కూర ‘గాయాల’తో విషతుల్యం!?

రంగుల కూరగాయల వెనక రసాయనాలు 
ఎన్‌ఈఈఆర్‌ఐ పరిశోధన సర్వేలో వెల్లడైన భయంకర నిజాలు 

  • -దేశ రాజధాని మార్కెట్లో విషపూరిత కూరగాయలు 
  • -యమునా నది పరీవాహక ప్రాంతాలో పండిస్తున్న కూరలు 
  • -ఆందోళనకర స్థితిలో లెెడ్‌ పరిణామం 
  • -మూత్రపిండాలు, ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం 
  • -మెదడు సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం 
  • -చిన్నారులకు మానసిక సంబంధిత రుగ్మతలు 
  • -దేశవ్యాప్తంగా కలుషిత జలాలతో పండిస్తున్న కూరలు 
  • -ఎక్కువ రోజులు నిలవ ఉండేందుకు అక్రమ పద్ధతులు
  • -అధిక దిగుబడుల కోసం క్రిమిసంహారక ఎరువులు 
  • -సహజగుణం కోల్పోతున్న కూరగాయలు, పండ్లు 
  • -రోగాలబారిన పడుతున్న జనాలు 
  • -దేశవ్యాప్తంగా ప్రమాదకర స్థాయిలో జలకాలుష్యం 

(నండూరి రవిశంకర్‌-జ్యోతి న్యూస్‌) 

సాధారణంగా కూరగాయల్లో విటమిన్లు, ప్రోటీన్ల లాంటి పోషక పదార్థాలు ఉంటాయి. కానీ, ఢిల్లీ మార్కెట్లలో అమ్ముతున్న కూరగాయల్లో మాత్రం విష పదార్థాలు ఉంటున్నాయట. ఎవరో కుట్ర చేసి అందులో ఎక్కించినవి కాదు. మానవ తప్పిదాల కారణంగా నది కలుషితమై అది కాస్త మనం తినే కూరగాయల్లోకి పాకుతోంది. వివరాల్లోకి వెళితే.. నేషనల్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీరింగ్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ చేసిన ఓ పరిశోధనలో భయంకరమైన నిజాలు వెలుగుచూశాయి. యమునా నది పరీవాహక ప్రాంతాల్లో పండిస్తున్న కూరగాయల్లో భారీ స్థాయిలో ‘లెడ్‌’ పరిమాణం ఉందని నిర్దరించారు. వీటిని దీర్ఘకాలికంగా తీసుకోవడం వల్ల క్యాన్సర్‌, అవయవాలు దెబ్బతినడం, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, మెదడు సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉందని తేల్చారు. చిన్నపిల్లల్లో మానసిక సమస్యలు సైతం తలెత్తే ముప్పు ఉంది. 
పంటపొలాలు, వ్యవసాయ క్షేత్రాల నుంచి తెచ్చిన ఈ కూరగాయలను దిల్లీలోని ప్రధాన మండీలకు తరలిస్తున్నారు. అక్కడి నుంచి వారాంతపు సంతలు, వీధుల్లోని చిన్న చిన్న దుకాణాలకు వీటిని సరఫరా చేస్తున్నారు. దీంతో ఢిల్లీ వాసుల్లో ఎక్కవ శాతం జనాభా వీటినే వినియోగిస్తున్నారు. ఆయా మార్కెట్ల నుంచి సేకరించిన కూరగాయలను పరీక్షించి చూడగా.. కొత్తిమీర, పాలకూరల్లో సాధారణ స్థాయిని మించి లెడ్‌ ఉన్నట్లు గుర్తించారు. కూరగాయల్లో లెడ్‌ పరిమాణం ఒక కిలోకి 2.5మి.గ్రా ఉండాల్సి ఉండగా.. అక్కడ మాత్రం 2.8మి.గ్రా నుంచి గరిష్ఠంగా 13.8మి.గ్రా వరకు ఉందట. లెడ్‌ మినహా నికెల్‌, క్యాడ్మియం, మెర్‌క్యురీ మాత్రం సాధారణ స్థాయిలోనే ఉన్నట్లు పరిశోధనల్లో తేలింది. బ్యాటరీలు, పెయింట్‌, పాలిథీన్‌, ఆటోమొబైల్‌ విడిభాగాల తయారీ లాంటి పరిశ్రమల వల్లే నదుల్లో లెడ్‌ పరిమాణం పెరుగుతుండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. యమునా నది పరీవాహక ప్రాంతం కేవలం రెండు శాతం మాత్రమే ఢిల్లీ పరిధిలో ఉన్నా.. 70శాతం కలుషితం అక్కడే జరుగుతోందని అధికారులు తెలిపారు. 
ప్రస్తుతం ప్రజలు విషాన్నే ఆహారంగా తీసుకునే పరిస్థితి దాపురించింది. ఆకు కూరలు, కూరగాయలు, పండ్లు ఇలా అన్నింటిపై అధిక దిగుబడుల కోసం ఎథేచ్ఛగా పురుగు మందులను వాడుతోండటంతో వాటిని తీసుకునే వారు పలు వ్యాధుల భారిన పడ్తున్నారు. సేంద్రీయ వ్యవసాయంపై రైతులు దష్టి సారిస్తూ, పురుగు మందుల వాడకాన్ని తగ్గించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టి ప్రజారోగ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఎంత్తైన ఉంది. 
