ఉత్తర భారత్ ను ముంచెత్తిన వర్షాలు
- – భారీవర్షాలతో ఉత్తరాఖండ్, రాజస్థాన్, యూపీ అతలాకుతలం
- – లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలింపు
- – ముంబయిలో ఎడతెరిపిలేని వర్షం
- – వరదనీటిలో చిక్కుకున్న మహాలక్ష్మీ ఎక్స్‌ప్రెస్
- – రైలులో 2వేల మంది ప్రయాణీకులు
- – ప్రయాణీకులను సురక్షితంగా బయటకు తెచ్చిన ఎన్డీఆర్ఎప్ బృందాలు
న్యూఢిల్లీ, జులై27 : వర్షాలు, వరదలతో ఉత్తర భారతం వణుకుతోంది. వరదలు ఊళ్లకు ఊళ్లను ముంచెత్తుతున్నాయి. ఇప్పటికే బిహార్, అసోంలో వర్షాల కారణంగా దాదాపు 200 మంది పౌరులు చనిపోయారు. ఉత్తరాఖండ్, రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్‌లోనూ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు కురుస్తుండడంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వరదల ఉధృతికి రాజస్థాన్‌లో… బివారీ తికారియా సవిూపంలో రైల్వేట్రాక్ పూర్తిగా కొట్టుకుపోయింది. అంతేకాదు.. టోనిక్ సవిూపంలోని పోలీస్ స్టేషన్, హాస్పిటల్‌ను వరదనీరు ముంచెత్తింది. ఆస్పత్రి జలదిగ్భంధంలో చిక్కుకుంది. మహారాష్ట్రలో ఒదర్పూర్ రైల్వేస్టేషన్ వరద నీటితో నిండిపోయింది. ఉత్తర్‌ప్రదేశ్‌లో భారీగా కురిసి వర్షంతో నోయిడాలో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. గంటలకొద్దీగా ట్రాఫిక్‌కు అంతరాయం కలగడంతో వాహనదారులు ఇబ్బందిపడ్డారు. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కురిసిన వర్షంతో ట్రాఫిక్ జామ్‌లు తప్పలేదు. అసోంలో వరదలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. బ్రహ్మపుత్ర నది ధాటికి రాష్ట్రమంతా అతలాకుతలం అయ్యింది. 20 రోజులుగా అస్సోంను వరదలు ముంచెత్తుతున్నాయి. కజిరంగా నేషనల్ పార్క్‌లోని జంతువులు కూడా కొన్ని ఈ వరదనీటిలో కొట్టుకుపోయాయి. మరికొన్ని జంతువులు సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నాయి. ఇదిలా ఉంటే బీహార్‌లోనూ వరదల ప్రభావం తగ్గలేదు. ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ సహాయ చర్యలకోసం కేందప్రభుత్వం నుంచి సాయాన్ని కోరారు. గత రెండువారాల్లో 82లక్షల మందిని పునరావాస కేంద్రాలకు ప్రభుత్వం తరలించింది. వరద ప్రభావిత కుటుంబాలకు కనీస అవసరాలు తీరేందుకు ఆరువేల రూపాయలను తక్షణసాయం కింద నితీష్ కుమార్ ప్రకటించారు.
వరదల్లో చిక్కుకున్న రైలు..
మరోవైపు ముంబైని వర్షాలు మరోసారి ముంచెత్తాయి. రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ఎటు చూసినా వర్షపునీరే కనిపిస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ముంబై విమానాశ్రయంలోకి నీరు చేరడంతో పలు విమానాల రాకపోకలను నియంత్రించారు. ముంబై, థానే, రాయ్‌గడ్ ఏరియాలో భారీ వర్షాలు కురవనున్నట్టు వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో పురాతన భవనాలు ఉన్న ప్రాంతాల్లోని వారు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. సరిగ్గా పద్నాలుగేళ్ల క్రితం ముంబై… వర్షాల ధాటికి అతలాకుతలమైంది. ఆ క్షణాలు గుర్తుకు తెచ్చుకుని నగరవాసులు ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు శనివారం భారీ వర్షాలకు వరద పోటెత్తడంతో బాదల్ పూర్ , వాంగని మహాలక్ష్మీ ఎక్స్ ప్రెస్ వరద నీటిలో చిక్కుకుంది. రైలులో సుమారు 2వేల మంది ఉన్నారు. దీంతో ప్రయాణీకులు బిక్కుబిక్కుమంటు కాలంగడిపారు. రెండు అడుగులమేర వరద నీరు రైల్వే ట్రాక్‌పై చేరింది. తెల్లవారుజాము నుండి రైల్లో ప్రయాణీకులు అవస్థలు పడ్డారు. ప్రయాణీకుల్లో చిన్నారులు కూడా ఉండడంతో భయాందోళనలు నెలకొన్నాయి. రైల్వే పోలీసులు, సిటీ పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందం రంగంలోకి దిగి సహాయక చర్యలు
చేపట్టారు. రైలులో ఉన్న వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు. బోట్ల సహాయంతో వీరిని సురక్షిత ప్లేస్‌కు తరలించారు. ఇదిలాఉ ంటే ఈ మార్గం నుంచి వెళ్లే ఇతర రైళ్లను అధికారులు దారి మళ్లించారు. శుక్రవారం రాత్రి నుంచి కుండపోతగా కురుస్తున్న నగరంలోని చాలా ప్రాంతాలు జలమలమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో 18 సెంటివిూటర్ల వర్షం పడింది. చాలా ప్రాంతాల్లో 15 సెంటివిూటర్ల వాన కురిసింది. గాంధీ మార్కెట్, సైన్ ఏరియాను వరద ముంచెత్తింది. మతుంగా, పతాలిపడ, శాంతా క్రజ్ , వసాయి, బాదల్ పూర్, అంబర్ నాథ్, కల్యాణ్ , కుర్లా, థానే ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురిసింది. 2005 నాటి వరద పరిస్థితులు వచ్చేలా కనిపిస్తున్నాయి. 2005 జూలై 26న 24 గంటల్లోనే ముంబైలో 94 సెంటివిూటర్ల వర్షం కురిసింది. ఇవాళ కూడా కుండపోత వాన కురిసే అవకాశం ఉందన్న ఐఎండీ హెచ్చరికలతో.. ముంబై వాసులు భయంతో వణికిపోతున్నారు.
చెరువులను తలపిస్తున్న రహదారులు..
వరద నీటితో ముంబైలోని రోడ్లన్ని చెరువులుగా మారాయి. రవాణాకు తీవ్ర అంతరాయం కల్గుతోంది. ప్రధాన రోడ్లలో భారీగా ట్రాఫిక్ జామైంది. వరద పోటెత్తడంతో కుర్లా- థానే మార్గంలో నడిచే పలు రైళ్లను ముందు జాగ్రత్త చర్యగా రద్దుచేశారు సెంట్రల్ రైల్వే అధికారులు. ఏడు విమాన సర్వీసులను క్యాన్సిల్ చేశారు. మరికొన్ని విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. వాటర్ లాగింగ్ ప్రాంతాల్లో బీఎంసీ అదనపు సిబ్బందిని మోహరించింది. వరద బీభత్సం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించారు. మహారాష్ట్రలోని రాయ్ గఢ్, రత్నగిరి, సింధూదుర్గ్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కరువుతో అల్లాడుతున్న మరట్వాడా, నాందేడ్ ప్రాంతాల్లోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.