బిజెపి బలోపేతం లక్ష్యంగా కార్యక్రమాలు అభివృద్దిని ప్రతి ఒక్కరూ స్వాగతించాలి
కామారెడ్డి,జూలై20: దేశంలో అవినీతిని అంతం చేయడానికి తీసుకున్న చర్యల్లో పెద్ద నోట్ల రద్దు జిఎస్టీ అమలు వంటివి విప్లవాత్మకమైనవని బిజెపి జిల్లా అధ్యక్షులు బాణాల లక్ష్మారెడ్డి అభివర్ణించారు. పేదలకు మెరుగైన జీవితం అందించడమే ప్రధాని లక్ష్యమని చెప్పారు. ఆర్థిక సంస్కరణలకు బాటలు వేసిన మోదీ.. 21వ శతాబ్దపు ఉక్కుమనిషిగా నిలిచారని అన్నారు. దేశంలో అవినీతిని అంతం చేసి, ప్రజలకు సుపరిపాలన అందించేందుకే మోడీ అనేక నిర్ణయాలు చేశారని చెప్పారు. కేంద్రం నిర్ణయాన్ని ప్రజలు ఆమోదిస్తుంటే, కాంగ్రెస్ ఆందోళన బాట ఎందుకు పట్టిందో అర్ధం కావడం లేదన్నారు. 2019 ఎన్నికల్లో నాలుగు పార్లమెంటు స్థానాల గెలుపుతో తెలంగాణఱలో బలపడడమే లక్ష్యంగా బిజెపి పని చేస్తోదని అన్నారు. రాష్ట్రం అభివృద్ధికి కేంద్రం నిధులు పంపిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం వాటిని దారి మళ్లీంచి దుర్వినియోగం చేస్తుందన్నారు. దేశంలో ప్రతి కుటుంబానికి రెండు పడకల ఇళ్లు, మరుగుదొడ్లు, పంట నష్ట పోయిన రైతులకు ఇన్‌పుట్ రాయితీ నిధులు పంపిస్తే వాటిని దారి మళ్లించి రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకున్నారని తెలిపారు. ఎన్నికల్లో దళితులకు మూడు ఎకరాల సాగుభూమి ఇస్తానన్న తెరాస ప్రభుత్వం ఎస్సీ నియోజకవర్గంలో కూడా ఇవ్వలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ దేశ అభివృద్ధికి అడ్డుగా మారిందని విమర్శించారు. భారతీయ జనతా పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేయడమే లక్ష్యంగా పల్లెపల్లెకు భాజపా కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు.