చక్కర వ్యాధికి చెక్‌ పెట్టే…..!

మెంతి టీ 
ఇటీవలి కాలంలో వయసుతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరూ మధుమేహంతో బాధపడుతున్నారు. ఆధునిక జీవన శైలి, సరైన వ్యాయామం లేని కారణంగా పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డయాబెటిస్‌ కారణంగా తీపి తినాలనుకుంటే నోరు కట్టేసుకోవడమే కాకుండా.. తరచూ చెకప్‌లు చేయించుకోవడం, ఇన్సులిన్‌ స్థాయిని అదుపులో ఉంచేందుకు ఇంజక్షన్‌లు తీసుకోవడం పెద్ద ప్రహసనం. ఇక డయాబెటిస్‌తో పాటు అత్యధికులను బాధిస్తున్న మరో సమస్య ఒబేసిటి. 


ఈ ఆరోగ్య సమస్యలన్నింటికీ మెంతి టీతో చెక్‌ పెట్టవచ్చంటున్నారు న్యూట్రీషనిస్టులు. మెంతి గింజలతో తయారు చేసే తేనీరుతో మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చని చెబుతున్నారు. అదే విధంగా పరగడుపున ఈ టీ తాగడం ద్వారా స్థూలకాయం నుంచి విముక్తి పొందవచ్చని పేర్కొంటున్నారు. అంతేగాక కడుపునొప్పితో బాధ పడేవారికి మెంతి టీ యాంటాసిడ్‌గా ఉపయోగపడి.. జీర్ణ ప్రక్రియను సులభతరం చేస్తుందని వెల్లడిస్తున్నారు. వేడినీళ్లలో గుప్పెడు మెంతి గింజలను కలుపుకొని తాగడం ద్వారా కొలెస్ట్రాల్‌ను కూడా అదుపులో ఉంచుకోవచ్చంటున్నారు. తరచుగా ఈ టీని తాగితే కిడ్నీలో రాళ్లు కరిగించుకోవచ్చని పేర్కొంటున్నారు. 
మెంతి టీ తయారీ 
ఒక టీ స్పూను మెంతి గింజలను తీసుకుని పొడి చేయాలి. ఒక కప్పులో నీటిని తీసుకుని వేడి చేసి.. అందులో మెంతి పొడి కలపాలి. కావాలనుకుంటే టీ స్పూన్‌ తేనె, తులసి ఆకులు, తేయాకులను కూడా ఈ మిశ్రమంలో కలుపుకోవచ్చు. 2-3 నిమిషాల తర్వాత ఈ టీని తాగినట్లైతే మంచి ఫలితాలు పొందవచ్చు. 
పురాతన కాలం నుండి మెంతులు మన వంటింటిలో ప్రముఖమైన పాత్రను పోషిస్తున్నాయి. వంటల్లో మెంతులను వేయటం వలన వంటకు మంచి రుచి,వాసన వస్తుంది. మెంతులు రుచికి కొంచెం చేదుగా ఉంటాయి. పసుపు రంగులో ఉండే మెంతి గింజలలో కొన్ని రకాల రసాయనాలు ఉంటాయి. ఈ రసాయనాల కారణంగానే మెంతి గింజల్లో జిగురు, చేదు రుచి ఉంటుంది.మెంతులు చేసే మేలు గురించి తెలిస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. మెంతుల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం. మెంతులలో కావలసినంత పీచు వుంటుంది. మెంతులలో ఇనుము సమ ద్ధిగా ఉంటుంది. దీంతోపాటు విటమిన్‌-సి, బి1, బి2, కాల్షియం కూడా ఉంటాయి. కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. 
ప్రతి రోజు ఉదయం పరగడుపున నానబెట్టిన మెంతులను మరియు ఆ నీటిని త్రాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. రాత్రి సమయంలో ఒక గ్లాస్‌ నీటిలో ఒక స్పూన్‌ మెంతులు వేసి నానబెట్టి మరుసటి రోజు ఉదయం మెంతులను మరియు ఆ నీటిని పరగడుపున త్రాగాలి. ఇలా చేయటం వలన మన శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయి.జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడి తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యి గ్యాస్‌,అసిడిటీ,మలబద్దకం వంటి జీర్ణ సంబంధ సమస్యలు రాకుండా ఉంటాయి. మెంతుల్లో ఉండే జిగురు తత్త్వం పేగుల్లో అల్సర్‌ లను తగ్గిస్తుంది. 
అలాగే పేగుల లోపలి వాపును తగ్గిస్తుంది. మెంతుల్లోని చేదు తత్వాలు కాలేయాన్ని శక్తివంతం చేస్తాయి. అలాగే పోషక తత్వాల విలీనానికి సహాయపడతాయని ఈ ఆమధ్య జరిగిన అధ్యయనాల్లో తేలింది. మధుమేహం ఉన్నవారికి మెంతులు ఒక వరంగా చెప్పవచ్చు. పరగడుపున నానబెట్టిన మెంతులను తినటం వలన రక్తంలో చక్కర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. దాంతో మధుమేహం అదుపులో ఉంటుంది. పసిపిల్లలకు పాలిచ్చే తల్లులు రెగ్యులర్‌ గా నానబెట్టిన మెంతులను తింటే వారిలో పాలు బాగా ఉత్పత్తి అవుతాయి. కొలస్ట్రాల్‌ తో బాధపడేవారు ప్రతి రోజు నానబెట్టిన మెంతులను తింటే అతి ప్రమాదకరమైన లోడెన్సిటీ లిపో ప్రొటీన్‌ (ఎల్‌డిఎల్‌ కొలెస్ట్రాల్‌) తగ్గుతుందని ఇటీవల జరిగిన పరిశోధనల్లో తేలింది.