వైసీపీ పాలనలో..

ప్రజలకు మేలుకంటే కీడే జరుగుతుంది

  • – పెనంపై నుంచి పొయ్యిలో పడినట్లుంది 
  • – మరో 25ఏళ్లు కేంద్రంలో బీజేపీదే అధికారం
  •  – రాష్ట్రంలో బీజేపీతో ప్రజలకు మేలు జరుగుతుంది 
  • – బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ 

కాకినాడ, జులై24 : వైసీపీ పాలనలో ప్రజలకు మేలుకంటే కీడే జరుగుతుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేటలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో రాంమాధవ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలకు సభ్యత్వాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రాంమాధవ్‌ మాట్లాడుతూ.. ఆదిలోనే వైసీపీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. రాష్ట్రంలో రెండో ప్రాంతీయ పార్టీ అయిన వైసీపీ మేలు చేస్తుందని ప్రజలు అధికారం ఇచ్చారని, కానీ అధికార పార్టీ తప్పటడుగుల వల్ల మేలు కంటే.. కీడే ఎక్కువ జరుగుతుందన్న భయం ప్రజల్లో కనపడుతోందని రాంమాధవ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. పెనం విూద నుంచి పొయ్యిలో పడినట్టుగా రాష్ట్ర ప్రజల పరిస్థితి ఉందని తెలిపారు. ఏపీ ప్రజలకు మేలు జరగాలంటే బీజేపీ అధికారంలోకి రావాలన్నారు. మరో 25 ఏళ్ల పాటు కేంద్రంలో బీజేపీదే అధికారమని రాంమాధవ్‌ పేర్కొన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీలోనూ, తెలంగాణలోనూ పలు పార్టీల నుంచి బీజేపీలో చేరేందుకు నేతలు ఆసక్తిచూపుతున్నారని అన్నారు. ఏపీలో ఇప్పటికే పలువురు టచ్‌లో ఉన్నారని, ఆషాడం పూర్తవ్వగానే వారు పార్టీలో చేరే అవకాశం ఉందని అన్నారు. ఏపీలో వైసీపీకి ప్రత్యామ్నాయం బీజేపీనే అని, కాంగ్రెస్‌ పనైపోయిందని, ఇక టీడీపీ సతికలపడ్డ పార్టీ అన్నారు. కేంద్రంలో ప్రధాని నరేంద్రమోదీ పాలనతో ప్రజలంతా బీజేపీవైపు మొగ్గుచూపుతున్నారని రాంమాధవ్‌ ఆశాభావం వ్యక్తం చేశారు