మార్కెట్‌లో ఆకుకూరలు, బెండకాయ, టమాటా, మిర్చి, క్యాలిఫ్లవర్‌, వంకాయ ఇలా అన్ని రకాల కూరగాయలు కొనుగోలు చేసే ముందు ఓసారి వాసన చూస్తే వాటిపై పిచికారి చేసిన రసాయనాల అవశేషాలు గుప్పుమంటాయి. వీటిని కంటితో గుర్తించలేరు.. వాటిని నీటిలో కడగకుండా వంట చేశారా… ఇక అంతే.. ఆహారం కాస్తా విషతుల్యంగా మారుతుంది. ప్రస్తుతం కూరగాయలు పండించే రైతుల దిగుబడుల కోసం ఏదేచ్ఛగా క్రిమి సంహార మందులను వాడుతున్నారు. 
ప్రస్తుతం కూరగాయలు, పండ్లను పండించడం కోసం ఎంతటి విష తుల్యమైనా వ్యాపారులు, రైతులు వాడేస్తున్నారు.. వారికి ప్రజారోగ్యం కంటే ధనార్జనే అధికంగా మారింది. ఇష్టారాజ్యంగా పురుగు మందులను వాడేస్తూ కూరగాయలను, పండ్లను పండిస్తున్నారు. తక్కువ సమయంలో వాటిని మార్కెట్‌కు తరలిస్తే డబ్బులను ఆర్జిస్తూ.. ప్రజల ఆరోగ్యానికి తూట్లు పొడుస్తున్నారు.. డబ్బులు ఇచ్చి ఆరోగ్యాన్ని నాశనం చేసుకునేలా వ్యాపారులు పురుగు మందులతో కూరగాయలు, పండ్ల వ్యాపారం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు, పాలకులు పట్టించుకోవడం లేదు. 
ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రతి మనిషి రోజుకు 280 గ్రాముల కూరగాయలు ఆహారంగా తీసుకోవాలి. ప్రస్తుతం 120 గ్రాముల నుంచి 140 గ్రాముల వరకు తీసుకుంటున్నారు. పల్లెలలో 50 శాతం కూడా కూరగాయలు ఉత్పత్తి కావడం లేదు. కూరగాయల ఉత్పత్తుల అత్యవసరం దృష్ట్యా సాగవుతున్న వాటిని రక్షించుకునేందుకు.. దిగుబడిని పెంచుకునేందుకు రైతులు విచక్షణా రహితంగా పురుగు మందులను వినియోగిస్తున్నారు. పరిమితికి మించి పురుగు మందుల అవశేషాలు వాడటం వలన భయంకరమైన వ్యాధులు వచ్చే ఆవకాశాలు ఉన్నాయి. జిల్లాలో సేంద్రియ సాగు విధానం సక్రమంగా ఆమలు కాకపోవడం వల్ల ప్రతి ఏటా రూ.కోట్లలో పురుగుల మందు వ్యాపారం కొనసాగుతోంది. దీనిలో సింహభాగం కూరగాయల తెగుళ్ల నివారణకే వినియోగిస్తున్నారు. దీంతో జిల్లా వాసులు కూరగాయలను కొనడం వలన సరికొత్త ఆరోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటున్నారు. 
పండ్లు, కూరగాయల్లో విషతుల్యాలు 
తాజా కూరగాయలతో పాటు పండ్లలోనూ పురుగు మందుల అవశేషాలు ఉంటున్నాయి. వీటిని ఆహారం ద్వారా తీసుకున్నవారు నాడీ సంబంధ వ్యాధులు, క్యాన్సర్‌ వంటి వ్యాధుల బారిన ప్రజలు పడుతున్నారని వైద్యులు, శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. పాలకూర, గోంగూర, తోటకూర, మెంతి, బెండ, టమాట, వంకాయ, క్యాబేజీ, క్యాలిఫ్లవర్‌ పంటలకు తెగుళ్ల బెడద ఎక్కువగా ఉంటుంది. దీంతో విషపూరితమైన రసాయనాలను పిచికారీ చేసి రోజు విడిచి రోజు ఆకు కూరలు, కూరగాయలను మార్కె ట్‌కు తరలిస్తు న్నారు. వాటిని తినడంతో తరచూ దగ్గు, జలుబు, తలనొప్పి, నీరసం వంటి లక్షణాలు పురుగు మందులు వినియోగించిన ఆకు కూరలు, కూరగాయలు, పండ్లు తినడం వల్ల వస్తున్నట్టు వైద్యులు పేర్కొంటున్నారు. నిగనిగలాడే కూరగాయలు, పండ్లలోనూ విషతుల్యాలు ఉంటున్నాయంటున్నారు. వాటిని ఇష్టంగా కొని ఆరోగ్యపరంగా కష్టాన్ని తెచ్చుకునే పరిస్థితులు నెలకొన్నాయి. ఇందుకు ప్రధాన కారణం ఈ పంటలు సాగు చేసే రైతులు పురుగు మందులు వాడటమేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. 
చైతన్యం ఏదీ.. 
రైతులు పండించే కూరగాయ పంటలకు సలహాలు, సూచనలు, సస్య రక్షణ చర్యలపై అవగాహన కల్పించే అధికారులు పూర్తిస్థాయిలో లేరు. దీంతో వారు పంటలకు ఆశిస్తున్న తెగుళ్లు, చీడ పీడల నివారణకు, అధిక దిగుబడులను పెంచుకునేందుకు రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడుతున్నారు. పెస్టిసైడ్‌ దుకాణాల వారు ఇచ్చిందే వాడటం తప్ప వారికి వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు సస్య రక్షణ చర్యలపై అవగాహన కల్పిస్తున్న దాఖలాలు అంతంత మాత్రమే. అధికారులు రైతులను చైతన్య పరిచి ప్రత్యామ్నాయ విధానాలతో పంటలను సాగు చేయించాల్సిన బాధ్యత అధికార యంత్రంగాంపై ఉంది. ఇందుకు అవసరమైన ప్రోత్సాహాన్ని ప్రభుత్వం అందించాలి. అప్పుడే ఈ విధానంలో మార్పు వస్తుంది. 
కోసే ముందు పిచికారి చేయొద్దు 
కూరగాయల మొక్కలపై పురుగు కనిపించినా, తెగులు కనిపించినా హక్టాకొనజోల్‌, మోనోక్రోటోఫాస్‌, ఇధియాన్‌, సైపర్‌మిత్రిన్‌, క్లోరిఫైరీఫాస్‌, ఎసిఫేట్‌ వంటి మందులను రైతులు పిచికారి చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల పురుగు మందు అవశేషాలు కూరగాయలపై ఉంటాయి. పంట కోసే పదిరోజుల ముందు ఈ మందులను చల్లకూడదు. మొక్క మెత్తదనం కోసం, కాయసైజు పెరగడం కోసం సేఫ్‌, కాల్షియం, నైట్రోజన్‌, మెగ్నీషియం, బోరాన్‌ ఉండే సూక్ష్మ పోషక ఎరువులను వాడతారు. వీటి ప్రభావం తక్కువ్కెనా వారం పాటు రసాయన అవశేషాలు కూరగాయలపై ఉంటాయి. వ్యవసాయం, ఉద్యాన శాఖ అధికారుల సూచనల కన్నా పురుగుమందుల దుకాణాల డీలర్లు చెప్పే మందులకు రైతులు అధిక ప్రాధాన్యం ఇస్తుండటం విచారకరం. 
అవగాహన శూన్యం 
సేంద్రియ విధానంలో కూరగాయల సాగుపై రైతులకు అవగాహన కల్పిస్తున్నా వారు పెద్దగా దష్టి సారించటం లేదని అధికారులు వాపోతున్నారు. గ్రామాల్లో రైతులకు చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదని వారు పేర్కొంటున్నారు. పురుగు మందులు పిచికారీ చేస్తే వాటి ప్రభావం 10 నుంచి 15 రోజుల వరకు కూరగాయలపై ఉంటుంది. ఈ విషయంలో కొనుగోలు దారులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. 
వ్యాధులు వచ్చే అవకాశం 
రసాయన ఎరువులు, పురుగు మందులు పిచికారీ చేసిన కూరగాయలు తినడం వల్ల ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. విషతుల్యమైన కూరల వల్ల నాడివ్యవస్థ, నరాల వ్యవస్థ దెబ్బతింటుంది.. కాలేయం పనితీరు పాడయ్యే అవకాశం ఉంటుంది. మూర్చ వచ్చే ఆవకాశం ఉంటుంది. రోగ నిరోధక శక్తి తగ్గిపోయి చిన్నచిన్న వ్యాధులకు కూడా శరీరం తట్టుకోదు. తరచూ జలుబు, తలనొప్పి వస్తుంది. నీరసంగా ఉంటుంది. కొన్ని మందుల వల్ల క్యాన్సర్‌ వంటివి కూడా సోకే ప్రమాదం ఉంది. ఇలాంటి వ్యాధులనుంచి బయట పడేందుకు ఇంట్లో కూరలు వండే సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. 
ఈ జాగ్రత్తలు పాటించాలి 
– కూరగాయలను వండే ముందు నాలుగైదుసార్లు మంచినీటితో కడగాలి. 
– ఉప్పు ద్రావణంలో కొద్ది నిమిషాలు ఉంచడం వల్ల క్రిములు పోతాయి. తర్వాత మళ్లీ మంచినీటితో శుభ్రం చేయాలి. 
– అవకాశముంటే కూరగాయలు, పండ్లు పైపొరను తొలగించాలి. పై పొరను తొలగించాలనుకుంటే ముందుగా రసాయన అవశేషాలు పోగొట్టడానికి నీటితో శుభ్రంగా కడగాలి.