నూతన చట్టంతోనే పారదర్శకత
- – అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతాం
- – అక్రమమని తేలితే నోటీసులివ్వకుండానే కూల్చేస్తాం
- – 75గజాలలోపు ఇంటినిర్మాణానికి రిజిస్టేష్రన్ ఫీజు కేవలం రూపాయే
- – కొత్తచట్టంలో కలెక్టర్లకు విశేష అధికారాలు
- – పనిచేయని ప్రజాప్రతినిధులపై చర్యలు తప్పవు
- – సర్పంచ్‌ను తొలగించే అధికారం కలెక్టర్‌కు ఉంటుంది
- – కలెక్టర్ నిర్ణయంపై స్టే ఇచ్చే అధికారాల నుంచి మంత్రులను తొలగిస్తున్నాం
- – రాష్ట్రం పచ్చదనంతో పరిఢవిల్లాలి
- – పట్టణాలు, పల్లెల్లో పచ్చదనం నింపుకోవాలి
- – కలెక్టర్ ఆధ్వర్యంలో ఓ గ్రీన్‌కమిటీని ఏర్పాటుచేస్తాం
- – హరితహారం లక్ష్యాలు పూర్తిచేయని అధికారులను తొలగిస్తాం
- – లక్ష్యం సాధించాలనే చట్టంలో కఠిన నిబంధనలు పెట్టాం
- – ప్రజాదర్భార్ ద్వారా పోడు భూములకు పరిష్కారంచూపుతాం
- – ఆగస్టు 15 నుంచి రియల్‌టైం పరిపాలన సంస్కరణలు అమలుచేస్తాం
- – నూతన పురపాలక చట్టం -2019 ప్రాముఖ్యతను వివరించిన సీఎం కేసీఆర్
హైదరాబాద్, జులై 19(జ్యోతి న్యూస్) : మున్సిపాలిటీల్లో పునరుత్తేజం నింపడం కోసంమే కొత్త చట్టం తీసుకొస్తున్నామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. కొత్త మున్సిపల్ చట్టం ద్వారా పారదర్శకతను తీసుకొస్తామని అన్నారు. నూతన పురపాలక చట్టం -2019 ప్రాముఖ్యతను వివరిస్తూ సభలో కేసీఆర్ ప్రసంగించారు. నూతన చట్టం ద్వారా పాదర్శక పాలన అందించే అవకాశం ఉంటుందని అన్నారు. అక్రమ నిర్మాణాలు చేపడితే నోటీసు ఇవ్వకుండానే కూల్చివేస్తామని స్పష్టం చేశారు. అక్రమ కట్టడాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించమన్నారు. యజమానులే ఇంటి నిర్మాణానికి సంబంధించిన సెల్ఫ్ సర్టిఫికేషన్ ఇవ్వాలని అన్నారు. కలెక్టర్ ఆధ్వర్యంలోని ప్లెయింగ్ స్క్వాడ్ బృందం ఇళ్లకు సంబంధించిన కొలతలు చేపడుతుందని అన్నారు. 500 చదరపు గజాల వరకు నిర్ణీత సమయంలో ఆన్‌లైన్‌లోనే అనుమతి వస్తుందన్నారు. తెలంగాణ ప్రభుత్వానిది ‘సిటిజన్ ఫ్రెండ్లీ ఆర్బన్ పాలసీ’ అని కేసీఆర్ పేర్కొన్నారు.
