విదేశీ మొగుళ్లకు స్వదేశీ కష్టాలు


భార్యలను వేధించే ఎన్నారై భర్తల ఆగడాలపై దృష్టిపెట్టిన కేంద్రం 

  • త్వరలోనే ఎన్నారై భర్తల ఆగడాలకు చెక్‌ 
  • మూన్నాళ్ల ముచ్చటగా జరుగుతున్న విదేశీ పెళ్లిళ్లు 
  • భార్యలను వదిలించుకుంటున్న వైనం 
  • భారత చట్టాలకు తూట్లు పొడుస్తున్న ఎన్నారైలు 
  • రెండు తెలుగు రాష్ట్రాలనుంచి ఎక్కువగా ఫిర్యాదులు
  •   ప్రధానిని కలిసిన పంజాబ్‌ వుమెన్‌ కమిషన్‌ చైర్‌పర్సన్‌ 
  • తక్షణమే చర్యలు తీసుకుంటామని మోదీ హామీ 
  • ఫిర్యాదు చేస్తే పాస్‌పోర్టులు రద్దుచేస్తామంటున్న కేంద్రం 
  • ఇప్పటికే నమోదయిన 217 కేసులు 

హైదరాబాద్‌: 
పెళ్లి చేసుకుని పరాయి దేశానికి తీసుకెళ్లి భార్యలను వేధించే ఎన్నారై భర్తలు భార్యలను వదిలేసే ఎన్నారై భర్తల ఆగడాలకు కేంద్రం చెక్‌ పెట్టడానికి కేంద్రం రెడీ అవుతోంది. ఈ విషయం ఏకంగా ప్రధాని మోదీయే దష్టి పెట్టడంతో త్వరలో ఇలాంటివారి పని పట్టేలా చర్యలు తీసుకుంటారని తెలుస్తోంది. ఇటీవలి కాలంలో ఎన్నారై భర్తలు వదిలేసే భారతీయ భార్యల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఈ విషయాన్ని పార్లమెంటు సాక్షిగా విదేశాంగ శాఖ మంత్రి కూడా వెల్లడించారు. ఇలా ఎన్నారై భర్తలు తమను వదిలేశారంటూ ఎంతోమంది మహిళలు ప్రభుత్వానికి ఫిర్యాదులు చేస్తున్నారు. ఇటీవలి కాలంలో ఈ ఫిర్యాదులు ఆంధ్రప్రదేశ్‌ నుంచి కూడా అధికంగా వస్తున్నాయని – ఈ పరిస్థితిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. 
పంజాబ్‌ వుమెన్‌ కమిషన్‌ చైర్‌ పర్సన్‌ మనీషా గులాటి గురువారం… ఎన్నారై భర్తలు వదిలేసిన ఎంతో మంది భార్యలు న్యాయం కోసం తమ కార్యాలయం తలుపులు తట్టారని చెప్పారు. ఈ పరిస్థితిని వివరించేందుకు తాను ప్రధాని మోదీని కలిసినట్లు ఆమె వెల్లడించారు. ఈ సందర్భంగా సమస్యను తెలుసుకున్న మోదీ.. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి తీసుకోవలసిన చర్యలన్నీ తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు మనీషా తెలిపారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఇప్పటికే తమకు ఇటువంటి ఫిర్యాదులు వచ్చాయని మోదీ చెప్పారని సమాచారం. 
కాగా కేంద్రం ఇప్పటికే ఇలాంటివారిపై చర్యలు తీసుకున్న సందర్భాలున్నాయి. గత ఏడాది – అంతకుముందు సంవత్సరం ఇలాంటి ఎన్నారై భర్తల పాస్‌ పోర్టులను కేంద్రం రద్దు చేసింది. పాస్పోర్టు రద్దు సమయంలో సదరు భర్త భారత్‌ లో ఉంటే కేసు తేలేవరకూ విదేశాలకు వెళ్లడం సాధ్యంకాకుండా చేయాలని.. ఒక వేళ విదేశాల్లో ఉంటే తక్షణమే భారత్‌ వచ్చేలా నిబంధనలు రూపొందిస్తున్నట్లు సమాచారం. 
అమెరికా సంబంధం.. అమ్మాయి జీవీతం బాగుంటుంది… బాగా డబ్బు సంపాదించుకుంటారు….బిడ్డ విదేశాల్లో ఉంటే ఇక్కడ సొసైటీ లో మాకు గౌరవం పెరుగుతుందనే ఆశతో చాలా మంది తల్లితండ్రులు తమ పిల్లలకు విదేశీ సంబంధాలపై ఆసక్తితో చాలా ఏళ్లుగా అలాంటి సంబంధాలే చూసి చేసారు. ఇలా చేసిన సంబంధాల్లో ఎక్కువమంది అమ్మాయిల జీవితాల్లో విషాదం నింపుతోంది. ఎన్నారై అల్లుళ్ళు వేధింపులు, మోసాలు తట్టుకోలేక… కన్న కూతుళ్లు పెళ్లైనా పుట్టింట్లోనే మగ్గిపోతున్నారు. దీంతో పోలీసు స్టేషన్‌ లో ఎన్నారై అల్లుళ్లపై నమోదయ్యే కేసులు ఎక్కువయ్యాయి. గడిచిన ఐదేళ్లలో హైదరాబాద్లో నమోదైన ఎన్నారై అల్లుళ కేసులో 217 కేసులకి లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేశారంటే వీటి తీవ్రత ఎంతవరకు ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఎన్నారై అల్లుళ్ళ ఆటలు కట్టించటానికి హైదరాబాద్‌ నగర పోలీసు మహిళా భద్రతా 
విభాగం దష్టి సారించింది. 
వారిపై నమోదైన కేసుల వివరాలతో విదేశాంగ మంత్రిత్వశాఖను సంప్రదించి విదేశీ అల్లుళ్ళ పాస్‌ పోర్టులు రద్దు చేయించేలా ప్రణాళిక సిధ్దం చేసింది. పాస్‌ పోర్టు రద్దయితే తప్పనిసరి పరిస్ధితుల్లో వారు ఇండియా తిరిగి రావాల్సి ఉంటుంది. చట్టంలో ఉన్న ఈ వెసులుబాటుతో ఐజీ స్వాతి లక్రా ఆధ్వర్యంలోని మహిళా విభాగం దీనిపై పనిచేస్తోంది. 

ఎన్నారై అల్లుళ్ల కేసుల్లో విదేశాలకు వెళ్లి తిరిగి రాకుండా అక్కడే ఉంటున్న వారికి పోలీసులు లుక్‌అవుట్‌నోటీసులు జారీ చేసి కోర్టు ద్వారా నాన్‌బెయిలబుల్‌ వారంట్లు జారీచేస్తున్నారు. ఈ సమాచారాన్ని విదేశాంగశాఖకు పంపి వారి పాస్‌పోర్టులు రద్దయ్యేట్లు చేస్తున్నారు. ఇలాంటివి 2018లో 118, 2019లో జూన్‌ వరకు 77 కేసులు వచ్చినట్టు రీజినల్‌ పాస్‌పోర్టు అధికారులు తెలిపారు. పాస్‌పోర్టు రద్దుతో చాలా కేసుల్లో ఎన్నారై నిందితులు దారిలోకి వస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఇటీవల రాజ్యసభలో ప్రవేశపెట్టిన ఎన్నారై వివాహ రిజిస్ట్రేషన్‌ బిల్లు-2019 చట్టమైతే అది ఎన్నారై అల్లుళ్ల పాలిట బ్రహ్మాస్త్రంగా మారనున్నది. భారత మహిళలను వివాహం చేసుకున్న 30 రోజుల్లో పెండ్లిని రిజిస్టర్‌ చేయకపోతే వారి పాస్‌పోర్టు జప్తు అయ్యేలా కొత్త చట్టంలో పొందుపరుస్తున్నారు. చాలావరకు ఎన్నారై భర్తల వేధింపు కేసుల దర్యాప్తు ఎక్కడో ఒకదశలో ఆగిపోతున్నాయని… వీటి వేగవంతానికి ఎన్నారై సెల్‌ ఏర్పాటుచేశామని హైదరాబాద్‌ ఐజీ స్వాతి లక్రా తెలిపారు. రాష్ట్రంలోని పోలీస్‌స్టేషన్లలో నమోదవుతున్న ఎన్నారై మ్యారేజ్‌ కేసులు, వాటి పురోగతిపై డీఎస్పీ ర్యాంకు అధికారి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారని అన్నారు. బాధితులు వస్తే ఏ పోలీస్‌స్టేషన్‌లో కేసులు పెట్టాలి? అన్నదానిపై సహకారం అందిస్తాం. ఈ కేసుల దర్యాప్తులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అధికారులకు అవగాహన కల్పిస్తాం. కరపత్రాలు, పోస్టర్లతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆమె తెలియచేశారు. 
వరకట్న వేధింపులకు మరో మహిళ బలైపోయింది. విదేశాల్లో లక్షల జీతం సంపాదిస్తున్నా డబ్బుపై ఆశ చావని భర్త, అత్తమామల వేధింపులతో పెళ్లై ఏడాది గడవకముందే ఆత్మహత్య చేసుకుంది. ఎన్నారై భర్త వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న శ్రీలత ఉదంతం మరువక ముందే రెండు రోజుల వ్యవధిలోనే మరో యువతి ప్రాణాలు తీసకోవడం సంచలనంగా మారింది. ఇటీవల రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం లక్ష్మీపూర్‌కు చెందిన లావణ్యకు గొల్లపల్లి గ్రామానికి చెందిన రవీందర్‌తో 9నెలల క్రితం పెళ్లయింది. రవీందర్‌ న్యూజిలాండ్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. లావణ్య పెళ్లయిన 15 రోజులకే భర్తతో కలిసి అక్కడికి వెళ్లింది. గ్రామంలో పుట్టి పెరిగిన లావణ్య దేశం కాని దేశంలో పార్టీ కల్చర్‌కు అలవాటు పడలేకపోయింది. ఈ నేపథ్యంలోనే భర్తతో కలహాలు మొదలయ్యాయి. 
రవీందర్‌ మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని ఆమెను వేధించసాగాడు. తమ బంధానికి అడ్డు తొలగాలంటూ మూడు నెలల క్రితం ఇండియాకు పంపేశాడు. దీంతో అత్తింటికి చేరుకున్న లావణ్యకు వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. అదనపు కట్నం తీసుకురావాలంటూ అత్తమామలు లావణ్యను వేధించసాగారు. దీంతో విసిగిపోయిన ఆమె కొద్దిరోజుల క్రితం పుట్టింటికి వచ్చేసింది. భర్త, అత్తమామల వేధింపులు తట్టుకోలేక బుధవారం ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. లావణ్య మతికి భర్త, అత్తమామలే కారణమని ఆరోపిస్తూ బంధువులు వారి ఇంటి ఎదుట మతదేహంతో కలిసి ధర్నా చేపట్టారు. పోలీసులు వారికి నచ్చజెప్పి లావణ్య మ తదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తమ బిడ్డ మ తికి కారణమైన రవీందర్‌ను న్యూజిలాండ్‌ నుంచి రప్పించి కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు డిమాండ్‌ చేస్తున్నారు. లావణ్య కుటుంబానికి మద్దతుగా స్థానిక మహిళా సంఘాలు ఆందోళనలో పాల్గొన్నాయి. 
భార్యలను వదిలేసి తప్పించుకు తిరిగే ఎన్నారై భర్తలకు షాక్‌ ట్రీట్‌ మెంట్‌ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇటీవల పెరుగుతున్న ఎన్నారై భర్తల ఆగడాలపై చర్చించిన కేంద్ర మంత్రివర్గ సంఘం కఠిన చర్యలను చేపట్టాలని నిర్ణయించింది. విచారణకు హాజరు కావాలని కోర్టు ఇచ్చిన సమన్లను ఖాతరు చేయని ఎన్నారై భర్తల వాటా ఆస్తిని జప్తు చేయాలనే ప్రతిపాదనను పరిశీలిస్తోంది. అంతే కాకుండా వారి పాస్‌ పోర్టుల రద్దు వంటి చర్యలు చేపట్టాలని భావిస్తోంది. 
ఆకర్షణీయ జీవనశైలితో ఆకట్టుకొని పెళ్లయ్యాక భార్యలను వదిలేసే ఎన్నారై భర్తల సంఖ్య ఇటీవల పెరుగుతోంది. ముఖ్యంగా పంజాబ్‌ వంటి రాష్ట్రాల్లో ఇలాంటి కేసులు ఎక్కువయ్యాయి. దీంతో కేంద్ర ప్రభుత్వ మంత్రుల బ ందం బాధిత మహిళలకు న్యాయం చేకూర్చేందుకు చేపట్టాల్సిన చర్యలు, చట్టంలో చేయాల్సిన మార్పులపై చర్చింది. 
జీవిత భాగస్వామి దాఖలు చేసిన ఫిర్యాదుపై పోలీసుల విచారణకు, కోర్టు సమన్లకు స్పందించకుండా.. దేశవిదేశాల్లో గుర్తింపు మార్చుకొని తప్పించుకు తిరిగే ఎన్నారై భర్తల ఉమ్మడి ఆస్తిలో వాటాను సీజ్‌ చేస్తూ చట్ట సవరణలు చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. అంతే కాకుండా సమాధానం రాని కోర్టు సమన్లను విదేశీ వ్యవహారాల శాఖ నిర్వహించే వెబ్‌ సైట్‌ లో పెడతారు. ఈ సైట్‌ లో నోటీసులు పెడితే సమన్లు అందినట్టే భావించి చర్యలు చేపడతారు. 
తమ ఆచూకీ దొరకకుండా పేర్లు మార్చి దేశాలు మార్చి తిరిగే వాళ్లకి చెక్‌ చెప్పాలంటే ఇదే సరైన మార్గమని ప్రభుత్వం భావిస్తోంది. వారిని పరారీలో ఉన్నట్టు ప్రకటించడంతో పాటు వారి ఆస్తుల స్వాధీనం, పాస్‌పోర్టుల రద్దు వంటి చర్యలు చేపట్టాలని కేంద్ర మంత్రుల బ ందం సిఫార్సు చేసింది. పెళ్లయిన 48 గంటల్లోగా ఎన్నారై వివాహాలను విధిగా రిజిస్టర్‌ చేయించాలన్న నిబంధన అమలుకు ప్రభుత్వం పూనుకుంది.