రాష్ట్ర ప్రయోజనాలకోసమే తెలంగాణతో సఖ్యత

  • తెలుగువారంతా కలిసికట్టుగా ఉండాలి
  • కేసీఆర్‌ మంచివారు, తెలంగాణతో సఖ్యతగా ఉంటేనే మేలు
  • కేసీఆర్‌ సహకారంపై హర్షించాల్సింది పోయి వక్రీకరిస్తున్నారు
  • ఐదేళ్ల తర్వాత మనపరిస్థితి దారుణంగా ఉంటుంది
  • కాళేశ్వరం కడుతుంటే ఇక్కడ చంద్రబాబు ఉండి ఏం చేయగలిగారు
  • మనది దిగువ రాష్ట్రంగా ఉన్నాం
  • ఎగువ రాష్ట్రం వదిలితేనే మనకు నీళ్లు వస్తాయి
  • కరవుతో జిల్లాలు అల్లాడుతున్నాయి
  • రాజకీయాలే కావాలి అన్నట్లుగా టీడీపీ వ్యవహరిస్తుంది
  • ప్రతిపక్షం సలహాలు, సూచనలు స్వీకరిస్తాం
  • గోదావరి జలాలపై అసెంబ్లీలో చర్చలో సీఎం వైఎస్‌ జగన్‌
  • కేసీఆర్‌ మంచివారు అనడంతో అభ్యంతరం తెలిపిన టీడీపీ సభ్యులు
  • సభలో ఇరు పక్షాల మధ్య వాగ్వివాదం
  • నలుగురు టీడీపీ సభ్యులను ఒకరోజు సస్పెండ్‌ చేసిన స్పీకర్‌
  • సభ్యుల సస్పెండ్‌ను నిరసిస్తూ వాకౌంట్‌ చేసిన చంద్రబాబు

అమరావతి, జులై25: రాష్ట్ర ప్రయోజనాల కోసమే తెలంగాణతో సఖ్యతగా ఉంటున్నామని, తెలుగువారంతా కలిసికట్టుగా ఉండాలని, అలా ఉంటే ఇరు రాష్ట్రాలకు మేలు జరుగుతుందని ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి అన్నారు. గురువారం ఏపీ అసెంబ్లీలో గోదావరి జలాల వినియోగంపై చర్చ సందర్భంగా జగన్‌ మాట్లాడారు. కేవలం 12శాతం గోదావరి నీళ్లు మాత్రమే ఏపీలోకి వస్తున్నాయని స్పష్టం చేశారు.
కేవలం ఐదు టీఎంసీలు మాత్రమే మన ఆధీనంలో ఉంటాయని తెలిపారు. తెలంగాణలో కేసీఆర్‌ కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ప్రారంభించి పూర్తి చేశారన్నారు. ప్రాజెక్ట్‌ కడుతుంటే ఇక్కడ చంద్రబాబు ఉండి ఏం చేయగలిగారని నిలదీశారు. రాష్ట్రానికి మంచి జరగాలనే ఆరాటంతోనే తాము నిర్ణయాలు తీసుకుంటున్నామని, మన రాష్ట్రానికి మంచి జరగదు అనుకుంటే.. అలాంటి నిర్ణయాన్ని కచ్చితంగా తీసుకుబోమని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. గోదావరి జలాలను రోజుకు నాలుగు టీఎంసీల చొప్పున 120రోజులపాటు శ్రీశైలం, నాగార్జున సాగర్‌ ప్రాజెక్టులకు తరలించడం ద్వారా ఆంధప్రదేశ్‌ రాష్ట్రానికి 480 టీఎంసీల నీళ్లు అందుబాటులోకి వస్తాయని, దీనివల్ల ఆంధప్రదేశ్‌ రైతులూ, ప్రజలూ బాగుపడతారని జగన్‌ అన్నారు. సాగునీటి, తాగునీటి ఇబ్బందులు తీరుతాయని వివరించారు. నది జలాల పంపిణీ విషయంలో నీళ్లురావు అనుకుంటే ఇద్దరు సీఎంలు ఎందుకు ముందడుగు వేస్తారని ఆయన అన్నారు. ఈ విషయంలో ప్రతిపక్షం ఇచ్చిన సలహాలు కూడా తీసుకుంటామని చెప్పారు. భావితరాల కోసం ఆలోచించే తాము అవసరమైన నిర్ణయం తీసుకుంటున్నామని తెలిపారు. గోదావరి నదిలో నాలుగు పాయలుంటే.. అందులో మూడు పాయలు తెలంగాణను దాటుకొని.. ఆంధ్రలోకి ప్రవేశిస్తాయని సీఎం వైఎస్‌ జగన్‌ తెలిపారు. గోదావరి నదికి చెందిన ఒక పాయ నాసిక్‌ నుంచి తెలంగాణలోకి ప్రవేశిస్తుందని, ఈ పాయ ద్వారా గోదావరి మొత్తం ప్రవాహంలో 22.23శాతం తెలంగాణకు వస్తాయని వివరించారు. అయితే, ఎగువన మహారాష్ట్ర, కర్ణాటక
చిన్న, చిన్న డ్యాములు కట్టుకుంటూ పోతుండటంతో ఈ పాయ విూద ఆధారపడిన తెలంగాణలోని ఎస్సారెస్పీ ప్రాజెక్టుకు నీళ్లు రాని పరిస్థితి నెలకొందని జగన్‌ అన్నారు. ఈ ప్రాజెక్టు కోసం కాళేశ్వరం నుంచి రివర్స్‌ పద్ధతిలో నీళ్లు తరలించుకొని పోతున్నారని సీఎం వైఎస్‌ జగన్‌ వివరించారు.
గోదావరి నదిలోని రెండో పాయ ప్రాణహిత నది అని.. ఇది కూడా తెలంగాణలోకి ప్రవేశిస్తోందని వివరించారు. ఈ ప్రాణహిత సబ్‌ బేసిన్‌ ద్వారా గోదావరి మొత్తం ప్రవాహంలోని 35.46శాతం నీళ్లు వస్తాయని, గోదావరి పూర్తి నీటిలో దాదాపు 36శాతం ఈ పాయ నుంచే ప్రవహిస్తాయని వివరించారు. ఇక మూడో పాయ అయిన ఇంద్రావతి సబ్‌బేసిన్‌ కూడా తెలంగాణలోకే ప్రవేశిస్తుందని, అది మొత్తం ప్రవాహంలో దాదాపు 23శాతం ఉంటుందని వివరించారు. గోదావరి నదిలోని నాలుగు పాయల్లో మూడు పాయలు తెలంగాణను దాటిన తర్వాతే ఆంధప్రదేశ్‌లోకి వస్తాయని వివరించారు. ఇక, శబరి సబ్‌ బేసిన్‌ నుంచి మాత్రమే మనకు నేరుగా ఆంధప్రదేశ్‌లోకి నీళ్లు వస్తాయని, ఎగువన ఉన్న ఛత్తీస్‌గడ్‌, ఒడిశా విూదుగా వచ్చే ఈ పాయ.. గోదావరి మొత్తం ప్రవాహంలో కేవలం 12శాతం మాత్రమే ఉంటుందని జగన్‌ వివరించారు. ఒకవైపు పరిస్థితి ఇలా ఉంటే మరోవైపు కృష్ణా నది ఆయకట్టు పూర్తిగా ఎండమావి అయ్యే అవకాశం కనిపిస్తోందని జగన్‌ తెలిపారు. గత 47ఏళ్ల సగటు చూసుకుంటే కృష్ణా నుంచి శ్రీశైలానికి 1200 టీఎంసీల నీళ్లు వచ్చేవని, కానీ, గత పది సంవత్సరాల్లో చూసుకుంటే అది 600 టీఎంసీలకు పడిపోయిందని, ఇక, గత ఐదు సంవత్సరాలు చూసుకుంటే శ్రీశైలానికి కృష్ణా ప్రవాహం 400 టీఎంసీలకు పడిపోయిందని జగన్‌ గుర్తుచేశారు. ఇక, ఆల్మట్టి డ్యామ్‌ ఎత్తును 524 విూటర్లకు పెంచితే.. కర్ణాటక మరో 100కుపైగా టీఎంసీలను నిల్వ చేసుకోగలుగుతుందని, ఈ పరిస్థితుల్లో శ్రీశైలానికి 200 టీఎంసీల నీళ్లు కూడా వచ్చే పరిస్థితి ఉండదన్నారు. ఈ పరిస్థితుల్లో శ్రీశైలం ఎప్పుడు నిండుతుందని, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు నీళ్లు ఎప్పుడు వెళుతాయని, నాగార్జున సాగర్‌కు ఎప్పుడు వస్తాయని ప్రశ్నించారు. ఇది ఇది ఆలోచన చేసుకోవాలని, వాస్తవ పరిస్థితులను గమనించాలని సీఎం వైఎస్‌ జగన్‌ కోరారు. తెలుగు రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకొనే ధోరణిలో ఉండాలని, శ్రీశైలం, నాగార్జున సాగర్‌పై మన రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాలు ఆధారపడి ఉండగా.. తెలంగాణలోని నాలుగు జిల్లాలు ఈ ప్రాజెక్టులపై ఆధారపడ్డాయన్నారు. ఈ రెండు ప్రాజెక్టులు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి ఆస్తి అని పేర్కొన్నారు.