ఎన్నికల కమిషన్ అటానమస్ ఎన్నికల కమిషన్ అనేది ఓ స్వతంత్ర సంస్థ అని, ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల సంఘానికి పూర్తి స్వేచ్ఛ ఉంటుందని కేసీఆర్ పేర్కొన్నారు. ఈసీ విధుల్లో కలుగజేసుకోబోమని, అయితే పురపాలిక ఎన్నికల తేదీలను నిర్వహించే అధికారం మాత్రం ప్రభుత్వానికే ఉంటుందని స్పష్టం చేశారు. రానున్న మూడేళ్లలో అద్భుతం జరగుతుందని తాను ఆశిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పరిపాలన విధానంలో మెనాటనీ వచ్చిందని, ముఖ్యమంత్రి, స్పీకర్‌కు లేని అధికారాలు వీఆర్వోలకు ఉన్నాయని అన్నారు. వీఆర్వో తలచుకుంటే ఒకరి భూమిని మరొకరికి రాసిచ్చేయగలరని తెలిపారు. ఈ కొత్త చట్టం ద్వారా అధికారులు, ఉద్యోగులు ఎక్కడి నుంచి ఎక్కడికైనా బదిలే చేసే అధికారం వస్తుందని కేసీఆర్ స్పష్టం చేశారు. కొత్త డోర్ నంబర్లు ఇస్తున్నామని, రాష్ట్రంలో ప్రతి ఇంటికి డోర్ నంబర్ కచ్చితంగా ఉండాలని కేసీఆర్ శాసనసభలో వెల్లడించారు. గ్రామ స్వరాజ్యం
కోసం మహాత్మాగాంధీ కలలు కన్నారని.. పంచాయతీరాజ్ అనేది ఒక విభాగం కాదు..ఉద్యమమని అన్నారు. తాను దుబ్బాక స్కూల్లో చదువుకునే రోజుల్లో పంచాయతీ రాజ్ స్పూర్తిని చవిచూశానని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. ఆకలితో అలమటిస్తోన్న ప్రజల కడుపులు నింపాలని చెప్పారు. సముద్రం పాలయ్యే నీటికి ఆనకట్టలు కట్టి పొలాలకు మలపాలని, ఆహార భద్రత విషయంలో స్వావలంభన అందించాలని అన్నారు. ప్రతీ ప్రజాప్రతినిధి పంచవర్ష ప్రణాళికను అధ్యయనం చేయాలని, రెండో పంచవర్ష ప్రణాళికను నెహ్రూ పూర్తిగా మార్చేశారన్నారు. ఆధునిక దేవాలయాల పేరుతో ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. పంచాయతీ రాజ్ ను ఒప్పుడు కమ్యూనిటీ డెవలప్ మెంట్ అనేవారు. బలమైన పునాదులున్న రాజ్యాంగం మనది. రాజేంద్రనగర్ లో నాడు ఎస్కేడే స్థాపించిన సంస్థే ఎన్‌ఐఆర్డీ అని అన్నారు. పంచాయతీ రాజ్ ఉద్యమంలో ఉన్న గొప్పతనం. అందులో పనిచేసిన వాళ్లు అవలంభించిన విధానాలు, ఆనాటి సమితి అధ్యక్షులు, ఆనాటి బీడీవోలు వాళ్లను సమాజం గౌరవించిన తీరుతెన్నులు చాలా చాలా గొప్పగా ఉండే. అటువంటి స్పిరిటే మున్పిపాలిటీల్లో కూడా ఉండేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. తర్వాత మనదేశంలో భయంకరమైన రాజకీయమైన జబ్బులు అలుముకున్నాయి. అవన్నీ విస్తరించి ఈ ఉద్యమాలను పొలిటికలైజ్ చేసి, డిపార్టుమెంటలైజ్ చేసి స్పిరిట్ ను చంపశారన్నారు. అవి పొందాల్సిన
అవసరముందని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు.
కేవలం రూపాయికే ఇంటి రిజిస్టేష్రన్..
అవినీతి రహిత పాలన కోసం నూతన పురపాలక చట్టం తెస్తున్నామని చెప్పారు. పంచాయతీ అనేది ఒక విభాగం కాదని, ఓ ఉద్యమమని అన్నారు. గ్రామ స్వరాజ్యం కోసం మహాత్మాగాంధీ కలలు కన్నారని గుర్తుచేశారు. పంచవర్ష ప్రణాళికలపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలని కేసీఆర్ అన్నారు. ఎమ్మెల్యేలందరికీ శిక్షణ ద్వారా పంచవర్ష ప్రణాళికలపై అవగాహన కల్పిస్తామన్నారు. భారత ప్రజాస్వామ్యం విస్త్రృతమైనదని, మనది చాలా బలమైన ప్రజాస్వామ్య పునాదులున్న దేశమని గుర్తు చేశారు. భావితరాలకు బతకగలిగే పరిస్థితులను మనం అందించాలని కేసీఆర్ అన్నారు. తెలంగాణ పురపాలక చట్టం-2019 ద్వారా పారదర్శకత వస్తుందన్నారు. అవినీతి రహిత మున్సిపల్ వ్యవస్థ నిర్మాణమవుతుందని చెప్పారు. పేదల కోసం పౌరసదుపాయాలు కల్పించామన్నారు. ఈ చట్టాన్ని అనుసరించి 75గజాల లోపు ఇంటి నిర్మాణానికి రిజిస్టేష్రన్ ఫీజు కేవలం రూపాయి మాత్రమే ఉంటుందని, జీ ప్లస్ 1 వరకు రూపాయితో రిజిస్టేష్రన్ చేసుకోవచ్చని తెలిపారు. అదేవిధంగా 75గజాలలోపు కట్టుకున్న ఇంటికి ఆస్తిపన్ను కేవలం రూ.100 మాత్రమే ఉంటుందన్నారు. 15వ ఫైనాన్స్ కమిషన్ అధ్యయనాలు పూర్తి కావొస్తున్నాయని తెలిపారు. 14వ ఆర్థిక సంఘం సిఫారసుల ప్రకారం గ్రావిూణ ప్రాంతాలకు రూ.1600 కోట్లు, పట్టణ ప్రాంతాలకు రూ.1030 కోట్లు వస్తున్నాయని సీఎం తెలిపారు. 500 జనాభా ఉండే చిన్న గ్రామానికి కూడా నిధులు పుష్కలంగా వస్తాయని, ఆర్థిక సంఘం సిఫారసు ప్రకారం వచ్చే నిధులకు సమానంగా మనం కూడా సమకూర్చుకుంటామన్నారు. పంచాయతీ, మున్సిపాలిటీలకు నిధుల కొరత ఉండదన్నారు. యూరప్, అమెరికా లాంటి దేశాల్లో కూడా సమస్యలుంటాయని, కొత్త మున్సిపల్ చట్టంలో కలెక్టర్లకు విశేష అధికారాలు కల్పించామని సీఎం వెల్లడించారు.
పనిచేయని సర్పంచ్‌లపై చర్యలు తప్పవు..
రాష్ట్రంలో జిల్లా కలెక్టర్ల పాత్ర మరింత కీలకం చేశామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. పని చేయని సర్పంచ్‌లు, చైర్‌పర్సన్‌లు, వార్డు మెంబర్లు, కౌన్సిలర్లపై చర్యలు తప్పవు అన్నారు. కలెక్టర్
తీసుకున్న చర్యలపై స్టే ఇచ్చే అధికారం మంత్రి నుంచి తొలగించామని కేసీఆర్ స్పష్టం చేశారు. సర్పంచ్‌ను తొలగించే అధికారం కలెక్టర్‌కు ఉందని, ఒక సర్పంచ్‌ను కలెక్టర్ తొలగిస్తే.. సదరు సర్పంచ్ ఉదయం 11గంటలకు ఎమ్మెల్యే, 12 గంటలకు మంత్రి ఇంట్లో కనిపిస్తాడని అన్నారు. సస్పెండ్ ఆర్డర్‌పై ఒంటి గంటకు స్టే వస్తదని, మళ్లా.. కలెక్టర్ ముందు కాలర్ ఎగరేసుకుంటూ సర్పంచ్ కుర్చుంటాడని, ఇది ప్రస్తుత పరిస్థితి అని కేసీఆర్ వాపోయారు. అందుకే ఇప్పుడు మంత్రి ఇచ్చే స్టే అధికారాన్ని తీసేశామని, నియంత్రణ జరగాలనే ఉద్దేశంతో ఈ నిబంధనను చట్టంలో తీసుకువచ్చామని అన్నారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు ఈ చట్టం చదువుకోవాలని, చట్టం చదవకుండా తర్వాత బాధపడితే ప్రయోజనం ఉండదని సీఎం అన్నారు. కొత్త పురపాలక చట్టం కొందరికి నచ్చకపోవచ్చునని, ప్రజాప్రతినిధులందరూ కచ్చితంగా శిక్షణలు పొందాలని, చట్టం పాస్ చేసిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని నేనే కోరాను అని సీఎం కేసీఆర్ వెల్లడించారు.
ఏడు కొత్త మున్సిపల్ కార్పొరేషన్లు..
కొత్త మున్సిపల్ కార్పొరేషన్లు కొన్ని ఏర్పాటు చేస్తున్నామని కేసీఆర్ ప్రకటించారు. బడంగ్‌పేట, బండ్లగూడ జాగీర్, బోడుప్పల్, ఫీర్జాదిగూడ, జవహర్‌నగర్, నిజాంపేట్‌తో పాటు విూర్‌పేట్, జిల్లెలగూడను కలిపి విూర్‌పేట మున్సిపాలిటీలను మున్సిపల్ కార్పొరేషన్లుగా ఈ చట్టం ద్వారానే ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. దీని వల్ల జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, ఈ కొత్త కార్పొరేషన్ల మధ్య సామరస్యం పెరిగి మంచి ఫలితాలు రాబట్టగలుగుతాయన్నారు. స్థానిక శాసనసభ్యుల అభ్యర్థనల మేరకు ఈ కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని తెలిపారు. రాష్ట్రంలో మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, పట్టణాభివృద్ధి సంస్థలు మాత్రమే ఉంటాయని, పారదర్శకంగా అనుమతులు లభించేందుకు వీలుగా ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగిందని సీఎం పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా పూర్తి అవగాహనతో ఈ చట్టం రూపకల్పన చేశామని, చట్టంలోని ప్రతి వాక్యం నేనే రాయించానని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
తెలంగాణలో అద్భుతం జరుగబోతోంది..
ప్రభుత్వం తీసుకువచ్చే పరిపాలన సంస్కరణలతో మూడు సంవత్సరాల్లో తెలంగాణలో అద్భుతం జరుగబోతోందని ఆశిస్తున్నామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. అడవులు పెరగాలి.. రాష్ట్రం పచ్చదనంతో పరిఢవిల్లాలి. పట్టణాలు, ప్లలెల్లో పచ్చదనం ఎలా రాదో చూస్తామన్నారు. కలెక్టర్ ఆధ్వర్యంలో ఓ గ్రీన్ కమిటీని ఏర్పాటు చేస్తామని, హరితహారం లక్ష్యాలు పూర్తిచేయని ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకుంటామన్నారు. హరితహారం లక్ష్యాలు పూర్తి చేయని అధికారులను ఉద్యోగాల నుంచి తొలగిస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రభుత్వ పరిపాలన విధానంలో మోనోపలి వచ్చింది. ముఖ్యమంత్రి, స్పీకర్‌కు లేని అధికారాలు వీఆర్వోలకు ఉన్నాయని సీఎం అభిప్రాయపడ్డారు. వీఆర్వో తలచుకుంటే ఒకరి భూమిని మరొకరికి రాసిస్తారని, కొంతమంది వీరిని ప్రోత్సహిస్తున్నారన్నారు. ఇలాంటి ఘటనలను ఉపేక్షించమని, వీటన్నింటిని అరికడుతామని కేసీఆర్ అన్నారు. అధికారులు, ఉద్యోగులు ఎక్కడి నుంచి ఎక్కడికైనా బదిలీ చేసే అధికారం ఈ చట్టం ద్వారా వస్తుందని అన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో అధికారులు, ఉద్యోగులు పదవీ విరమణ వరకు అక్కడే పని