మోదీ @ 50

మోదీ 50 రోజుల పాలనపై ప్రత్యేక ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌ 

నండూరి రవిశంకర్‌ (న్యూస్ ఎడిటర్ జ్యోతి డైలీ)

పాలనాపర సంస్కరణలు పక్కనబెడితే 50 రోజుల్లో అభివృద్ధి చూపించడం ఏ ప్రభుత్వానికీ సాధ్యం కాదు. అయితే విద్యాసంవత్సరంలో తొలి యూనిట్‌ టెస్ట్‌ లాంటి ఈ 50 రోజుల పాలనలో మోదీకి దేశవ్యాప్తంగా ఎలాంటి ఆదరణ ఉందో తెలుసుకునే ప్రయత్నం చేసింది ‘జ్యోతి’ ప్రతినిధి వర్గం. రెండోసారి అఖండ మెజారిటీని సొంతం చేసుకున్న మోదీ ఉత్తరాదిలో తనకున్న హవాలో కేవలం 5 శాతం మాత్రమే తగ్గించుకున్నారని సర్వేలో తేలింది. అయితే దక్షిణాదిలో మాత్రం గతం కన్నా కాస్త మెరుగైన స్థితిలో మాత్రమే ఉంది పార్టీ పరిస్థితి. కేవలం తెలంగాణలో మాత్రం 5 నుంచి 10 శాతం బలం పుంజుకోగా ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం అనూహ్యంగా 20 శాతం బలం పెంచుకోగలిగింది బీజేపీ. అక్కడ తెలుగుదేశం పార్టీకి చెందిన దాదాపు 60 శాతం మంది బీజేపీ వైపు మొగ్గు చూపిస్తుండగా తెలంగాణలో మాత్రం కాంగ్రెస్‌ నుంచి వలసదారులు బీజేపీ పంచన చేరుతున్నారు. ఇక కేరళలో బీజేపీ ఏ మాత్రం బలం పుంజుకోలేదు. కర్ణాటకలో కూడా అధికారం కోసం పాకులాడితే బీజేపీకి వచ్చే ఎన్నికలలో భంగపాటు తప్పదంటున్నారు. కాగా 2020లో బీహార్‌,ఢిల్లీ,పాండిచ్చేరి,2021లో అసోం, కేరళ,తమిళనాడు,పశ్చిమ బెంగాల్‌ ఎన్నికలు జరగాల్సి ఉంది. అలాగే 2022లో గోవా,హిమాచల్‌,ఉత్తరప్రదేశ్‌,ఉత్తరాఖండ్‌, గుజరాత్‌,మణిపూర్‌, నాగాలాండ్‌,పంజాబ్‌ ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. ఈ ఎన్నికలలో వచ్చే ఫలితాలు రాబోయే మోదీ పాలన ప్రభావాన్ని బట్టే ఉంటాయన్నది జగద్విదితం. కాబట్టి రాబోయే మూడేళ్లు మోదీకి అగ్నిపరీక్ష అని చెప్పవచ్చు. 

  • -రైతులందరికీ రూ.6వేల పెట్టుబడి సాయం 
  • -పంటలకు కనీస మద్దతు ధరలు రెండింతలు 
  • -10 వేలకుపైగా ఫార్మర్స్‌ ఆర్గనైజేషన్ల ఏర్పాటు 
  • -అసంఘటిత రంగ కార్మిక సంక్షేమ పథకాలు 
  • -స్టార్టప్‌ల కోసం ప్రత్యేక టీవీ చానెల్‌ 
  • – జమ్మూకాశ్మీర్‌లో శాంతిభద్రతలకు ప్రత్యేక చర్యలు 
  • -అమరుల కుటుంబాలకు స్కాలర్‌షిప్‌ పెంపు 
  • -షాప్‌కీపర్స్‌కు పెన్షన్‌ సదుపాయం 
  • -హోమ్‌ లోన్స్‌ వడ్డీ తగ్గింపు, జీఎస్‌టీ సరళీకరణ 
  • -పోక్సో చట్టానికి సవరణలు 
  • -మేనిఫెస్టో హామీల దిశగా అడుగులు 

న్యూఢిల్లీ: బీజేపీ నేతత్వంలోని ఎన్డీయే రెండోసారి అధికారంలోకి వచ్చి జులై 20 నాటికి 50 రోజులు పూర్తయింది. అఖండ విజయాన్ని సొంత చేసుకున్న భాజపా తొలి యాభై రోజుల్లో వేసిన అడుగులను వివరిస్తూ సోమవారం ఓ రిపోర్టు కార్డు విడుదల చేసింది. ఈ సందర్భంగా కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు అభివద్ధిని పరుగులు పెట్టించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. సంస్కరణలు, సంక్షేమ కార్యక్రమాల అమలు వేగం గత ఐదు సంవత్సరాలతో పోలిస్తే పెరిగిందన్నారు. ఐదు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ కల కాదని..దాన్ని సాధించడం కోసం ఇప్పటికే కార్యాచరణ రూపొందించామని వివరించారు. మోదీ ప్రభుత్వం ఎంత సమర్థంగా పనిచేస్తుందో తొలి 50 రోజుల పాలనలోనే నిరూపితమైందన్నారు. సామాజిక న్యాయం, మౌలిక, విద్యా రంగాల్లో ఎన్డీయే ప్రభుత్వం ఇప్పటికే చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకుందని జావడేకర్‌ అన్నారు. రైతులు, వ్యాపారులు, నిరుద్యోగులు, పేద మధ్యతరగతితో పాటు సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమం కోసం చర్యలు చేపట్టామన్నారు. అంతర్జాతీయ వేదికలపై ప్రధాని హాజరు.. ప్రపంచ రాజకీయాలపై భారత్‌ ప్రభావాన్ని స్పష్టం చేస్తోందన్నారు. రోడ్డు, రైలు, విమాన మార్గాలతో పాటు ఇతర మౌలికవసతులపై దాదాపు రూ.100 లక్షల పెట్టుబడులు పెట్టనున్నామన్నారు. అలాగే ప్రత్యేక జలశక్తి మంత్రిత్వ శాఖ, 2024నాటి ప్రతి ఇంటినీ నల్లానీరు లాంటి చరితాత్మక నిర్ణయాలతో మోదీ-2 ప్రభుత్వం దూసుకెళుతోందని జావడేకర్‌ అభిప్రాయపడ్డారు. 
ప్రపంచ దేశాల నుంచి పెట్టుబడులు ఆహ్వానిస్తున్నామని.. దీని వల్ల ఉద్యోగ కల్పనకు అవకాశాలు మెరుగవుతాయన్నారు. సబ్‌కా సాథ్‌, సభకా వికాస్‌, సబ్‌కా విశ్వాస్‌ నినాదంతో అన్ని వర్గాలకు న్యాయం చేయడమే లక్ష్యంగా 50 రోజుల పాలన సాగిందన్నారు. అలాగే రైతులందరికీ రూ.ఆరు వేల ఆర్థిక సాయం, కొన్ని పంటలకు కనీస మద్దతు ధరను పెంచడం వంటి కీలక నిర్ణయాలు ఈ 50 రోజుల్లోనే జరిగాయని గుర్తుచేశారు. రెండోసారి అధికారం చేపట్టిన మోదీ.. అమరులైన సైనికులు, పోలీసులు కుటుంబాల్లోని పిల్లలకు ఉపకారవేతనం కల్పిస్తూ తొలి నిర్ణయం తీసుకున్నారు. 303 సీట్ల అఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన మోదీ మే 30న ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. 
ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం రెండోసారి కేంద్రంలో పగ్గాలు చేపట్టిన తొలి 50 రోజుల్లోనే రానున్న ఐదేళ్ల కాలంలో దేశాన్ని ఐదు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే క్రమంలో వద్ధిని పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది. ప్రభుత్వ విధివిధానాల గురించి బాగా తెలిసిన ఇద్దరు వ్యక్తులు ఆర్థికాభివద్ధితోపాటు వివిధ అంశాల్లో అభివ ద్ధిపరంగా తీసుకునే చర్యలతోనే ఈ మార్పు సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోదీ సారథ్యంలోని బీజేపీ లోక్‌సభలో అత్యధికంగా 303 సీట్లను సాధించి మే 30న బాధ్యతలు చేపట్టింది. 1971 నుంచి ఇప్పటివరకు ఏ పార్టీ కూడా వరుసగా రెండోసారి కేంద్రంలో అధికార పగ్గాలను చేపట్టిన దాఖలాలు లేవు. ఈ ఘనతను బీజేపీ సొంతం చేసుకుంది. బీజేపీ తన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలకు అనుగుణంగా ఇపుడు ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా రైతులు, చిన్నతరహా వ్యాపారులు, అసంఘటిత రంగంలోని కార్మికులకు పెన్షన్‌ పథకంతోపాటు రైతులకు ఇంతవరకు అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్‌ పథకాన్ని మళ్లీ పొడిగించడం, జల్‌ శక్తి మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడం వంటి పథకాలతో ముందుకు సాగుతోందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అధికారంలోకి వచ్చిన కొద్దిరోజులకే బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చేందుకు వీలుగా ఇటీవల ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌లో తగిన కేటాయింపులు జరిపింది. 
ముఖ్యంగా రానున్న ఐదేళ్ల కాలంలో దేశ ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్‌ డాలర్లుగా తీర్చిదిద్దే క్రమంతోపాటు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలని యోచిస్తోందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గత నెలలో పార్లమెంటులో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌లో ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ మూడు ట్రిలియన్‌ డాలర్లకు పెరుగుతుందని, తద్వారా ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన ఆరవ దేశంగా ఆవిర్భవించనుందని తెలిపారు. అదేవిధంగా నిర్మాణాత్మక సంస్కరణలను అమలు చేయడం ద్వారా వచ్చే ఐదేళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థను ఐదు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా భారత్‌ను తీర్చిదిద్దుతామని ఆమె స్పష్టం చేశారు. 
గల్ఫ్‌తో సంబంధాలు 
తొలి ప్రధానమంత్రి జవహర్‌ లాల్‌ నెహ్రూ మొదలు మన్మోహాన్‌ సింగ్‌ వరకు ప్రతి ప్రధాని కూడా గల్ఫ్‌ దేశాలతో సంబంధాలు నెరపడంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించే వారు. తన పూర్వ ప్రధానమంత్రులకు భిన్నంగా నరేంద్ర మోదీ, గల్ఫ్‌ దేశాల పాలక రాజకుటుంబాలతో తానే నేరుగా సంప్రదింపులు జరపడానికి శ్రీకారం చుట్టారు. గల్ఫ్‌లో ఆబుదాబి, సౌదీ అరేబియాలు చాలా ముఖ్యమైనవి. ఆబుధాబిలో రాజు శేఖ్‌ ఖలీఫాకు బదులుగా ఆయన సోదరుడు యువరాజు శేఖ్‌ మోహమ్మద్‌ దైనందిన పాలనా వ్యవహారాలు చూస్తున్నారు. సౌదీలో రాజు సల్మాన్‌తో పాటు ఆయన కుమారుడు యువరాజు మోహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ రాజ్య వ్యవహారాలలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ ఇరువురు అరబ్‌ పాలకులతోను ప్రధాని మోదీకి వ్యక్తిగతంగా మంచి సంబంధాలున్నాయి. రాజకీయాల విషయానికి వస్తే, దుబాయి నుంచి టోక్యో వరకు సందర్శించిన ప్రతి దేశంలో ప్రవాసులతో మాట్లాడినప్పుడల్లా మోదీ వ్యక్తిగత ప్రతిష్ఠ పెంచుకోవడానికి, బీజేపీకి రాజకీయ ప్రయోజనాలు సమకూర్చేందుకు ప్రయత్నిస్తారనే విమర్శలు ఉన్నాయి. అయితే ఒక రాజకీయ నేతగా మోదీ అలా చేయడంలో తప్పేమీ లేదని చెప్పవచ్చు. 
వీటిలో అన్నింటికంటే కీలకమైనవి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు. ఈ ఏడాది అక్టోబరు, నవంబరు నెలల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. గతంలో శివసేన పొత్తుతో పార్టీ అధికారాన్ని సాధించింది. ఇటీవల లోక్‌ సభ ఎన్నికలకు ముందు బీజేపీపై శివసేన తరచూ ధ్వజమెత్తేది. ఇప్పుడు దూకుడు తగ్గించింది. వచ్చే ఎన్నికల్లో సొంతంగా మెజారిటీ సాధించే దిశగా బీజేపీ కసరత్తు చేస్తోంది. ఈ ప్రయత్నంలో విజయం సాధిస్తే పార్టీ ప్రతిష్ట మరింతగా పెరుగుతుంది. మహారాష్ట్ర తర్వాత హర్యానా, జార్ఖండ్‌, జమ్మూ కాశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. హర్యానా, జార్ఖండ్‌ రాష్ట్రాల్లో పార్టీ అధికారంలో ఉంది. ఈ రెండు రాష్ట్రాల్లో అధికారాన్ని నిలుపుకోవడంపై మోదీ దష్టి పెట్టాల్సి ఉంది. అన్నింటికన్నా కీలకమైనవి కశ్మీర్‌ ఎన్నికలు. ఈ సరిహద్దు రాష్ట్రంపై పార్టీ పూర్తిగా దష్టి కేంద్రీకరించింది. ఇక్కడ విజయం సాధిస్తే మోదీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. కశ్మీర్‌లో ఈ దఫా ఎలాగైనా అధికారంలోకి రావాలని కమలం పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా ఇటీవల పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా కశ్మీర్‌ను సందర్శించారు. క్షేత్రస్థాయి పరిస్థితులను అధ్యయనం చేశాక ఓ నిర్ణయానికి వచ్చారు. జమ్మూ, లడఖ్‌లో పట్టు కాపాడుకుంటూ, కాశ్మీర్‌ లోయలో ముస్లిమేతర ఓట్లతో కొన్ని సీట్లను గెలవవచ్చన్నది కమలం వ్యూహం. ఈ వ్యూహం విజయవంతమైతే అధికారానికి చేరువవుతారు.2020లో బీహార్‌,ఢిల్లీ, పాండిచ్చేరి,2021లో అసోం, కేరళ,తమిళనాడు,పశ్చిమ బెంగాల్‌ ఎన్నికలు జరగాల్సి ఉంది.జమిలి ఎన్నికలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే వీటి భవిష్యత్‌ ఏమిటని చర్చనీయాంశమవుతోంది. 2022లో గోవా,హిమాచల్‌, ఉత్తరప్రదేశ్‌,ఉత్తరాఖండ్‌, గుజరాత్‌,మణిపూర్‌, నాగాలాండ్‌,పంజాబ్‌ ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి 
ఇక పాలనావ్యవహారాల విషయానికి వస్తే, విదేశీ విధానంలో సున్నితమైన గల్ఫ్‌ దేశాలతో సహా అన్ని కీలక దేశాలతో దౌత్యనీతిలో ప్రధాని జాతీయ భద్రత సలహాదారు అజిత్‌ దోవల్‌ది కీలక పాత్ర. ఏ విదేశీ ప్రముఖునితో మోదీ మాట్లాడినా ఆయన ప్రక్కన ఉండేది దోవల్‌ మాత్రమే. అప్పుడప్పుడు కన్పించిన మరో వ్యక్తి ఎస్‌. జయశంకర్‌. ప్రధాని మోదీ ఆలోచనా విధానానికి దిశా నిర్దేశం చేసేది అజిత్‌ దోవల్‌ కాగా దాన్ని కార్యాచరణలోకి తెచ్చేది జయశంకర్‌. మోదీ రెండవ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత జయశంకర్‌ విదేశీ వ్యవహారాల మంత్రిగా నియమితులయినా గల్ఫ్‌ దేశాలకు సంబంధించి అజిత్‌ దోవల్‌ మాటే చెల్లుతుంది. జయశంకర్‌కు చైనా, అమెరికా, యూరోప్‌ దేశాలతో సంబంధాల విషయంలో స్పష్టమైన అవగాహన ఉంది. ఇరాన్‌పై ఆంక్షలు ఒక వైపు, చైనా హువాయి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగానికి వ్యతిరేకంగా అమెరికా ఒత్తిడి మరో వైపు ముంచుకొస్తున్న నేపథ్యంలో ఈ ఇద్దరు హేమహేమీల అనుభవం మోదీకి, తద్వారా భారత్‌కు అమితంగా లాభిస్తుందనడంలో సందేహం లేదు. పాకిస్థాన్‌తో కయ్యానికి విరుగుడుగా సార్కు ప్రత్యామ్నాయంగా బిమ్స్‌టెక్‌ సభ్యత్వ దేశాలను పటిష్ఠ పర్చటమనేది దోవల్‌, జయశంకర్‌ కలిసి తీసుకున్న నిర్ణయమే. ప్రధాని మోదీ రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలుత బిమ్స్‌టెక్‌ సభ్య దేశాలు మాల్దీవ్‌, శ్రీలంకల పర్యటనకు వెళ్ళడం ఎంతైనా ప్రాధాన్యం సంతరించుకున్నది. డొనాల్డ్‌ ట్రంప్‌ అమలు చేస్తున్న ఆంక్షల నేపథ్యంలో అమెరికాలోని లక్షలాదిమంది భారతీయుల మనుగడ, భారత్‌ ఇరుగు పొరుగున వ్యూహాత్మకంగా పెరుగుతున్న చైనా పెత్తనంతోపాటు ఉగ్రవాద ఉపద్రవం ఇప్పుడు విదేశీ వ్యవహారాల శాఖ ముందున్న సవాళ్ళు.