ఆందోళనకు దిగిన టీడీపీ సభ్యులు..
జగన్‌ ప్రసంగిస్తుండగా టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. కేసీఆర్‌ మంచివారు, ఆయనతో సంఖ్యతగా ఉంటే ఏపీకి మేలు జరుగుతుందని జగన్‌ అనడాన్ని తప్పుబట్టారు. జగన్‌ తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దీంతో టీడీపీ సభ్యుల తీరుపై జగన్‌ మండిపడ్డారు. రాష్ట్రానికి ఉపయోగపడే అంశాలపై చర్చజరుగుతుంటే టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగడం సిగ్గుచేటన్నారు. ఏపీకి న్యాయం జరుగుతుందంటే ఎవరితోనైనా సంఖ్యతగానే ఉంటామని, మన రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని జగన్‌ అన్నారు. ఈ సమయంలో అంబటి రాంబాబు మాట్లాడుతూ.. చంద్రబాబు అందరికంటే నేనే గొప్ప అన్నట్లు తనకు తానుగా ఊహించుకుంటారని, కేసీఆర్‌ మంచివారు, గొప్పవారు అనగానే ఆయనకు, టీడీపీ సభ్యులకు పౌరుషం వచ్చిందన్నారు. ఇప్పడు నేను చెబుతున్నానని చంద్రబాబు కంటే వందల రెట్లు కేసీఆర్‌ గొప్పవారని, ఆయన పరిపాలన అద్భుతమని, అందరిని కలుపుకొని పోయే వ్యక్తిత్వం ఆయన సొంతమన్నారు. అలాంటివి ఒక్క క్వాలిటీ కూడా చంద్రబాబులో లేదంటూ విమర్శించారు. దీంతో టీడీపీ సభ్యులు పోడియం వద్దకు వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. ఇరుపక్షాల మధ్య వాగ్వివాదంతో సభలో
గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో స్పీకర్‌ తమ్మినేని సీతారాం టీడీపీకి చెందిన నలుగురు సభ్యులను సస్పెండ్‌ చేశారు. సభా కార్యకలాపాలకు అడ్డుతగులుతున్నారనే కారణంతో తెదేపా ఎమ్మెల్యేలు బెందాళం అశోక్‌, వాసుపల్లి గణెళిశ్‌కుమార్‌, వెలగపూడి రామకృష్ణ బాబు, బాల వీరాంజనేయ స్వామిని సస్పెండ్‌ చేస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించారు. అయినా టీడీపీ సభ్యులు సభలో నుంచి వెళ్లకపోవటంతో మార్షల్స్‌తో బయటకు గెంటివేయించారు. అనంతరం చంద్రబాబు నాయుడు, టీడీపీ సభ్యులుసైతం స్పీకర్‌ తీరును నిరసిస్తూ, సభ్యుల సస్పెండ్‌ను వ్యతిరేఖిస్తూ అసెంబ్లీ నుంచి వాకౌట్‌ చేశారు.