చేస్తున్నారని, ఒకే పరిధిలో పని చేయడం వల్ల వాళ్లను ఎవరూ ఏం చేయలేకపోతున్నారన్నారు. నిర్ణీత సమయంలో అవినీతి రహితంగా ప్రజలకు సేవలు అందిస్తామని, ముఖ్యమంత్రి, సంబంధిత శాఖ మంత్రులు మాత్రమే పని చేస్తే సరిపోదని సీఎం తెలిపారు. తప్పులు చేసేవాళ్ల పట్ల శిక్షలు కూడా కఠినంగానే అమలు చేస్తామని, మున్సిపల్ చైర్‌పర్సన్స్, సర్పంచ్‌లు,
కౌన్సిలర్లు, వార్డు మెంబర్లు సహా ప్రతి ప్రజాప్రతినిధితో సహకరించాలని, బాధ్యతలు నిర్వర్తించని ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకుంటామన్నారు. సర్పంచ్‌లు, కార్యదర్శులతో పాటు అందరూ బహుముఖంగా పని చేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. లక్ష్యం సాధించాలనే ఉద్దేశంతో చట్టంలో కఠిన నిబంధనలు పెట్టామని, ప్రతి వార్డులో మహిళా సంఘం, యూత్ కమిటీతో పాటు పలు సంఘాలు ఉంటాయని, ప్రతి కమిటీ సమావేశం నెలలో మూడో వారంలో జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో వార్డు ప్రజల గురించి చర్చించాలని సీఎం కేసీఆర్ సూచించారు.
ప్రజాదర్బార్ ద్వారా పోడు భూముల పరిష్కారం..
ప్రజాదర్బార్ ద్వారా పోడుభూముల సమస్యను పరిష్కరిస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. ఆగస్టు 15 నుంచి రియల్ టైం పరిపాలన సంస్కరణలు అమలు చేస్తామన్నారు. పోడుభూముల పరిష్కారం కోసం జడ్పీ కార్యాలయాల్లోనూ, కలెక్టరేట్‌లలోనో విూటింగ్‌లు పెట్టకుండా సమస్యలున్న చోట సమావేశాలు నిర్వహించి పోడు భూముల సమస్యను పరిష్కరించేలా కృషి చేస్తానని అన్నారు. సమస్య పరిష్కారం అనంతరం అప్పటి వరకు ఉన్న అడవీ ప్రాంతంలో ఎవరు వేలుపెట్టినా కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు. పట్టణాలు, ప్లలెల్లోనూ గ్రీన్ కవర్ పాలసీని అమల్లోకి తెస్తున్నామన్నారు. కలెక్టర్ ఆధ్వర్యంలో ఓ గ్రీన్ కమిటీని ఏర్పాటు చేస్తామని సీఎం పేర్కొన్నారు. కొత్త పురపాలక చట్టంలో ప్రతివాక్యం తానే రాయించానన్న కేసీఆర్.. ఈ చట్టం కొందరికి నచ్చకపోవచ్చని వ్యాఖ్యానించారు. ప్రజాప్రతినిధులందరూ కచ్చితంగా శిక్షణ పొందాలని అన్నారు. చట్టం పాస్ చేసిన తర్వాతే పురపాలిక ఎన్నికలు నిర్వహించాలని తానే కోరానని కేసీఆర్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి, సంబంధిత శాఖ మంత్రులు మాత్రమే పని చేస్తే సరిపోదని, బాధ్యతలు నిర్వర్తించని ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకుంటామని అన్నారు. హరితహారం లక్ష్యాలు పూర్తి చేయని ప్రజాప్రతినిధులు, అధికారులపై చర్యలు తప్పవన్నారు