ఓల్డ్ ఇస్ న్యూ
కొత్తొక వింత..పాతొక రోత ట్రెండ్ మారిపోయింది. ప్రస్తుతం అంతా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటున్నారు. నిజంగానే ఇది అన్నింటికి వర్తిస్తుంది. ఉదాహరణకు ఆనాటి హీరోయిన్లు పాటించిన ఫ్యాషనే ఇప్పుడు ట్రెండీగా మారింది.
వారు ధరించిన నగలు, డ్రస్సింగ్ స్టైల్ నే.. ఇప్పటి హీరోయిన్లు ఫాలో అవుతూ ఫ్యాషన్ అంటూ హొయలొలుకుతున్నారు. పాతతరం హీరోయిన్లను గమనించినట్లయితే చక్కని శరీరాకతితో అందంగా ముద్దుగా బొద్దుగా ఉండేవారు. వారి నటన కూడా అంత గొప్పగా ఉండేది మరి. నటన మాత్రమే కాదు. స్టైల్ విషయంలో.. డ్రస్సింగ్ సెన్స్ విషయంలో.. హెయిర్ స్టైల్ విషయంలో.. మేకప్.. ఇలా ప్రతి ఒక్క విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకునేవారు. అందంగా కనిపించడానికి వారు పాటించిన టిప్స్ ఇప్పుడు మన హీరోయిన్లు కూడా ఫాలో అవుతున్నారు.
మెడ చేతులు కనిపించకుండా జాకెట్లు వేసుకునే పాతకాలం పోయింది. నేడు ఎంత తక్కువ బట్టతో, ఎంత ఒళ్లు కనిపించేలా బ్లౌజు ధరిస్తే అంత ఆధునికత, అంత ఫ్యాషన్‌గా గుర్తించబడుతుందనే విమర్శ కూడా జాకెట్లు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ విమర్శ నేటి హిందీ, తెలుగు సినిమా తారల దుస్తుల విషయంలో మరింతగా వర్తిస్తుంది. ”మంచి ఛాయ, ఆకారం గల శరీరం ఉంటే చూపించడంలో తప్పేముందిఅనేది ఈ రంగంలో ఫ్యాషన్ డిజైనర్ల సూచన. ఆధునిక జాకెట్ల విషయం ఇలా ఉంటే పూర్వం అసలు జాకెట్టు వేసుకునేవారు కారని అంటుంటారు. అయితే ఆధునిక పోకడలు పోతున్న భారతీయ జాకెట్లకు తాజా ఉదాహరణగా కచులిని చెప్పవచ్చు.
కచులి అంటే కుట్టు అక్కర లేకుండా కేవలం ఒక బట్ట ఛాతి ముందు భాగాన్ని కప్పి వెనక భాగంలో దారాలతో ముడివేసేలా తయారై ఉంటుంది. దీని స్ఫూర్తితో తయారైనవే వీపు భాగం కనబడేట్టుండే నేటి చోళీలు. మాధురీ దీక్షిత్ సినిమాల్లో ఇలాంటి జాకెట్లు వేసుకోవడంతో అప్పటి నుంచి ఈ ఫ్యాషన్ మరింత పెరిగిపోయింది. మొదట బ్లౌజులు కుట్టినప్పుడు మణికట్టు వరకూ చేతులు ఉండేవి. ఇలాంటివి వహీదా రెహమాన్ వేసుకుని పాత సినిమాల్లో కనిపిస్తుంది. అప్పట్లో దాదాపు మహిళలంతా ఒకేరకమైన జాకెట్లు ధరించేవారు. తర్వాత చెప్పుకోవాల్సంది లేసుల గురించి లండన్‌లోని ఫ్యాషన్ విధానాలను మన జాకెట్లలో గుప్పించడం వల్ల తయారైనవే భుజం నుండి చేతి మణికట్టు వరకు కప్పి ఉండే పూర్తిచేతుల జాకెట్లు. వాటిలో విపరీత ధోరణులు కానీ, ఎలాంటి ఆధునిక పోకడలు కానీ ఉండేవి కావ్ఞ. అయితే అప్పటికీ, ఇప్పటికీ సినీతారలు ధరించే దుస్తులు అప్పటివరకు ఉన్న ఫ్యాషన్‌ను మార్చేవిగానే గర్తించబడుతున్నాయి.
తాజాగా కొన్ని సినిమాల్లో బుట్టచేతుల జాకెట్టు ధరించిన తారలు నాటి స్త్రీత్వానికి ప్రతీకగా భావించే వస్త్రాలంకరణను పోలి ఉంది. హోల్డర్ నెక్స్, వీపు భాగం పూర్తిగా కనిపించేలా ఉండే చోళీలు. లో ‘యు నెక్స్, బోట్ నెక్స్, ఆఫ్ ద షోల్డర్స్ లాంటి పలురకాల జాకెట్లు నేడు ఆధునిక పోకడలతో, కొంత మార్పులూ, చేర్పులూ, చమక్కులు చేర్చుకుని కొత్తకొత్త అవతారాలూ ఆధునిక చీరలకు జోడీలుగా దర్శనమిస్తున్నాయి. శాటిన్ చీరలకు ఎంబ్రాయిడరీ చేసిన, లేసువర్కుతో ఉన్న జాకెట్లను జోడించి డిజైనర్లు తయారుచేసిన చీరలు మగువల మనసును దోచుకుంటున్నాయి.
అలాగే హోల్డర్ నెక్కుల్లో ప్రత్యేకతలు, వీపుభాగం పూర్తిగా కనిపించేలా ఉండే చోళీలు, సంప్రదాయబద్ధమైన రౌండ్ నెక్ జాకెట్లు, వీపుభాగంలో నాడలు, చిన్నచిన్న రంధ్రాలు, ఎంబ్రాయి డరీలతో ముస్తాబైన పొట్టి చేతుల జాకెట్లు రూపొందించడం ద్వారా వారు కొత్తకొత్త రకాలను పరిచయం చేస్తున్నారు. ఎంబ్రాయిడరీ అనేది ఏకాలంలోనైనా నిత్యనూతనంగా పరిగణించబడే డిజైను కాబట్టి డిజైన్లలో వీలయినంతవరకు ఎంబ్రాయిడరీని ఉపయోగించుకుంటున్నారు మగువలు.
నేటికాలంలో జాకెట్ల రూపకల్పనలో ప్రత్యేకంగా ఒకేరకం బట్ట కాకుండా భిన్నమైన రంగుల్లో ఉండే అన్ని రకాల బట్టలను వాడుతున్నారు. వీటికి బీడ్స్, స్వీకెన్స్, రైన్‌స్టోన్స్, బకెల్స్ ఇలా రకరకాల అలంకరణలనూ జోడిస్తున్నారు. ఇదివరకు జాకెట్లకు కేవలం నూలు, షిఫాన్, జార్జెట్ బట్టలను వాడేవారు. ఎన్ని మార్పులు వచ్చినా, ఎన్ని కొత్త ఫ్యాషన్‌లు ముంచెత్తినా ఒకరోజు ఎబ్బెట్టుగా, అతిగా ఉందనిపించిన ఫ్యాషనే మరుసటిరోజు హదయాలను అలరించేదిగా అనిపించి, బాగుందే అనిపించవచ్చు. అదంతా ఆ ఫ్యాషన్‌కు మన మనసు స్పందించే తీరుపై ఆధారపడి ఉంటుంది.
ఏది ఏమైనా కొత్త ఫ్యాషన్ల జాకెట్లంటే మక్కువ చూపని మహిళలు ఉండరంటే అతిశయోక్తి ఎంతమాత్రమూ కాదు.
హెయిర్ స్టైల్స్
పాత సినిమాలలో రకరకాల హెయిర్ స్టైల్స్‌ను మనం గమనించవచ్చు. అప్పటి హీరోయిన్ల జుట్టు పొడవుగా ఉండడంతో వారు రకరకాల జడలు వేసుకునేవారు. అవి చూడడానికి ఎంతో స్టైలిష్ గా ఉండేవి. ముడులు, కొప్పులు, కర్లింగ్, రెండు జడలు.. ఇలా అనేక రకాల హెయిర్ స్టైల్స్ ను అప్పట్లోనే వేసుకునేవారు. ఇవే ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి. చూడండి ఆ లుక్స్.
నగలు
ఆనాటి చిత్రాల్లో హీరోయిన్లు వాడిన నగలు ఇప్పుడు ట్రెండీగా కనిపిస్తున్నాయి. ఉదాహరణకు అప్పట్లో చోకర్ సెట్ చాలా ఫేమస్. రాను రాను అది పాతపడిపోయింది. ఇప్పుడు ఆ సెట్ ధరించని పెళ్లికూతురు లేదంటే నమ్మగలరా? అసలు ఏ చీరకు ఎలాంటి నగలు వేసుకోవాలి? ఎలాంటి ఇయర్ రింగ్స్ పెట్టుకోవాలి? అని తెలుసుకోవాలంటే పాత సినిమాలు చూస్తే సరిపోతుంది.
హ్యాండ్ బ్యాగ్స్
అలనాటి హీరోయిన్లు వాడిన హ్యాండ్ బ్యాగులు చూడముచ్చటగా చాలా క్యూట్ గా కనిపించేవి. ఇప్పుడు అవే ట్రెండీగా అయిపోయాయి. ఇప్పుడు ప్రతి ఒక్క నటి చేతిలో ఇలాంటి బ్యాగ్స్ దర్శనమిస్తున్నాయి.
బొట్టు, కాటుక
నిజంగా అందం అనేది పాతసినిమాలోనే కనిపిస్తుంది. అలనాటి తారల కళ్లు విశాలంగా ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఒక్క కాటుకతోనే వారి కళ్లు ఎంతో అందంగా మెరిసిపోయేవి. కావాలంటే కష్ణకుమారి, సావిత్రి, అంజలీదేవి, వాణిశ్రీ లాంటి వారి కళ్లను చూడండి మీకే అర్ధమవుతుంది. బొట్టు కూడా చాలా అందంగా కనిపిస్తుంది. అప్పట్లో ఒకడుగు ముందుకేసి జమున లాంటి హీరోయిన్స్ స్టిక్కర్లు కూడా వాడారు. ఉన్నవాటితోనే అందంగా మురిసిపోయేవారు.
శారీ బ్లౌజ్
పాత సినిమాల్లో హీరోయిన్లను చూస్తే అప్పటిలోనే నెట్ చీరలు, పంజాబీ డ్రస్సులు ధరించేవారు. వారు వేసుకునే బ్లౌజ్ లు కూడా చాలా మోడ్రన్ గా అనిపిస్తాయి. కాలర్ నెక్, ఫుల్ హ్యాండ్స్, వి షేప్ నెక్ అంటూ అప్పట్లో తమ అందాలతో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసేవారు. ఇప్పుడు ఇవే ట్రెండ్. చూసారుగా అప్పటి ఫ్యాషన్ ఇప్పుడు ఎలా ట్రెండ్ అవుతోందో. మీరు ఇంకా ఏమైనా గమనించి ఉంటే కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.