ఎలక్ట్రిక్ వాహనాలపై జీఎస్టీ తగ్గింపు
– 12నుంచి 5శాతం తగ్గిస్తూ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం
– ఆగస్టు 1నుంచి అమల్లోకి
న్యూఢిల్లీ, జులై27 : ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించింది. ఎలక్ట్రిక్ వాహనాల వల్ల పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించవచ్చునని భావిస్తుంది. తాజాగా శనివారం జరిగిన వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) కౌన్సిల్ సమావేశంలో ముందుగా ఊహించినట్లుగానే కీలక నిర్ణయానికి వేదికకైంది. విద్యుత్తు వాహనాలు, ఛార్జర్లపై జీఎస్టీ రేటును 12శాతం నుంచి 5శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. తాజా రేట్లు ఆగస్టు ఒకటి నుంచి అమలులోకి వస్తాయని జీఎస్టీ కౌన్సిల్ ప్రకటించింది. అలాగే స్థానిక అధికారిక యంత్రాంగం విద్యుత్తు బస్సులను అద్దెకు తీసుకున్నట్లయితే వాటిపై జీఎస్టీని మినహాయిస్తూ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ సహా పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీతారామన్ ఈ సమావేశాన్ని నిర్వహించారు. కేంద్రం బ్జడెట్ ప్రవేపెట్టిన తరవాత జీఎస్టీ కౌన్సిల్ భేటీ కావడం ఇదే తొలిసారి.
షెడ్యూర్ ప్రకారం ఈ సమావేశం గత గురువారమే జరగాల్సి ఉండగా.. అనివార్య కారణాల వల్ల శనివారంకు వాయిదా పడింది. గతేడాది జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో విద్యుత్ వాహనాలపై పన్ను తగ్గింపు అంశాన్ని అధికారుల కమిటీకి అప్పగించిన విషయం తెలిసిందే.