ్లారు.. 5 దశాబ్దాల జీవితంలో ఎన్ని ఒడుదొడుకులు ఎదుర్కొన్నా తాను నమ్మిన సిద్దాంతాల విషయంలో రాజీపడని నేత జైపాల్‌రెడ్డి కన్నుమూత తీరని లోటు అని జిల్లావాసులు ఆవేదనకు గురయ్యారు. పాలమూరు నుంచి ఎంతోమంది ఉద్ధండులు రాజకీయాల్లో కీలకపాత్ర పోషించారు.. స్థానికులే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ గెలిచి తమదైన ముద్ర వేశారు.. ఎంతమంది నేతలు ఉన్నా మహబూబ్‌నగర్ అంటే ముందుగా గుర్చుకొచ్చేది జైపాల్‌రెడ్డియే. 50 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఆయన జిల్లాపై అంతలా ముద్ర వేశారు. 1969లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన రాజకీయ ప్రస్థానం ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్రమంత్రిగా స్ఫూర్తిదాయకంగా సాగింది. విలువలే ఆభరణంగా సాగిన ఆయన ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితిని వ్యతిరేకించి సొంత పార్టీ కాంగ్రెస్‌ను వీడారు. అనంతరం 1980లో మెదక్ నుంచి ఇందిరాగాంధీ బరిలోకి దిగగా ఆమెపై జనతాపార్టీ నుంచి పోటీ చేసి జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయ్యారు.సుదీర్ఘ రాజకీయ జీవితంలో అవినీతి మకిలి అంటించుకోకుండా జైపాల్‌రెడ్డి అందరి మన్ననలు అందుకున్నారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్రమంత్రిగా వ్యవహరించినా ఎక్కడా ఆరోపణలు ఎదుర్కొనలేదు. రాజకీయాలంటేనే ఆరోపణలు, ప్రత్యారోపణలు. ముక్కుసూటిగా మాట్లాడే ఆయన ఏనాడూ వ్యక్తిగత అంశాల జోలికి వెళ్లేవారు కాదు.. ఎవరితోనూ వ్యక్తిగత దూషణకు గురికాలేదు.