సీఎం సీటు కావాలంటే తీసుకోండి
- – నేనెప్పుడూ అధికారంకోసం భాజపా వద్దకు వెళ్లలేదు
- – వారే నా దగ్గరకు వచ్చారు
- – కాంగ్రెస్ కోరడం వల్లే సీఎంగా బాధ్యతలు స్వీకరించాం
- – సంకీర్ణ ప్రభుత్వంపై బీజేపీ తరచూ కుట్రలు చేస్తుంది
- – బీజేపీ సభ్యుల తీరుపై మండిపడ్డ కుమారస్వామి
- – కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కాపాడుకోలేకపోయిందన్న సీఎం
- – కుమారస్వామి వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యుల అభ్యంతరం
- – సభలో తీవ్ర గందరగోళం
- – సభను మధ్యాహ్నంకు వాయిదావేసిన స్పీకర్
బెంగళూరు, జులై19 : తాను సీఎం కుర్చీని ఎప్పుడూ కోరుకోలేదని, దానికోసం తాను బీజేపీ వద్దకు, ఎవరి దగ్గరికి వెళ్లలేదని కర్ణాటక సీఎం కుమారస్వామి అన్నారు. సంకీర్ణ ప్రభుత్వం ఆధిక్యాన్ని నిరూపించుకునేందుకు గురువారం ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానంపై రెండో రోజు చర్చ జరిగింది. శుక్రవారం సభ ప్రారంభమైన తర్వాత విశ్వాస తీర్మానంపై చర్చ ప్రారంభించాలని స్పీకర్ సీఎంను కోరారు. కాగా నేరుగా అవిశ్వాసం తీర్మానాన్ని పెట్టాలని బీజేపీ సభ్యులు స్పీకర్‌ను డిమాండ్ చేశారు. స్పీకర్ అందుకు సమయం ఉందని, తాను నిర్ణయిస్తానని చెప్పారు. దీంతో కుమారస్వామి మాట్లాడుతూ.. మరోసారి భాజపాపై ధ్వజమెత్తారు. యావత్ దేశం ఇప్పుడు కర్ణాటక రాజకీయ పరిణామాలను చూస్తోందని, 14 నెలల తర్వాత ఈ ప్రభుత్వం చివరి అంకానికి చేరుకుందన్నారు. నేనెప్పుడూ అధికారం కోసం భాజపా వద్దకు
వెళ్లలేదని, వారే నా దగ్గరకు వచ్చారని అన్నారు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ కోరడం వల్లే సీఎంగా బాధ్యతలు చేపట్టానని, ప్రతి సంకీర్ణంలోనూ విభేదాలు సహజమన్నారు. కానీ సంకీర్ణ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని భాజపా తరచూ కుట్రలు పన్నుతోందని కుమారస్వామి విమర్శలు గుప్పించారు. మొదటి రోజు నుంచి ఆ దిశగా యత్నాలు చేస్తోందని, ప్రభుత్వం అస్థిరంగా ఉందంటూ లేనిపోని వాదనలు చేస్తూనే ఉందని, తండ్రీ కుమారులు నడుపుతున్న ప్రభుత్వం అంటూ హేళన చేస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎమ్మెల్యేల రాజీనామాల వ్యవహారం వంటి ముఖ్యమైన అంశాన్ని వదిలేసి అధికారం కోసం భాజపా తొందరపడుతోందని విమర్శించారు. విూకు సంఖ్యాబలం ఉన్నప్పుడు ఈ రోజే బలపరీక్ష పెట్టాలని ఎందుకు పట్టుబడుతున్నారని, విూకు ఈ సీటు కావాలంటే తీసుకోండని, విూరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవచ్చునని, అందులో తొందరేం లేదన్నారు. సోమవారం లేదా మంగళవారం వరకు విూరు ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవచ్చునని, నేనేవిూ సీఎం అధికారాలను దుర్వినియోగం చేయనన్నారు. అయితే అంతకంటే ముందు దీనిపై చర్చ జరపండని కుమారస్వామి ఉద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వాల సమయంలో భాజపా తీరును కూడా విమర్శించారు. 2006లో కాంగ్రెస్‌ను అధికారం నుంచి దింపాలని భాజపా యత్నించిందదని, అప్పుడు మా వద్దకే వచ్చి ప్రభుత్వం ఏర్పాటుచేసుకుందన్నారు. 2007లో సంకీర్ణం కూలినప్పుడూ నా తప్పులేదని, భాజపా తప్పుడు విధానాల వల్లే అలా జరిగిందన్నారు. 2008లో స్వతంత్రులతో కలిసి భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని, తర్వాత ఆ ఎమ్మెల్యేలు నా వద్దకు వచ్చి భాజపా సరైన పార్టీ కాదన్నారని అన్నారు. పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని హత్య చేసిన ఘనత భాజపాదని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నేనెప్పుడూ పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించలేదని కుమారస్వామి చెప్పుకొచ్చారు.
కుమారస్వామి వ్యాఖ్యలపై కాంగ్రెస్ అభ్యంతరం..
ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ తమ ఎమ్మెల్యేలను కాపాడుకోలేక పోయిందని కుమారస్వామి వ్యాఖ్యానించడంతో సభలో గందరగోళం నెలకొంది. కాంగ్రెస్-జేడీఎస్ నేతల మధ్య వాగ్వాదానికి తెరలేపాయి. కాంగ్రెస్ తన సభ్యులను కాపాడుకోలేకపోయిందంటూ సీఎం కుమారస్వామి విమర్శించడంపై కాంగ్రెస్ సభ్యులు మండిపడ్డారు. ఒక్కొక్కరికి ఐదారు కోట్లు ఇస్తుంటే ఎమ్మెల్యేలను ఎలా కాపాడుకోవాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు రెబల్ ఎమ్మెల్యేల తీరుపై స్పీకర్ రమేష్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంత సంపాదించినా జానెడు పొట్టకోసమే.. దానికోసం దిగజారుడు రాజకీయాలు చేస్తారా? సభలో రెండు వర్గాలకు విలువలు లేవు అంటూ అంటూ స్పీకర్ తీవ్రంగా మండిపడ్డారు. సభలో గందరగోళం నెలకొనడంతో సభను మధ్యాహ్నం 3గంటలకు స్పీకర్ వాయిదా వేశారు.