కొత్త పురపాలక చట్టంపై గవర్నర్ అభ్యంతరం
పలు అంశాలపై ప్రభుత్వానికి కొర్రీలు
గవర్నర్ సూచనలతో తాజాగా ప్రభుత్వం ఆర్డినెన్స్
హైదరాబాద్,జూలై23: తెలంగాణ నూతన పురపాలక చట్టానికి సంబంధించిన బిల్లులోని కొన్ని అంశాలపై గవర్నర్ నరసింహన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో బిల్లుకు ఆయన ఆమోదం లభించలేదు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశాలపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేయడంతో.. గవర్నర్ సూచించిన అంశాలతో ప్రభుత్వం తాజాగా ఆర్డినెన్స్ జారీ చేసింది. గవర్నర్ కొన్ని అంశాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కొర్రీలు వేశారు. కొత్త పురపాలక చట్టం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బిల్లు తీసుకువచ్చింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో శాసనసభ, మండలి ఆమోదం కూడా పొందింది. వాస్తవానికి ఆ మరుసటి రోజే గవర్నర్ ఆమోదం పొంది కొత్త చట్టం అమల్లోకి రావాల్సి ఉంది. కానీ, ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వానికే పూర్తి స్థాయి అధికారాలు ఉండటం పట్ల నరసింహన్ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా సదరు బిల్లుకు ఆయన మరికొన్ని సూచనలు చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో గవర్నర్ సూచించిన అంశాలతో రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది.
ఈ బిల్లును ఆమోదించవద్దంటూ దత్తాత్రేయ నేతృత్వంలో బిజెపి నేతలు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు.
తెలంగాణ మున్సిపాలిటీ చట్టం -2019పై చర్చ సందర్భంగా సీఎం కెసిఆర్ మాట్లాడుతూ.. పని చేయని సర్పంచ్‌లు, చైర్‌పర్సన్‌లు, వార్డు మెంబర్లు, కౌన్సిలర్లపై చర్యలు తీసుకునేలా కలెక్టర్లకు అధికారం దఖలు చేశారు. కలెక్టర్ తీసుకున్న చర్యలపై స్టే ఇచ్చే అధికారం మంత్రి నుంచి తొలగించారు. . సర్పంచ్‌ను తొలగించే అధికారం కలెక్టర్‌కు మాత్రమే ఉండేలా చట్టం రూపొందించారు. సవరించిన తెలంగాణ మున్సిపల్ చట్టం -2019 బిల్లును శాసనసభ గత శుక్రవరాం ఆమోదించింది. ఈ బిల్లును ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం సభలో ప్రవేశపెట్టగా శుక్రవారం సభలో బిల్లుపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. చర్చ జరిగిన అనంతరం తెలంగాణ మున్సిపల్ చట్టం -2019 బిల్లును సభ ఆమోదించింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. మున్సిపల్ చట్టంపై సలహాలు, సూచనలు ఇచ్చిన సభ్యులకు ధన్యవాదాలు. జనాభా దామాషా ప్రకారమే రిజర్వేషన్లు ఖరారు చేస్తాం అని అన్నారు. సమయానికి అనుకూలంగా చట్టంలో మార్పులు, చేర్పులు చేయకపోతే భవిష్యత్ తరాలు నష్టపోతాయన్నారు. కలెక్టర్‌కు అధికారాలు అంశంపై కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేసారు. జిల్లా కలెక్టర్‌కు అధికారాలు ఇవ్వొద్దని అభ్యంతరం లేవనెత్తింది. కలెక్టర్‌కు కొత్తగా ఇచ్చిన అధికారం కాదు.. ముందునుంచీ ఉంది. సర్పంచ్‌ల విషయంలో మంత్రికి స్టే ఇచ్చే అధికారాన్ని తొలగిస్తే తప్పేంటి?అని సిఎం కెసిఆర్ వివరణ ఇచ్చారు. అయితే పలు అంవాలను పరిశీలించిన గవర్నర్ తిప్పిపంపడంతో ఇప్పుడు ఆర్డినెన్స్ తీసుకుని వచ్చారు. హైకోర్టు కూడా మున్సిపల్ ఎన్నికలపై తొందరేల అంటూ ప్రశ్నించింది. ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వానికే పూర్తి స్థాయి అధికారాలు ఉండటం పట్ల నరసింహన్ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. బిల్లుకు ఆయన మరికొన్ని సూచనలు చేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే గవర్నర్ సూచించిన అంశాలతో రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది.